మీడియాతో మాట్లాడుతున్న హరీశ్‌రావు. చిత్రంలో ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుతారా? లేదా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రెండు రోజులు ముందుకు జరపడంలో ఉన్న తొందర, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద లేదని ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యేలు ప్రభాకర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తామని ప్రచారం చేసిన కాంగ్రెస్..ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర గవర్నర్ ప్రసంగాన్ని విజన్ డాక్యుమెంట్ లాగా చూస్తాం.. కానీ గవర్నర్‌తో అర్ధ సత్యాలు ప్రచారం చేయిస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. వృద్ధులు, వికలాంగులు, ఆసరా పింఛన్‌దారులు, మహిళలు, వరి పంటకు బోనస్ గురించి మాట్లాడక పోవడం నిరాశ మిగిల్చిందని అన్నారు. గవర్నర్ ప్రసంగం ప్రజలకు ఎలాంటి విశ్వాసం కల్పించలేదని చెప్పారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధి గురించి మాట్లాడలేదని, మేనిఫెస్టోలోని అంశాలు, నిరుద్యోగ భృతి గురించి చెప్పలేదని ధ్వజమెత్తారు. పవర్ ప్లాంట్‌లు, మూసీ నది పునరుద్ధరణ ప్రస్తావన లేదని అన్నారు. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతం ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు.
‘దావోస్’పై వైట్ పేపర్ విడుదల చేయండి
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక మిగిలింది 40 రోజులేనని హరీశ్‌రావు అన్నారు. ఈలోగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే హామీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. రూ.2 లక్షల రుణమాఫీ ఎక్కడ అని నిలదీశారు. అధికారంలోకి రాగానే రూ.15 వేల రైతుబంధు ఇస్తామన్న హామీ, వడ్లకు రూ.500 బోనస్ ఏమయ్యాయని ప్రశ్నించారు. రూ.500కు గ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని మాత్రమే చెప్పారని, తద్వారా మిగతా హామీలు వచ్చే ఏడాదిలో చేయలేమని చెప్పకనే చెప్పారని అన్నారు.
24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి మాట తప్పారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులు కరెంట్ కోతలు ఎదుర్కొంటున్నారంటూ.. యాద్రాద్రి విద్యుత్ ప్లాంట్ చివరి దశలో ఉందని, దాన్ని పూర్తి చేస్తే కొంతమేర విద్యుత్ కొరత నుంచి గట్టెక్కవచ్చునని అన్నారు. దావోస్ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన రూ.40 వేల కోట్ల పెట్టుబడులపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రతిరోజూ ప్రజావాణి ఎక్కడా?
ప్రతిరోజూ ప్రజావాణి నిర్వహిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటలు ఏమయ్యాయని హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామన్నారని.. తొలుత సీఎం, తర్వాత మంత్రులు, ఆ తర్వాత అధికారులు, చివరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తులు తీసుకునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. దీనిపై గవర్నర్‌తో కూడా అసత్యాలు చెప్పించారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment