ఏపీఎస్‌ఆర్టీసీ బలోపేతానికి చర్యలు
● ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఎస్.దన్నుదొర
రామభద్రపురం: ఏపీఎస్‌ఆర్టీసీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని ఏపీఎస్‌ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఎస్.దన్నుదొర అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఆయన మాట్లాడుతూ జోనల్ పరిధిలో ఆర్టీసీకి ప్రయాణికుల ద్వారా సుమారు రూ.4.50 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. ఉత్తరాంఽధ్రలోనే అతిపెద్ద జాతరైన శంబర జాతరకు ఎక్కువ బస్సులు నడిపేందుకు అధికారులు దృష్టి సారించారన్నారు. గిరిజన గ్రామాలలో ఇదివరలో నడిపి ఆగిన బస్సులను తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పారు. రామభద్రపురం మండలం ఎనుబరువు గిరిజన గ్రామానికి సాలూరు డిపో నుంచి పాచిపెంట మీదుగా పల్లెవెలుగు బస్సు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆదివాసీ సాంస్కృతిక మహోత్సవాల వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
సీతంపేట: రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఫిబ్రవరి 5, 6 తేదీల్లో టీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో జరగనున్న జాతీయ స్థాయి ఆదివాసీ సాంస్కృతిక మహోత్సవాల వాల్‌పోస్టర్లను ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. భారత దేశంలో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు. కార్యక్రమంలో టీఎస్‌ఎఫ్ నాయకులు అక్కులప్పనాయక్, విష్ణునాయక్, భగవాన్ తదితరులు పాల్గొన్నారు.
179 మద్యం సీసాల సీజ్
గజపతినగరం: మండలంలోని మరుపల్లి గ్రామం సమీపంలో 110 మద్యం సీసాలను తరలిస్తున్న మరుపల్లి గ్రామానికి చెందిన లెంక సురేష్ అనే వ్యక్తిని శనివారం అదుపులోకి తీసుకొని మద్యం సీసాలను సీజ్ చేసినట్లు ఎస్‌ఐ కె.లక్ష్మణరావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. షాపుల్లో కొనుగోలు చేసి ప్రభుత్వ అనుమతులు లేకుండా మద్యం వ్యాపారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. గజపతినగరం మండల కేంద్రంలో జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి సైకిల్‌పై 69 (బాటిల్స్)మద్యం సీసాలను అక్రమంగా తరలిస్తుండగా ఆయనను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకోవడం జరిగిందని స్తానిక ఎస్సై కె.లక్ష్మణరావు తెలిపారు. మొత్తం ఇద్దరు వ్యక్తుల నుంచి 179మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
శంబర జాతరకు ప్రత్యేక బస్సులు
సాలూరు: శంబర జాతర నేపథ్యంలో సాలూరు ఆర్టీసీ డిపో నుంచి శంబరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డీఎం భాస్కరరెడ్డి శనివారం తెలిపారు. జాతర నేపథ్యంలో భక్తుల రద్దీ ఽఅధికంగా ఉంటుందని ఈ క్రమంలో ప్రత్యేక బస్సులు నడపనున్నామని అన్నారు. ఆదివారం 5 బస్సులు, సోమవారం 10 బస్సులు, మంగళవారం 25 బస్సులు, బుధవారం 10 ప్రత్యేక బస్సులు నడపనున్నామని తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
విజయనగరం క్రైమ్: విజయనగరం కోరుకొండ రైల్వేస్టేషన్‌ల మధ్య రైల్వే ట్రాక్ మధ్యలో గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం పడి ఉందని జీఆర్‌పీ ఎస్‌ఐ వి.బాలాజీరావు శనివారం తెలిపారు. సుమారు 50 నుంచి 55 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి ఐదడగుల నాలుగు అంగుళాల ఎత్తు కలిగి, చామన ఛాయ రంగు, బిస్కెట్, కాఫీ రంగు పువ్వుల షర్ట్, నీలం రంగు పుల్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడన్నారు. ఆచూకీ తెలిసిన వారు 9490617089 నంబరునుగాని, జీఆర్‌పీ పోలీసులనుగానీ సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment