రెండు జాతీయ పార్టీలను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పావులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏడాది క్రితం అధికారానికి దూరమై ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్).. తన రాజకీయ ప్రత్యర్థులైన రెండు జాతీయ పార్టీలపై దూకుడుగా ముందుకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీలను ఇరుకునపెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై కసరత్తు చేస్తోంది.
వచ్చే ఏడాది జరిగే స్థానిక ఎన్నికల తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణం, శిక్షణపై దృష్టి పెట్టే యోచనలో ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కేడర్‌లో ఉత్సాహం నింపేలా.. ప్రజా సమస్యలు కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు నిర్వహించనుంది. రాష్ట్రంలో జరుగుతున్న అవక తవకలను, అవినీతిని కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదన్న అంశాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని భావిస్తోంది.
కాంగ్రెస్, బీజేపీలను టార్గెట్ చేస్తూ..
అమృత్ స్కీమ్ కింద అర్హత లేకున్నా సీఎం బావమరిది కంపెనీకి కాంట్రాక్టు అప్పగించారని ఆరోపణలు చేసిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. దీనిపై ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రికి కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా లగచర్ల ఘటనపైనా మరోమారు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల బీజేపీ వైఖరిని నిలదీశారు.
వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ లోపాయకారీ ఒప్పందంతో చెరో ఎనిమిది సీట్లు గెలుచుకున్నాయని ఆరోపించిన బీఆర్‌ఎస్.. తెలంగాణ పట్ల ఆ రెండు పార్టీలది ఒకే వైఖరి అనే విషయాన్ని పదే పదే ఎత్తిచూపుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంపై జరిగిన ఈడీ దాడులపై బీజేపీ మౌనంగా ఉండటం ఏమిటని ప్రశ్నిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, కొందరు బీజేపీ ఎంపీలు రేవంత్‌కు మద్దతు పలుకుతున్నారని ఆరోపిస్తోంది.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌తోపాటు బీజేపీ కూడా సమాన స్థాయిలో బీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థులుగా మారే అవకాశం ఉందని.. లోక్‌సభ ఎన్నికల అనుభవంతో రెండు పార్టీలపైనా సమాన స్థాయిలో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని బీఆర్‌ఎస్ భావిస్తోంది. రెండు జాతీయ పార్టీలను ఏక కాలంలో, ప్రణాళికబద్ధంగా టార్గెట్ చేసే వ్యూహాన్ని అమల్లో పెడుతోంది.
సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం
ఇప్పటికే ‘ఎక్స్’, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమ వేదికలను కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం కోసం విస్తృతంగా వినియోగిస్తున్న బీఆర్‌ఎస్... మరింత స్పీడ్ పెంచడంపై దృష్టి పెట్టింది. దీనికోసం సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను పెంచుకోవడంలో నిమగ్నమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న నేపథ్యంలో... తిరిగి పట్టు సాధించేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తోంది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలు వైఫల్యం గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపుతోందనే అంచనాకు వచ్చింది. సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేడర్‌కు దిశానిర్దేశం చేస్తోంది.
కేసీఆర్ కొంతకాలం ఎర్రవల్లికే పరిమితం!
ఇక పార్టీ అధినేత కేసీఆర్ మరికొంత కాలం ఎర్రవల్లి నివాసానికే పరిమితమవుతారని బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. జాతీయ, రాష్ట్రస్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన ఎప్పటికప్పుడు పార్టీ కీలక నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారని అంటున్నాయి. వివిధ వర్గాలు తమ సమస్యలను విన్నవించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు వస్తుండటంతో ‘జనతా గ్యారేజ్’గా మారిందని బీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
బీఆర్‌ఎస్ పట్ల సీఎం రేవంత్ తీవ్ర వైఖరి దాల్చితే ‘పాదయాత్ర’ ద్వారా ప్రజల్లోకి వెళ్లే ప్రణాళికపైనా కసరత్తు జరుగుతోందని వారు చెప్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మరో కీలక నేత హరీశ్‌రావు కూడా పాదయాత్ర చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment