రైతులూ ఆందోళనొద్దు.. సన్న బియ్యానికే 500 బోనస్ అనలేదు: డిప్యూటీ సీఎం భట్టి | Deputy CM Bhatti Vikramarka Comments On Opposition Parties | Sakshi
Sakshi News home page

రైతులూ ఆందోళనొద్దు.. సన్న బియ్యానికే 500 బోనస్ అనలేదు: డిప్యూటీ సీఎం భట్టి

Published Tue, May 21 2024 1:52 PM | Last Updated on Tue, May 21 2024 2:39 PM

Deputy CM Bhatti Vikramarka Comments On Opposition Parties

సాక్షి, హైదరాబాద్‌: రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సన్న బియ్యానికే 500 బోనస్ అనలేదని.. 500 బోనస్ సన్నబియ్యంతో మొదలు పెడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాలు ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదని.. రైతుల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరగడంతో అక్కసు వెళ్లగక్కుతున్నారంటూ మండిపడ్డారు.

‘‘మూడు రోజుల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నాం.. రైతుల దగ్గర తడిచిన ధాన్యం కూడా కొంటున్నాం.. తరుగు లేకుండానే ధాన్యం కొంటున్నాం.. కొనుగోలు కేంద్రాలను కూడా పెంచాం.. తడిచినా, మొలకెత్తినా చివరి గింజ వరకు కొంటాం.. పదేళ్లలో ఏం చేయలేని వారికి మమ్మల్ని విమర్శించే హక్కు లేదు’‘ అంటూ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రైతులను ఇబ్బంది పెట్టేందుకు రాజకీయాలను వాడొద్దని ప్రతిపక్షాలకు డిప్యూటీ సీఎం హితవు పలికారు.

రాష్ట్రంలో అసలు ధాన్యమే కొనుగోలు చేయడం లేదు, కళ్ళల్లో ధాన్యం తడిసి ముద్దౌతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు గాలి మాటలు మాట్లాడడం సరైనది కాదు, గత ఏడాది ఇదే సమయంలో నేను పాదయాత్ర చేస్తుండగా రోడ్ల వెంట ధాన్యం కుప్పలుగా పోసి రైతులు ఇబ్బంది పడేవారు, గత ప్రభుత్వం తడిసిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయలేదు ఈ విషయాన్ని వేలాది మంది రైతులు నా పాదయాత్ర సమయంలో గోడు వెళ్లబోసుకున్నారు అని వివరించారు.

మొలకెత్తిన ధాన్యం సైతం మద్దతు ధరకే తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత తమదే అన్నారు. ఇక ధాన్యానికి బోనస్‌ విషయానికి వస్తే సన్నాలకు 500 రూపాయల బోనస్‌తో ఈ ప్రక్రియను మొదలు పెట్టామని చెప్పారు. నాటి సీఎం కేసీఆర్ వరి వేస్తే ఊరే అని ప్రకటించిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.

భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడేలా ప్రయత్నం చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దుష్టశక్తుల చేతిలో బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో టెక్నాలజీ కమ్యూనికేషన్ రంగాన్ని ముందు చూపుతో ప్రధానిగా రాజీవ్ గాంధీ ఆచరణలో పెట్టారని, యువతను రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతున్నాయి ఎంత ధాన్యం కొనుగోలు చేశాం ఇలాంటి సమాచారం క్షణాల్లో తెలుసుకుంటున్నాం దీనికి కారణం రాజీవ్ గాంధీ చూపిన మార్గము.. ప్రజా అవసరాలను తీర్చడంలో రాజీవ్ గాంధీ మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement