‘అర్బన్‌ నక్సల్స్‌’ను ఎన్నుకుని పొరపాటు చేయొద్దు | Sakshi
Sakshi News home page

‘అర్బన్‌ నక్సల్స్‌’ను ఎన్నుకుని పొరపాటు చేయొద్దు

Published Sun, Apr 28 2024 5:49 AM

Amit Shah comments on Congress Party: Gujarat

కాంగ్రెస్, ఆప్‌ చెప్పేవన్నీ అబద్ధాలే

అమిత్‌ షా ఆరోపణలు

భరూఛ్‌: ఓటు వేసి అర్బన్‌ నక్సలైట్లను ఎన్నుకునే పొరపాటు ఎప్పుడూ చేయొద్దని గుజరాత్‌ ఓటర్లకు బీజేపీ అగ్రనేత అమిత్‌ షా హితవు పలికారు. గుజరాత్‌లోని భరూఛ్‌ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎంపీ మన్‌సుఖ్‌ వాసావా తరఫున శనివారం ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మాట్లాడారు. ‘‘ మన్‌సుఖ్‌లాంటి చక్కని ప్రజా ప్రతినిధి ఇంకొకరు మీకు దొరకదు. పొరపాటున వేరేవాళ్లకు ఓటేస్తే అర్బన్‌ నక్సలైట్లలో ఒకరు ఎంపీ సీటులో కూర్చుంటారు. ఈ గిరిజన ప్రాంతాన్ని నాశనం చేస్తారు. ప్రజలను లూటీచేసేందుకు ఆప్, కాంగ్రెస్‌ కలిసి వచ్చాయి. కాంగ్రెస్‌ గిరిజనుల వ్యతిరేక పార్టీ.

ఓట్లేశాక ఆప్‌ గిరిజనులను గాలికొదిలేస్తుంది. 400 మెజారిటీతో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆప్, కాంగ్రెస్‌ చెప్పేవన్నీ అసత్యాలు. అబద్ధాలు ప్రచారం చేయడంలో కాంగ్రెస్‌ నైపుణ్యం సాధించింది. ఆప్‌ సర్దార్‌ స్థాయికి ఎదిగింది. నిజంగానే మేం రాజ్యాంగాన్ని మార్చేవారమే అయితే ఈ పదేళ్లు అధికారంలో ఉన్నపుడే మార్చేవాళ్లంకదా?’ అని వ్యాఖ్యానించారు. ‘‘ ఆదివాసీలు, దళితులు, ఓబీసీల రిజర్వేషన్లను మేం ముట్టుకోబోం.

ఎవరినీ ముట్టుకోనివ్వం కూడా. గిరిజనుల ప్రాథమిక హక్కులను ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) లాగేసుకుంటుందని ఆప్, కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. యూసీసీకి గిరిజనులకు సంబంధమే లేదు. భరూఛ్‌లో ఆప్‌ అభ్యర్థి ఛైతర్‌ వాసావా లేనిపోనివి ప్రచారంచేస్తున్నారు. ఆదివాసీలకు మోదీ ఎల్లప్పుడూ మిత్రుడే’’ అని అమిత్‌ షా చెప్పారు.

Advertisement
Advertisement