వీరఘట్టం తహసీల్దార్‌కు గాయాలు
వీరఘట్టం: వీరఘట్టం ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన ప్రమాదంలో వీరఘట్టం తహసీల్దార్ చందక సత్యనారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 8 గంటల సమయంలో కార్యాలయంలో పనులు ముగించుకుని వీరఘట్టం ప్రధాన రహదారి మీదుగా కారులో తహసీల్దార్ వెళ్తున్నారు. తెలగవీధి కూడలి వద్ద ఉన్న మలుపు తిరిగిన వెంటనే పక్కనే ఉన్న వైన్ షాపు నుంచి మద్యం కొనుగోలు చేసిన ఓ వ్యక్తి సడన్‌గా కారుకు ఎదురుగా వచ్చాడు. ఆ వ్యక్తిని తప్పించే యత్నంలో పక్కనే ఉన్న డివైడర్‌ను కారు ఢీకొట్టింది. కారులో ఉన్న బెలూన్స్ ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తహసీల్దార్ తలకు గాయాలు కావడంతో వీరఘట్టంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కారులో తహసీల్దార్‌తో పాటు సర్వే డీటీ ప్రసాదరావు, మరో ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు. వారెవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. తహసీల్దార్ కారుకు ప్రమాదం జరిగిందని తెలియడంతో రెవెన్యూ సిబ్బంది పెద్ద సంఖ్య లో ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆయనను పరామర్శించారు. వైద్య చికిత్స అనంతరం ఆయనను స్వగ్రామం పొగిరి తరలించారు.
అడ్డుగా వచ్చిన వ్యక్తిని తప్పించబోయి
డివైడర్‌ను ఢీ కొట్టిన కారు
Comments
Please login to add a commentAdd a comment