సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన అమరావతి భూ కుంభకోణాల బాగోతం బట్టబయలైంది. చంద్రబాబు, అప్పటి మంత్రి పొంగూరు నారాయణ ద్వయం భూ దోపిడీ నిర్ధారణ అయ్యింది. అమరావతిలో సీడ్ క్యాపిటల్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ పేరిట క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారన్నది స్పష్టమైంది. ఈ కేసులో ఏ–1గా ఉన్న చంద్రబాబు కరకట్ట నివాసాన్ని అటాచ్ చేసేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చింది.
దాంతోపాటు ఈ కేసులో ఏ–2గా ఉన్న పొంగూరు నారాయణ కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల పేరిట అమరావతిలో ఉన్న 75,888 చదరపు గజాల ఇళ్ల స్థలాలు, భూ సమీకరణ కింద పొందిన కౌలు మొత్తం రూ.1.92 కోట్లను కూడా అటాచ్ చేసేందుకు న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం శుక్రవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కరకట్ట నివాసం, నారాయణ కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న ప్లాట్లు, బ్యాంకు నిల్వలను బదలాయించేందుకు మార్పులు చేసేందుకు వీల్లేదని స్పష్టం చేసింది.
ఆ ఆస్తుల అటాచ్‌మెంట్ కోసం జులై 14 లోపు నోటీసులు జారీ చేయాలని కూడా ఆదేశించింది. ఈ కేసులో పూర్తి స్థాయి అటాచ్‌మెంట్ కోసం కేసు విచారణ కొనసాగుతుందని తెలిపింది. దాంతో అమరావతి భూ కుంభకోణం ద్వారా చంద్రబాబు, నారాయణ, వారి బినామీలు భారీగా అవినీతికి పాల్పడ్డారని నిగ్గుతేలింది. అమరావతిలో చంద్రబాబు, నారాయణ సాగించిన భూ అక్రమాలను సిట్ నిర్ధారించింది.
క్విడ్ ప్రో కో కింద పొందిన కరకట్ట నివాసం, అమరావతిలో ప్లాట్లు, భూ సమీకరణ కింద పొందిన కౌలు మొత్తాన్ని అటాచ్ చేసేందుకు అనుమతించాలన్న సిట్ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. ఆ మేరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఆ ఆస్తుల ఆటాచ్‌మెంట్‌కు అనుమతించాలని సిట్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై రెండు నెలల విచారణ అనంతరం న్యాయస్థానం అటాచ్‌మెంట్‌కు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో చంద్రబాబు కరకట్ట నివాసం, నారాయణ కుటుంబ సభ్యుల ప్లాట్లు, బ్యాంకు ఖాతాల అటాచ్‌మెంట్ కోసం సీఐడీ చర్యలు తీసుకోనుంది.
అటాచ్ చేయనున్న ఇద్దరి ఆస్తులు
► ఏ–1 చంద్రబాబు కరకట్ట నివాసం (లింగమనేని రమేశ్ కుటుంబం పేరిట ఉన్న ఈ నివాసాన్ని బాబు క్విడ్ ప్రో కో కింద పొందారు)
► ఏ–2 పొంగూరు నారాయణ కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల పేరిట అమరావతిలో ఉన్న 75,888 చదరపు గజాల ఇళ్ల స్థలాలు
► ఏ–2 నారాయణ భార్య పొత్తూరి ప్రమీల, కుటుంబ సభ్యులు, బంధువులు రాపూరి సాంబశివరావు, ఆవుల ముని శంకర్, వరుణ్ కుమార్ కొత్తప భూ సమీకరణ కింద ఇప్పటి వరకు పొందిన కౌలు మొత్తం రూ.1,92,11,482
చంద్రబాబు అవినీతి మాస్టర్‌ప్లాన్
అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలోనే ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ భారీ అవినీతికి పాల్పడినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణలో ఆధారాలతో సహా బట్టబయలైంది. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు టీడీపీ ప్రభుత్వం నామినేషన్ పద్దతిలో కన్సల్టెన్సీని ఎంపిక చేసింది. లింగమనేని రమేశ్, లింగమనేని రాజశేఖర్, హెరిటేజ్ ఫుడ్స్, చంద్రబాబు బినామీలకు చెందిన భూములు ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా.. వారి భూముల వెలుపలి నుంచే ల్యాండ్ పూలింగ్ చేసేలా మాస్టర్ ప్లాన్‌ను ఖరారు చేశారు.
అందుకు ప్రతిగా చంద్రబాబు కుటుంబానికి లింగమనేని కుటుంబం భారీగా ప్రతిఫలాన్ని ముట్టజెప్పింది. ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములను హెరిటేజ్ ఫుడ్స్‌కు ‘అమ్మినట్టు’ ఇవ్వడంతో సరిపెట్టకుండా, కృష్ణా నది కరకట్ట మీద ఉన్న నివాసాన్ని కూడా చంద్రబాబుకు అప్పగించింది. లింగమనేని నుంచి హెరిటేజ్ ఫుడ్స్‌కు భూమికరకట్ట నివాసమే కాదు లింగమనేని కుటుంబం భూములను కూడా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌కు అప్పగించిందన్నది కూడా సిట్ దర్యాప్తులో వెల్లడైంది.
2014లో లింగమనేని కుటుంబ సభ్యుల నుంచి హెరిటేజ్ ఫుడ్స్ 4 ఎకరాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు చూపించారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూమినే హెరిటేజ్ ఫుడ్స్‌కు బదలాయించారు. ఆ సమయంలో నారా లోకేశ్ డైరెక్టర్‌గా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి కూడా అయిన లోకేశ్ అదే లింగమనేని కుటుంబం ఇచ్చిన కరకట్ట మీద నివాసంలోనే నివసించారు.
సీడ్ క్యాపిటల్‌లో వేళ్లూనుకున్న అవినీతి
అమరావతికి గుండె కాయ వంటి సీడ్ క్యాపిటల్‌లో కూడా ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ భారీగా భూ అక్రమాలకు పాల్పడ్డారు. శాసనసభ, సచివా లయం మొదలైన ప్రధాన విభాగాలన్నీ కూడా సీడ్ క్యాపిటల్ పరిధిలోనే నిర్మిస్తామని ప్రకటించడంతో ఆ ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరుగు తాయి. అందుకే సీడ్ క్యాపిటల్‌లో పూర్తిగా తమ వాటా భూములే ఉండేట్టుగా వారు వ్యవహారం సాగించారు. సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌ను కన్సల్టెన్సీ సంస్థ ప్రభుత్వానికి 2015 జూలైలోనే సమర్పించినప్పటికీ ఆమోదించకుండా మూడు నెలలపాటు కాల యాపన చేశారు.
ఆ మూడు నెలల్లోనే నారాయణ తమ బినామీలు, బంధువులైన పొత్తూరి ప్రమీల, రాపూరి సాంబశివరావు, ఆవుల ముని శంకర్, వరుణ్ కుమార్ కొత్తప్ప పేరున సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో 65.50 ఎకరాలు కొనుగోలు చేశారు. అందుకోసం నారాయణ భార్య రమాదేవి, అల్లుడు డైరెక్టర్లుగా ఏర్పాటు చేసిన ఎన్‌స్పైరా కంపెనీ నుంచి నిధులను తమ బంధువులు, బినామీల ఖాతాల్లోకి మళ్లించారు.
వారి పేరున సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును బినామీగా పెట్టుకుని కూడా నారాయణ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. నారాయణ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బాం్యకు ఖాతాకు నిధులు బదిలీ చేశారు. ఆ నిధులతో ఆ కంపెనీ ఉద్యోగుల పేరున భూములు కొనుగోలు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆ ఉద్యోగులను సిట్ అధికారులు ప్రశ్నించగా తాము నారాయణ బినామీలుగానే భూములు కొనుగోలు చేశామని వాంగ్మూలం ఇచ్చారు.
