సాక్షి, అమరావతి: తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా వచ్చాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. 38.74 శాతం పంచాయతీలను తమ పార్టీ గెలుచుకున్నట్టు తెలిపారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఫలితాలు వైఎస్సార్‌సీపీ పతనానికి నాంది అని, రాబోయే రోజుల్లో దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పారు. దుర్మార్గాలను ఎదుర్కొని ప్రజలు ప్రజాస్వామ్యాన్ని బతికించారని, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రాణాలు పణంగా పెట్టి దుర్మార్గాలను అడ్డుకున్నారని, ఇది టీడీపీ సత్తా అని చెప్పారు. 2,723 గ్రామ పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ 1,023 గెలుచుకుందని, ఇతరుల మద్దతుతో మరో 32 పంచాయతీలలో గెలిచామని, మొత్తంగా 38.74 శాతం స్థానాలలో తాము బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారని తెలిపారు. ఒక మంత్రి 94 శాతం పంచాయతీలను గెలిచినట్టు గాలి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
షర్మిల రాజన్న రాజ్యం తెస్తానంటున్నారు
ఒకవైపు షర్మిల పార్టీ పెడుతున్నామని తిరిగి రాజన్న రాజ్యం తీసుకొస్తామని చెబుతుంటే.. ఏ2 మాత్రం ఆమె అలా ఎక్కడ మాట్లాడిందని గాలి మాటలు చెబుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. వైఎస్ జగన్ చెల్లెలికి కూడా వెన్నుపోటు పొడిచారన్నారు. సీఎం జగన్ సాక్షాత్తు బాబాయిని చంపేసి నాటకాలాడుతున్నాడని విమర్శించారు. పుంగనూరు నియోజకవర్గంలో 85 పంచాయతీల్లో 82 పంచాయతీలను బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన ప్రతిఒక్కరిని కోర్టులకు లాగుతామని, రాత్రి ఒంటిగంట వరకు వందల పంచాయతీల్లో టీడీపీ గెలిస్తే అధికారులు వాటన్నింటిని వైఎస్సార్‌సీపీకి డిక్లేర్ చేశారని ఆరోపించారు.
పంచాయతీ ఫలితాలు మాకే అనుకూలం
Published Thu, Feb 11 2021 4:48 AM | Last Updated on Thu, Feb 11 2021 5:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment