ఆగితే అథోగతి..!
నాటి పురోగతి..
ఉద్యోగుల ఆశల సౌథం నిర్మితం కావాలి..
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లా ఆవిర్భావం తర్వాత.. వెనుకబడిన ప్రాంతం అనే ముద్రను చెరిపేసేందుకు శరవేగంగా అడుగులు పడ్డాయి. గిరిజన జనాభా అధికంగా ఉండటం.. వనరులు కూడా తక్కువే కావడంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందుకనుగుణంగానే.. ఈ ప్రాంతంలో ఎన్నడూ లేని అభివృద్ధిని ఇక్కడి ప్రజలు చూడగలిగారు. ఈ ప్రాంత విద్యాభివృద్ధికి కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల.. ఉమ్మడి జిల్లా పరిధిలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణం.. జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి.. ప్రభుత్వ వైద్య కళాశాల, సీతంపేటలో ఆస్పత్రి.. ఇలా ఎన్నో మౌలిక సదుపాయాలు చేరువయ్యాయి. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. ఆ దిశగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. అంతేకాదు.. డోలీల మోత తప్పించేందుకు గిరి శిఖర గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించింది. కారణాలేదైతేనేం.. ప్రభుత్వం మారడంతో పనులు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందాన ఉండిపోయాయి. దాదాపు ఏడు నెలలుగా అభివృద్ధి పనుల్లో పురోగతి కుంటుపడింది. కొత్త సంవత్సరంలోనైనా తిరిగి పట్టాలెక్కించాలన్నది జిల్లా ప్రజల ఆకాంక్ష. హామీల అమలుతో పాటు అభివృద్ధి పనులను పూర్తిచేయాలని కోరుతోంది.
మార్గం సుగమం చేయాలి
● డోలీల మోత తప్పించేందుకు పార్వతీపురం, సీతంపేట ఐటీడీల పరిధిలో కోట్లాది రూపాయల వ్యయంతో గిరిశిఖర గ్రామాలకు బీటీ రహదారులను గత ప్రభుత్వం నిర్మించింది. ఒక్క పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోనే సుమారు రూ.10,028.26 లక్షలకుపైగా వెచ్చించి 84 రహదారులను పూర్తి చేసింది. పీఎంజీఎస్‌వై, ఆర్‌సీఈపీఎల్‌డబ్ల్యూ గ్రాంట్ల కింద 1,008 రహదారి పనులను రూ.1,260 కోట్లతో చేపట్టింది.
● సాంకేతికత అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో మారుమూల, గిరిజన ప్రాంతాలకు సిగ్నల్ సమస్యలను పోగొట్టేందుకు రూ.200 కోట్లకుపైగా వెచ్చించి.. 196 సెల్‌టవర్లకు గత ప్రభుత్వంలో ఆంకురార్పణ చేశారు. ప్రస్తుతం 23 వరకు టవర్లు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. వీటిని కూడా కూటమి ప్రభుత్వం పూర్తిచేయాల్సి ఉంది.
● నాడు–నేడుతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి. తొలిదశలో 486 పాఠశాలల్లో రూ.130.14 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. రెండో విడతలో రూ.144.51 కోట్లతో 535 పాఠశాలల్లో ఆధునికీకరణ పనులు చేపట్టారు. అంగన్‌వాడీ కేంద్రాలనూ అభివృద్ధి చేసేందుకు సిద్ధమయ్యారు. గత ఆరు నెలలుగా పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం భవనాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. నాడు–నేడు కింద చేపట్టిన పాఠశాలల భవనాలు.. సాలూరు వంటి ప్రాంతాల్లో పశువులు కట్టేందుకు ఉపయోగిస్తుండటం ఆందోళన కలిగించే అంశం.
Comments
Please login to add a commentAdd a comment