ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలి
విజయనగరం ఫోర్ట్: ఎన్నికల ముందు చెప్పిన సూపర్ – 6 హామీలు అన్నింటిని కూటమి ప్రభుత్వం నేరవేర్చాలని డీసీసీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ డిమాండ్ చేసారు. ఈథాలీ భజావో కార్యక్రమం పేరిట కలెక్టరేట్ వద్ద ప్లేట్లు – స్పూన్లుతో పెద్ద శబ్ధం చేస్తూ శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి సర్కార్ ఏర్పడి నేటికి 227 రోజులు అయిందన్నారు. ఇప్పటి వరకు ఫించన్లు, ఉచిత గ్యాస్ తప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, పథకాలు అమలు చేయలేదన్నారు. బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ అని బాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా మూలన పెట్టారన్నారు. యువతకు 20 లక్షలు ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి క్రింద నెలకు రూ.3 వేలు, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్ధికి ఏడాదికి రూ.15 వేలు, ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి ఇస్తామని చెప్పి ఇప్పడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్ధిక సాయం, ప్రతి మహిళకు 18 నుంచి 59 సంవత్సరాల వయసుగల వారికి నెలకు రూ.1500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ప్రజలను మోసం చేసారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేయకపోవడం వల్ల పిల్లలు చదువులకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు గేదెల తిరుపతిరావు, సతీష్, సురేష్, శ్రీనివాస్‌రావు, షరీఫ్, బంగారునాయుడు తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు విద్యాసాగర్
Comments
Please login to add a commentAdd a comment