రేవంత్‌ రాజకీయ కక్షకు ఇది పరాకాష్ట: హరీష్‌ రావు ఫైర్‌ | BRS Harish Rao Serious Comments On CM Revanth And Congress Govt | Sakshi
Sakshi News home page

రేవంత్‌ రాజకీయ కక్షకు ఇది పరాకాష్ట: హరీష్‌ రావు ఫైర్‌

Published Fri, Aug 30 2024 12:01 PM | Last Updated on Fri, Aug 30 2024 12:01 PM

BRS Harish Rao Serious Comments On CM Revanth And Congress Govt

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని కాంగ్రెస్‌ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్‌ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గం అంటూ కామెంట్స్‌ చేశారు. కాంగ్రెస్ పాలన ప్రజలకు శాపంగా మారింది. అభివృద్ది నిరోధకులుగా ముఖ్యమంత్రి రేవంత్‌ వ్యవరిస్తున్నారని మండిపడ్డారు.

హరీష్‌ రావు ట్విట్టర్‌ వేదికగా..‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గం. అభివృద్ది కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయం. రేవంత్ రెడ్డి దివాళాకోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) కింద 33 జిల్లాల్లో మంజూరైన సుమారు 10వేల కోట్ల విలువ చేసే 34,511 పనులను రద్దు చేయడమే దీనికి నిదర్శం.

గత అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఈ వివరాలను బయటపెట్టింది. రాష్ట్ర  ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మంజూరైన అనేక పనులను నిలిపివేయడంతో పాటు, ఇప్పటికే ప్రారంభమైన అనేక పనులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగించొద్దని మధ్యంతరంగా నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దాదాపు పూర్తి కావొస్తున్న ప్రాజెక్టులకు సైతం బిల్లుల చెల్లింపులు నిలిపివేసింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు ప్రతి గ్రామంలో పంచాయతీరాజ్, మున్సిపల్, రోడ్లు-భవనాలు, నీటిపారుదల తదితర శాఖలపరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రక్రియకు ఆటంకం కలిగింది. దీంతో ఎంతో మంది ఉపాధి కూడా కోల్పోతున్నారు. 9 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి నిరోధక అజెండాతో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నది.

ఈ ప్రభుత్వానికి కొత్త పనులను చేపట్టే శక్తిసామర్థ్యాలు లేవని ఇప్పటికే తేలిపోగా, మంజూరైన పనులను పూర్తి చేసే కనీస నైతిక బాధ్యత కూడా లేదని పనుల రద్దుతో స్పష్టమైంది. కాంగ్రెస్ పాలన ప్రజలకు శాపంగా మారింది. అభివృద్ది నిరోధకులుగా ముఖ్యమంత్రి వ్యవరిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గాలకు కేటాయించిన ఎస్డీఎఫ్ నిధులను ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసింది. అయితే ఈ నిధుల నుండే మార్చి నెలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు 10 కోట్ల చొప్పున మంజూరు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు ఇచ్చి తన కురచ బుద్ధిని, పక్షపాత ధోరణిని చూపింది.

కాంగ్రెస్ పార్టీ గెలవని నియోజకవర్గాలపై కక్షతో ఒక్క రూపాయి నిధులను కూడా కేటాయించకపోవడం దుర్మార్గం. నిధులు కేటాయించకపోగా పురోగతిలో ఉన్న పపనులకు సైతం నిధులు నిలిపివేయడం మరో దుర్మార్గం. ఇప్పటివరకు రద్దు చేసిన ఎస్డీఎఫ్ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి రాష్ట్రస్థాయిలో ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదు. జిల్లా కలెక్టర్లు, అధికారులు సైతం రద్దు చేసిన పనులకు సంబంధించి ఎలాంటి సమీక్షా జరపలేదు. కనీసం పురోగతిలో ఉన్న పనుల నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడంలో విఫలమయ్యారు.

 

 

ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియలో ప్రజల అవసరాలు మారవు. మారేది కేవలం ప్రభుత్వాలు మాత్రమే. గత ప్రభుత్వ ఆనవాలు లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి తన అనాలోచిత చర్యలతో తన ఆనవాలునే ప్రజల్లో లేకుండా చేసుకుంటున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థ పూరిత రాజకీయాలు చేయడం పక్కనపెట్టి, రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలి. గత ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ అవి ప్రజల అవసరాల కోసమే కాబట్టి ఆ పనులను పూర్తి చేసేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని, నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అన్నారు.

ఇదే సమయంలో రాష్ట్రంలో విద్యాశాఖపై కూడా హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్‌ వేదికగా హరీష్‌..‘సారొస్తారా..! అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు తీవ్ర నిరాశే మిగులుతున్నది. ఉపాధ్యాయులు లేక, విద్యా వాలంటీర్లను నియమించక ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. తరగతి గదుల్లో కూర్చుని పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు, బడికి దూరమవుతున్నరు. విద్యాశాఖను కూడా తానే నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి సారుకు ఇవేవీ పట్టవు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement