30 ఏళ్ల కల.. తీరిన వేళ
● నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం ● పంటకు సరైన ధర కోసం అనేక పోరాటాలు ● ఎట్టకేలకు హామీ నెరవేర్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ● రైతుల్లో చిగురిస్తున్న ఆశలు ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో సాగు
బోర్డు ఏర్పాటు అభినందనీయం
పసుపు బోర్డు 30 ఏళ్ల రైతుల కల. నిజామాబాద్‌లో ఏర్పాటు అభినందనీయం. తాత్కాలిక కార్యాలయం అక్కడే ఏర్పాటు చేసినప్పటికీ, శాశ్వత ప్రాతిపదికన నిజామాబాద్–జగిత్యాల మధ్యలో ఏర్పాటు చేస్తే రెండు జిల్లాలకు ఉపయోగకరంగా ఉంటుంది.
– పన్నాల తిరుపతిరెడ్డి, పసుపు రైతుల ఉద్యమ నాయకుడు, జగిత్యాల
రైతుల ఆదాయం పెరుగుతుంది
పసుపు బోర్డుతో అనుకున్న ధర వస్తే రైతుల ఆదాయం పెరుగుతుంది. పసుపు సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. రైతుల జీవితాలు బాగుపడతాయి. పసుపు ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే, ఇక్కడి యువతకు ఉపాధి లభిస్తుంది.
– మామిడి నారాయణరెడ్డి, పసుపు రైతుల ఉద్యమ నాయకుడు, మెట్‌పల్లి
జగిత్యాల అగ్రికల్చర్: పసుపును ఆహార పదార్థాల్లోనే కాకుండా చర్మ సౌందర్య సాధనాల్లో, రంగులు, ఔషధ పరిశ్రమల్లో, పరిమళ ద్రవ్యాల తయారీలో వాడుతుండటంతో అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఒకప్పుడు బంగారంతో పోటీ పడ్డ పసుపు పంటకు కొన్నేళ్లుగా సరైన ధర రావడం లేదు. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్, జగిత్యాల జిల్లాల రైతులు 30 ఏళ్లపాటు అనేక పోరాటాలు చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అయితే నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి 178 మంది రైతులు నామినేషన్ వేసి, పసుపు బోర్డు ఏర్పాటుపై దేశవ్యాప్త చర్చకు తెరలేపారు. 2023 పార్లమెంట్ ఎన్నికల సమయంలో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. తాజాగా, ఆ హామీని నెరవేరుస్తూ బోర్డును సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రారంభించడంతోపాటు నిజామాబాద్‌కే చెందిన గంగారెడ్డిని చైర్మన్‌గా ప్రకటించడంతో పసుపు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
జగిత్యాలలోనే 30 వేల ఎకరాలకు పైగా..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల్లో పసుపు సాగవుతుంటే, ఒక్క జగిత్యాల జిల్లాలోనే 30 వేల ఎకరాలకు పైగా పండిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పసుపు ధర క్వింటాల్‌కు రూ.5 వేల నుంచి రూ.6 వేలు ఉండటంతో, గిట్టుబాటు కాక రైతులు పసుపు సాగు విస్తీర్ణం తగ్గించారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఎక్కువగా మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లో పసుపు సాగు చేస్తున్నారు. ఇందుకోసం డ్రిప్ సిస్టం వాడుతూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. దీనికితోడు, ఆధునిక యాజమాన్య పద్ధతులు పాటించి, ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల పసుపు దిగుబడి తీస్తున్నారు. పసుపు 9 నెలల పంట కావడంతో, రైతులు ఇంటి పంటగా భావించి, దాదాపు ఎకరాకు సేంద్రియ ఎరువుల పేరిట రూ.లక్ష వరకు ఖర్చు చేస్తుంటారు. వారి దశ, దిశ మార్చింది కూడా పసుపు పంటే కావడం విశేషం. పసుపు బోర్డుతో సాగు మరింతగా పెరిగి, మంచి ఆదాయం వస్తుందని రైతులు భావిస్తున్నారు.
బోర్డుతో ఏం లాభం?
పసుపు బోర్డు ఏర్పాటు వల్ల పసుపు పంట ఉత్పత్తులను నేరుగా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల మంచి ధర వస్తుంది. అలాగే, పసుపు ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి, పలు ఉప ఉత్పత్తులుగా తయారు చేయడం వల్ల కూడా అధిక రేటు పొందవచ్చు. పంటకు మార్కెట్లో ధర లేనప్పుడు నేరుగా పసుపు బోర్డు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. పంట నిల్వకు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయవచ్చు. కనీస మద్దతు ధర దక్కుతుంది. పసుపు పంటపై శాస్త్రవేత్తల బృందం రకరకాల పరిశోధనలు చేసి, కుర్కుమిన్ శాతం అధికంగా ఉండేలా దిగుబడులను పెంచడమే కాకుండా తెగుళ్లను, పురుగులను తట్టుకునే నూతన రకాలను రూపొందించే వీలుంటుంది. పసుపు సాగు చేసే భూముల్లో భూసార పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్‌లు ఏర్పాటు చేయవచ్చు. ఈ పంటలో వస్తున్న ఆధునిక యంత్రాలు, శాస్త్ర, సాంకేతిక టెక్నాలజీని రైతులకు పరిచయం చేయవచ్చు. పసుపు పంట తవ్వడం, ఉడకబెట్టడం, ఆరబెట్టడం, పాలిషింగ్ చేయడం తదితరాలకు సబ్సిడీపై ఆధునిక యంత్రాలను సమకూరుస్తారు.
అత్యధిక నిధులకు అవకాశం..
పసుపు బోర్డులో వ్యవసాయ, ఉద్యాన, ఔషధ, వైద్య, ఆర్థికం, వాణిజ్య, పరిశ్రమలు, పరిశోధన కేంద్రాలు వంటి పలు రంగాలకు చెందిన ప్రముఖులు, రైతు ప్రతినిధులు, ఎగుమతిదారులు ఉంటారు. సబ్సిడీకి పసుపు విత్తనంతోపాటు ఆధునిక యంత్రాలను అందించే వీలుంటుంది. పసుపు సాగుపై గ్రామాల్లో రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహించవచ్చు. పసుపు బోర్డుకు కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా నిధులు విడుదల చేసే అవకాశం ఉంటుంది, తద్వారా పసుపు పంట ఉత్పాదకతను పెంచి, రైతులకు అదనపు ఆదాయం అందించవచ్చు. ప్రధానంగా పసుపు విత్తనం నాటినప్పటి నుంచి మార్కెట్‌కు తీసుకెళ్లే వరకు నాణ్యత వంటి విషయాలపై పసుపు బోర్డు దృష్టి పెట్టనుంది. పసుపు ప్రాసెసింగ్ పరిశ్రమలు కూడా అందుబాటులోకి వస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment