మిడ్నాపూర్: రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో ఎవరూ మిగలరని, కేవలం మమతా బెనర్జీ మాత్రమే పార్టీ్టలో ఉంటారని బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. శనివారం బెంగాల్‌లో ఆయన టీఎంసీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంసీ సీనియర్ నేత సువేందు అధికారి సహా పలు పార్టీల నేతలు బీజేపీలో చేరారు. టీఎంసీ నినాదమైన ‘‘మా, మాటి, మనుష్(తల్లి, జన్మభూమి, ప్రజ) కాస్తా ‘‘దోపిడీ, అవినీతి, బంధుప్రీతి’’గా మారిపోయిందని అమిత్ షా దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ 200 పైగా సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రజలు మార్పు కోసం బీజేపీ వెనుక నడిస్తే మమతకు ఏమి సమస్యని ఆయన ప్రశ్నించారు.
బంధుప్రీతి, బుజ్జగింపులే కారణం
ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరడానికి టీఎంసీ అనుసరిస్తున్న బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలే కారణమని అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్, సీపీఎం, టీఎంసీ నుంచి పలువురు నేతలు సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీలో మోదీ నాయకత్వంలో పనిచేయడానికి చేరారని చెప్పారు. టీఎంసీలో చీలికలను బీజేపీ ప్రోత్సహిస్తోందన్న విమర్శలపై స్పందిస్తూ 1998లో టీఎంసీ ఏర్పడిందే కాంగ్రెస్ నుంచి చీలిపోయాయని గుర్తు చేశారు. టీఎంసీ నుంచి నేతలు వీడడం ఆరంభమేనని, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీఎంసీని వీడుతున్నారన్నారు. ఇదే విధంగా వలసల జోరు కొనసాగితే ఎన్నికల నాటికి టీఎంసీలో మమత మాత్రమే మిగులుతారన్నారు.
9 మంది ఎంఎల్‌ఏలు, ఒక ఎంపీ
అధికార టీఎంసీకి చెందిన కీలక నేత సువేందు అధికారి సహా వివిధ పార్టీలకు చెందిన 9 మంది ఎంఎల్‌ఏలు, ఒక టీఎంసీ ఎంపీ అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఇటీవలే టీఎంసీకి సువేందు రాజీనామా చేశారు. బర్ధమాన్ పుర్బాకు చెందిన ఎంపీ సునీల్ మండల్, టీఎంసీ ఎంఎల్‌ఏలు బన్సారీ మైటీ, శిలభద్ర దత్తా, బిస్వజిత్ కుందు, సుక్రా ముండా, సైకత్ పంజా, సీపీఎం నుంచి టీఎంసీలో చేరిన ఎంఎల్‌ఏ దిలీప్ బిస్వాస్, సీపీఎంకే చెందిన మరో ఎంఎల్‌ఏ తపసి మండల్, సీపీఐ ఎంఎల్‌ఏ అశోక్‌దిండా, కాంగ్రెస్ ఎంఎల్‌ఏ సుదీప్ ముఖర్జీ బీజేపీలో చేరారు. మాజీ ఎంపీ దశరధ్ టిర్కీ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు టీఎంసీ, లెఫ్ట్, పలువురు కాంగ్రెస్ జిల్లాస్థాయి నేతలు బీజేపీలో చేరారు.
రైతు ఇంట భోజనం...
పశ్చిమబెంగాల్‌లో పర్యటిస్తున్న హోంమత్రి అమిత్‌షా శనివారం ఒక రైతు ఇంట మధ్యాహ్న భోజనం చేశారు. బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని బలిజ్‌హరిలో నివాసముండే సనాతన్ సింగ్ నివాసానికి వెళ్లిన అమిత్‌షా అక్కడే నేలపై కూర్చొని భోజనం చేశారు. ఆయనతోపాటు బీజేపీ నేతలు కైలాస్ విజయ్‌వర్ఘీయ్, ముకుల్‌రాయ్, దిలీప్ ఘోష్ భోజనాలు చేశారు. అంతకుముందు స్థానిక ఆలయంలో అమిత్ పూజలు నిర్వహించారు. తన ఇంట్లో హోంమంత్రి విందారగించడంపై సనాతన్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. కేవలం పప్పు, రోటీలను మాత్రమే భోజనంలో ఇవ్వగలిగానన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు కదం తొక్కుతున్న వేళ రైతు ఇంట విందుకు అమిత్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చేఎన్నికల్లో రైతులను ఆకట్టుకునే వ్యూహంలో ఇది ఒక భాగమని భావిస్తున్నారు.
ఎవరీ సువేందు?
మమతా బెనర్జీ ప్రస్తుత ప్రభుత్వంలో సువేందు అధికారి రవాణా, నీటిపారుదల–జల వనరుల మంత్రిగా పనిచేశారు. నవంబర్ 27 న ఆయన మంత్రి పదవికి, డిసెంబర్ 16న ఎమ్మెల్యే పదవికిడిసెంబర్ 17న టీఎంసీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీ తరువాత సువేందు అధికారికి జనాదరణ ఎక్కువగా ఉందంటారు. 2007నందిగ్రామ్ ఉద్యమంలో అధికారి కీలక పాత్ర పోషించారు. అనంతరం ‘జంగల్ మహల్’గా పేరుతెచ్చుకున్న పశ్చిమ మిడ్నాపూర్, పురూలియా, బంకురా జిల్లాల్లో తృణమూల్ కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు. రెండు మార్లు లోక్‌సభ ఎంపీగా కూడా ఆయన ఎన్నికయ్యారు. వెస్ట్ మిడ్నాపూర్, బంకురా, పురులియా, ఝూర్‌గ్రామ్, బీర్‌భూమిలోని కొన్ని ప్రాంతాలతో కలిపి మొత్తం 60 నుంచి 65 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారి కుటుంబ ప్రభావం ఉంటుందని విశ్లేషకుల అంచనా.
అతనే కారణమా?
ఇటీవల తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగానే సీనియర్ నాయకులు పార్టీని వీడుతున్నారని బయటకు వినిపిస్తున్నా, అసలు కారణం వేరే ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలోని ఇతర సీనియర్ నాయకులకన్నా ప్రాధాన్యం పెరగడం, అభిషేక్‌ను తన వారసునిగా మమత సిద్ధం చేయడమే సువేందు అధికారి సహా అనేకమంది సీనియర్ల అసంతృప్తికి అసలు కారణమంటున్నారు.
మమత మాత్రమే మిగులుతారు!
Published Sun, Dec 20 2020 3:40 AM | Last Updated on Sun, Dec 20 2020 4:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment