సొంత అవసరాలకే ఉచితం
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రజలు సొంత నిర్మాణాలకు గురువారం (ఈనెల 16నుంచి) ఇసుకను ఉచితంగా తీసుకొళ్లొచ్చు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా ఆరు రీచ్‌లు గుర్తించారు. ఈ వివరాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇటీవల నిర్వహించిన స్యాండ్ కమిటీ సమావేశంలో ప్రకటించారు.
ఇవీ నిబంధనలు..
జిల్లాకు చెందిన ప్రజలు తమ సొంత అవసరాల కోసం జిల్లా పరిధిలో చేపట్టే నిర్మాణాలకే ఇసుకను ఉచితంగా రిజిస్టర్డ్ ట్రాక్టర్లలో తీసుకెళ్లాలి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల్లోగా ఇసుక రీచ్‌ల నుంచి తీసుకెళ్లాలి. ట్రాక్టర్ డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఓవర్‌లోడ్‌తో వెళ్లొద్దు. ఇసుక రవాణా చేసే ట్రాక్టర్‌కు రేడియం స్టిక్కర్లు అన్నివైపులా ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా నియమించిన సిబ్బంది రీచ్‌ల వద్దే తనిఖీ చేయాలి. రోజూ రీచ్‌ల నుంచి ఇసుక రవాణా చేసే వాహనాల వివరాలను ప్రతీవారం తహసీల్దార్లు నివేదిక తయారు చేసి అందించాలి.
ఆరు రీచ్‌లు ఇవే..
జిల్లాలోని ప్రజల సొంత అవసరాల కోసం ఉచితంగా ఇసుక సరఫరా చేసేందుకు అధికారులు ఆరు రీచ్‌లను ఎంపిక చేశారు. సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల, గట్టెపల్లి, ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్, ముత్తారం, మంథని మండలం విలోచవరం, అంతర్గాం మండలం గోలివాడ రీచ్‌ల నుంచి ట్రాక్టర్లలోనే ఇసుక తరలించాలి.
డంప్‌లు చేస్తే చర్యలు..
ఇసుకను అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నిర్దేశించిన సమయం తర్వాత రవాణా చేస్తూ అధికారులకు చిక్కితే వాహనాన్ని సీజ్ చేస్తారు. తొలిసారి పట్టుబడితే రూ.25వేల జరిమానా విధిస్తారు. రెండోసారి చిక్కితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు.
మిగతా ‘రీచ్’ల నుంచి స్యాండ్ ట్యాక్స్
జిల్లాలోని ఇతర రీచ్‌ల నుంచి ఇసుక పొందాలనుకునే వారు స్యాండ్ ట్యాక్స్ ద్వారా నిర్ణయించిన ధరలను ప్రభుత్వానికి చెల్లించాలి. పెద్దపల్లి పట్టణానికి రూ.1,400, సుల్తానాబాద్‌కు రూ.1,000, జూలపల్లికి రూ.1,700, ఓదెలకు రూ.1,150, కాల్వశ్రీరాంపూర్‌కు రూ.1,100, పాలకుర్తికి రూ.2,500, అంతర్గాంకు రూ.1,000, రామగుండానికి రూ.2,600, మంథనికి రూ.1,500, ధర్మారానికి రూ.2,300, కమాన్‌పూర్‌కు రూ.2,200, రామగిరికి రూ.2,200 ఒక్కో ట్రాక్టర్‌కు చెల్లించాలి.
ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేయండి..
ఇసుక రవాణాలో ఇబ్బందులు ఉన్నా, నిర్ణీత ధర కన్నా అధికంగా వసూలు చేసినా ఫిర్యాదు చేయాల ని అధికారులు సూచించారు. ఇందుకోసం కలెక్టరేట్‌లోని 08728–223318, 08728–223310 ఫోన్‌నంబర్లు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అందుబాటులో ఉంటాయని వారు పేర్కొన్నారు. ఫిర్యాదులను నమోదు చేసుకుని సంబంధిత శాఖల అధికారులు తగిన విధంగా చర్యలు తీసుకుంటారని వారు వివరించారు.
సద్వినియోగం చేసుకోండి
జిల్లా ప్రజలు తమ సొంత అవసరాల కోసం ఉచితంగా ఇసుక పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాకు చెందిన రిజిస్టర్డ్ ట్రాక్టర్లలోనే ఇసుక తీసుకెళ్లాలి. జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన ఆరు రీచ్‌ల వద్ద ప్రత్యేక సిబ్బందితో ఇసుక రవాణా ప్రక్రియను పర్యవేక్షిస్తాం. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.
– కోయ శ్రీహర్ష
నేటినుంచి అందుబాటులోకి ఇసుక
జిల్లాలో ఆరు రీచ్‌లు
నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా
Comments
Please login to add a commentAdd a comment