బినామీల పేరుతో 75,888 చ.గజాలు
నారాయణ తమ బంధువులు, బినామీల పేరిట సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన 65.50 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్‌డీయేకు ఇచ్చారు. అందుకు ప్రతిగా ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీ కింద సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో అత్యంత విలువైన 75,888 చ.గజాల స్థలాలను పొందారు. వాటిలో 7,620 చ.గజాలు, 8,880 చ.గజాలు, 6,550 చ.గజాలు, 25 వేల చ.గజాల స్థలాలు కూడా ఉండటం... అవి నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానించి ఉండటం గమనార్హం.
భవిష్యత్‌లో స్టార్ హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఇతర భారీ వాణిజ్య సముదాయాల నిర్మాణానికి అనుకూలమైన, విలువైన స్థలాలను పొందారన్నది స్పష్టమవుతోంది. పూలింగ్ ప్యాకేజీ కింద ఏటా సీఆర్‌డీఏ ఇప్పటి వరకు చెల్లించిన రూ.1.92 కోట్ల కౌలు మొత్తం ఎన్‌స్పైరా ఖాతాల్లో జమ చేస్తున్నారు. అంటే ఆ భూములు కొనుగోలు చేసి సీఆర్‌డీఏకే ఇచ్చినట్టు పేర్కొన్న పొత్తూరి ప్రమీల, రాపూరి సాంబశివరావు, ఆవుల ముని శంకర్, వరుణ్ కుమార్ కొత్తప్ప పూర్తిగా నారాయణ బినామీలేనన్నది నిర్ధారణ అయ్యింది.
బెడిసికొట్టిన పన్నాగం
►కరకట్ట నివాసంపై న్యాయస్థానాన్ని, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సీఎం హోదాలో చంద్రబాబు జీతంతో పాటు ఇంటి అద్దె అలవెన్స్ కూడా తీసుకున్నారు. కానీ చంద్రబాబు 2017 నుంచి తాను ఉంటున్న కరకట్ట నివాసానికి గాను లింగమనేని కుటుంబానికి అద్దె చెల్లించినట్టు ఎక్కడా బ్యాంకు లావాదేవీలు లేవు.
చంద్రబాబు నుంచి తీసుకున్న అద్దెకు లింగమనేని ఎక్కడా జీఎస్టీ చెల్లించనే లేదు. దీన్నిబట్టి క్విడ్ ప్రో కోలో భాగంగానే కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు లింగమనేని ఇచ్చారన్నది సుస్పష్టమైంది.
► కరకట్ట నివాసంపై తప్పుదోవ పట్టించేందుకు లింగమనేని రమేశ్ కూడా యత్నించారు. తాను దేశభక్తితోనే కరకట్ట నివాసాన్ని అప్పటి ప్రభుత్వం వాడుకునేందుకు ఉచితంగా ఇచ్చానని న్యాయస్థానానికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇంటిని ఉచితంగా ఇస్తే చంద్రబాబు ప్రజాధనం నుంచి ఇంటి అద్దె అలవెన్స్‌ను ఎందుకు తీసుకుంటున్నారని సిట్ అధికారులు ప్రశ్నించగా లింగమనేనికి నోట మాట రాలేదు.
► దేశభక్తితో ఉచితంగా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి గానీ, చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఇవ్వడం ఏమిటంటే కూడా సమాధానం లేదు. ప్రభుత్వానికే ఉచితంగా ఇచ్చి ఉంటే.. బాబు సీఎం పదవి నుంచి దిగిపోగానే ఆ ఇంటిని ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించాలి.
► 2019లో సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా చంద్రబాబు అదే కరకట్ట నివాసంలో ఉంటున్నారు. అంటే లింగమనేని దేశ భక్తితో ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారన్నది అవాస్తవం. క్విడ్ ప్రో కో లో భాగంగానే ఆయన చంద్రబాబుకు ఇచ్చారన్నది నిర్ధారణ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment