![CM Revanth at Mathrubhumi International Festival of Letters conference](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/revanth.jpg.webp?itok=EpsUIi-F)
సదస్సులో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి
మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం ప్రసాదించిన గ్యారంటీలు, హక్కులను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత వైఖరికి నిరసనగా దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడుకునేందుకు కలసి పోరాడాలన్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆదివారం జరిగిన ‘మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’సదస్సులో ‘తెలంగాణ రైజింగ్, దక్షిణాది రాష్ట్రాలెందుకు కలసి పనిచేయాల’నే అంశాలపై ప్రసంగించారు.
‘‘ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ కారణంగా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నందుకు కేంద్ర పెద్దలు దక్షిణాదిని శిక్షిస్తున్నారా? కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమాన తోడ్పాటు ఇవ్వడం లేదు. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు, బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలపై వివక్ష చూపుతోంది..’’అని రేవంత్ ఆరోపించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను జనాభా ప్రాతిపదికన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అత్యుత్తమంగా తెలంగాణ
తెలంగాణ రైజింగ్ అనేది నినాదం మాత్రమే కాదని, అది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని రేవంత్ చెప్పారు. తెలంగాణను దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలపాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. దాదాపు 200 బిలియన్ డాలర్లుగా ఉన్న తెలంగాణ జీడీపీని 2035 సంవత్సరం నాటికి ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్‌ను న్యూయార్క్, లండన్, సింగపూర్, టోక్యో, సియోల్ వంటి నగరాలతో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ, స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, మూసీ పునరుజ్జీవం లాంటి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. దేశానికి డేటా సెంటర్, పంప్డ్ స్టోరేజీ హబ్‌గా తెలంగాణ నిలవబోతోందన్నారు. దేశంలోని నాలుగు దిక్కులకు అనుసంధానమై దక్షిణాది రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉన్న తెలంగాణను దేశానికి లాజిస్టిక్ సెంటర్‌గా నిలపాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు.
కాంగ్రెస్ ఆ లింకు మిస్సవుతోంది
సదస్సులో భాగంగా మాతృభూమి ఎడిటర్ మనోజ్.కె.దాస్‌తో పాటు పలువురు సభికులు అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానాలు ఇచ్చారు. ఆయా అంశాలు ఆయన మాటల్లోనే..
⇒ ‘‘ఎన్నికల్లో జాతీయ నేతలను రంగంలోకి దింపితేనే పెద్ద మొత్తంలో ఓట్లు వస్తాయి. ‘రేవంత్‌రెడ్డికి ఓట్లేయండి’ అని అడిగితే.. ఆయన రెడ్డి, అగ్రకులం అంటారు. బీసీలు, ఎస్సీలంటూ రకరకాల విభేదాలు సృష్టిస్తారు. జాతీయ నాయకత్వం పేరు చెప్పి ఓట్లు అడిగితే ఈ భావనలు రావు. అందుకే సర్పంచ్ ఎన్నికల్లో అయినా బీజేపీ నరేంద్ర మోదీని చూపించే ఓట్లు అడుగుతుంది. గ్రామ సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు, మోదీకి ఏం సంబంధం? కాంగ్రెస్ ఆ లింకు మిస్సవుతోందనేది నా పరిశీలన. పార్టీ కూడా ఆ దిశగా ఆలోచించాలి.
⇒ దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు పుదుచ్చేరి ప్రజలు ఏకమవ్వాలి. దక్షిణాది ప్రజలు ఏవిధంగానైనా పోరాడేందుకు ఏకం కావాలి. తప్పనిసరైతే ఈ విషయంలో నేను చొరవ తీసుకుంటా.
⇒ కేజ్రీవాల్ హరియాణాలో కాంగ్రెస్‌ను దెబ్బతీశారు. ఇది ఆయనకు ఢిల్లీ ఎన్నికల్లో ప్రతికూలమైంది. అంతిమంగా బీజేపీ లాభపడింది. ఈ విషయంలో ఇండియా కూటమి ఆలోచించాలి.
⇒ జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గెలిచే సీట్లతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అప్పుడు దక్షిణాది రాష్ట్రాల అవసరమే ఉండదు. ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. నియోజకవర్గాలను పెంచాల్సి వస్తే ప్రస్తుతమున్న సీట్ల ప్రకారమే.. ప్రతి రాష్ట్రంలోనూ 50శాతం సీట్లు పెంచాలని ప్రధాని మోదీని కోరాను.
⇒ ఒక దేశం–ఒక ఎన్నికను మేం అంగీకరించబోం. జాతీయ స్థాయి ఎన్నికలు వేరు, రాష్ట్రాల ఎన్నికలు వేరు. రాష్ట్రాల ప్రాథమిక హక్కులను హరించలేరు. రాష్ట్రాలన్నింటినీ మోదీ తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. రాష్ట్రాలను స్థానిక సంస్థలుగా మార్చాలనుకుంటున్నారు. కేంద్ర జాబితా, రాష్ట్రాల జాబితా, ఉమ్మడి జాబితా అని రాజ్యాంగం నిర్ణయించింది. కానీ మోదీ మాత్రం అంతా కేంద్రం చేతుల్లోనే ఉండాలంటున్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలు దీన్ని పూర్తిగా పసిగట్టడం లేదు. మేధావులు దీనిపై ఆలోచన చేయాలి. ఒక దేశం ఒక ఎన్నిక వంటి అంశాల్లో ప్రజా ఉద్యమం అవసరం.
⇒ కేరళ ప్రభుత్వం కేవలం సంక్షేమంపై పనిచేస్తోందే తప్ప అభివృద్ధి, పెట్టుబడులపై దృష్టి సారించడం లేదు. కేరళకు అనేక అవకాశాలున్నాయి. పర్యాటకం, ఎనర్జీ, పెట్టుబడులపై పాలసీలు రూపొందించుకోవాలి.
⇒ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ సరైన గౌరవం ఇవ్వలేదనేది బీజేపీ, నరేంద్ర మోదీ వాట్సాప్ యూనివర్సిటీ సృష్టించిన భావన మాత్రమే. ఆ వర్సిటీ అనేక అపోహలను సృష్టిస్తోంది. ఆ మాయాజాలంలో పడొద్దు.’’
Comments
Please login to add a commentAdd a comment