ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఘట్టం ముగియడంతో సర్వత్రా ఎవరు గెలుస్తారన్నదే చర్చగా సాగుతోంది. ఈ ఎన్నికలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రంగా జరిగిన ఎన్నికలు కావడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికలలో జగన్ విజయం సాధిస్తే అది దేశానికి ఒక మోడల్ అవుతుంది.జగన్ తీసుకువచ్చిన పలు వ్యవస్థలను దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి వివిధ రాష్ట్రాలు ముందుకు వస్తాయి.జగన్‌ను ఒంటరిగా ఓడించలేమన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కాళ్లావేళ్ల పడి జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుంది.
అయినా ఎంతవరకు ప్రయోజనం కలిగిందన్నది ప్రశ్నార్దకమే. మూడు పార్టీల కూటమి కావడంతో బలం పెరిగిందని,తెలుగుదేశం పార్టీ నౌ ఆర్ నెవర్ అన్న చందంగా పని చేసిందని, ఆ పార్టీకి జీవన్మరణ సమస్య కావడంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు తమను తాము భ్రష్టు పట్టించుకుంటూ కూడా అబద్దాలు ప్రచారం చేశాయని, వాటన్నిటి పలితంగా గెలిచే అవకాశం లేకపోలేదన్నది ఆ పార్టీవారి భావనగా ఉంది.
అయినా వైఎస్సార్‌సీపీలో కాన్ఫిడెన్స్ తెలుగుదేశం కూటమిలో కనిపించడం లేదన్నది సత్యం.. నిజంగానే టీడీపీ కూటమి గెలుస్తుందన్న నమ్మకం కలిగి ఉంటే ,ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అదే తరహాలో కూటమి గెలుపు ఖాయం అన్న శీర్షిక బ్యానర్ ఇచ్చేవని, అలా చేయకపోవడం కూడా టీడీపీ ఓటమికి ఒక సంకేతం అన్న విశ్లేషణ వస్తోంది.
నిజానికి ఈనాడుకు ఉన్న నెట్ వర్క్ రీత్యా, సోమవారం సాయంత్రానికి జనాభిప్రాయ సేకరణ పూర్తి చేసి వాస్తవ పరిస్థితిని ఇచ్చి ఉండవచ్చు. అలా చేయలేదంటే వారికి కూటమి విజయంపై సందేహం కలిగి ఉండవచ్చని కొందరు అంటున్నారు. ఒకవేళ మంగళవారం ఏమైనా ఇస్తారేమో తెలియదు. కాని కేవలం టీడీపీ వర్గాల ధీమా పేరుతోనే కథనాలు ఇచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వ పనితీరుకు ఒక రిఫరెండంగా పరిగణించే ఈ ఎన్నికలలో మహిళలు ,వివిధ సంక్షేమ పధకాల లబ్దిదారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమన్నది ఆయా వర్గాలలో వినిపిస్తున్నమాట.
ఓవరాల్‌గా చూసినప్పుడు అత్యధికులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వస్తుందనే విశ్వసిస్తున్నారు. దీనికి కొన్ని కారణాలు బలీయంగా కనిపిస్తున్నాయి. అవేమిటో చూద్దాం. టీడీపీ కూటమిలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ, జనసేనలు కలిసి 31 నియో.జకవర్గాలలో పోటీచేశాయి. వారికి ఉన్న బలాబలాల రీత్యా, టీడీపీ నుంచి వచ్చే ఓట్ల బదలాయింపు వంటి అంశాల కారణంగా ఈ రెండు పార్టీలు కలిసి ఐదు నుంచి పది సీట్లు మాత్రమే గెలవవచ్చన్నది ఒక అంచనా. ఈ లెక్కన వైఎస్సార్‌సీపీ ఇరవై సీట్లను సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యత ఉంది.
గత ఎన్నికలలో సైతం 52 సీట్లకు గాను నలభై తొమ్మిదింటిని వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. 2024 ఎన్నికలలో సైతం వైఎస్సార్‌సీపీ వేవ్ రాయలసీమ అంతటా ఉంది. అయినప్పటికీ కొన్ని సీట్లు తగ్గుతాయని అనుకున్నా, మినిమమ్ ముప్పై ఐదు నుంచి నలభై సీట్లు రావచ్చని అంతా అంగీకరిస్తున్నారు. అంటే ఇప్పటికి ఏభై సీట్లు వైఎస్సార్‌సీపీ గెలుచుకున్నట్లు లెక్క అవుతుంది. ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీ బలం బాగా ఉంది.అక్కడ ఉన్న ముప్పై నాలుగు సీట్లలో కనీసం పదిహేడు నుంచి ఇరవై సీట్లు వైఎస్సార్‌సీపీ గెలుచుకోవచ్చు. అదే జరిగితే ఇక్కడికి డెబ్బై సీట్లు గెలిచినట్లు అవుతుంది. ఇక ఇరవై సీట్లు తెచ్చుకుంటే వైఎస్సార్‌సీపీ గెలిచినట్లే అవుతుంది.
టీడీపీ పొత్తు పెట్టుకున్న కారణంగా ముస్లిం మైనార్టీలు కూటమికి దూరం అయ్యారు. వారు కనీసం నలభై నుంచి ఏభై నియోజకవర్గాలలో ప్రభావం చూపవచ్చు. ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తామని బీజేపీ చేసిన ప్రకటన కూడా ముస్లింలలో ఆగ్రహానికి కారణం అయింది. ఈ నేపధ్యంలో రాయలసీమలో అధిక శాతం ఉన్న ముస్లింలు వైఎస్సార్‌సీపీవైపు మొగ్గు చూపుతున్నారు. కోస్తా ఆంధ్రలో సైతం అదే పరిస్తితి ఉంది. నెల్లూరు నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ఉన్న ఆరు జిల్లాలలో నలభై సీట్లు రావడం కష్టం కాదు. అంటే ఈ లెక్కన కనీసం 110 సీట్లు వైఎస్సార్‌సీపీకి రావడం ,తిరిగి జగన్ ముఖ్యమంత్రి కావడం తధ్యం అనిపిస్తుంది. 2014లో ఉన్న కూటమి పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పుడు నరేంద్ర మోదీ హవా బాగా పనిచేసింది.అలాగే అప్పుడే పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని పెట్టడం, కాపు వర్గాన్ని బాగా ఆకర్షించడం కారణంగా టీడీపీ అధికారంలోకి రాగలిగింది.
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ మూడు పార్టీలు 2019 ఎన్నికల సమయంలో ఒకదానిని ఒకటి తిట్టుకున్నాయి. విమర్శించుకున్నాయి. బీజేపీతో పొత్తు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని తమ అవసరాలకు వాడుకోవడం, ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడం కోసమేనన్న సంగతి అందరికి అర్దం అయింది.
ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు దాదాపు నెరవేర్చడం , ఆయన ఒంటరిగా ధైర్యంగా ఎన్నికల గోదాలోకి దిగడం, ఒక సిస్టమాటిక్ గా సభలు నిర్వహించడం , ఆచరణ సాధ్యమైన హామీలనే ఇవ్వడం వంటి కారణాల వల్ల ప్రజలలో ఆయన పట్ల ఒక నమ్మకం కుదిరింది. ప్రత్యేకించి పేద, బలహీనవర్గాలలో అది బాగా ప్రస్పుటంగా కనిపించింది. సామాజికంగా కూడా జగన్ పలు ప్రయోగాలు చేసి బిసిలకు ఎక్కువ సీట్లు ఇవ్వగలిగారు.అది కూడా ప్లస్ పాయింట్ గా ఉంది. జగన్ ఎక్కువగా పాజిటివ్ ఓటుపై ఆధారపడితే విపక్ష కూటమి నెగిటివ్ ఓటుపైనే ఆధారపడింది. వారి మానిఫెస్టోని ఎవరూ విశ్వసించడం లేదు. తెలుగుదేశం కు ఓటు వేయాలని అనుకున్నవారు సైతం ఆ ఎన్నికల ప్రణాళిక అయ్యేది కాదని తెలిసినా, ఇతర కారణాల రీత్యానే ఓట్లు వేశారు.
గతంలో జగన్ ఈ స్కీములను అమలు చేస్తుంటే శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేసిన చంద్రబాబు తన మానిఫెస్టోలో అంతకు మించి రెండు,మూడు రెట్లు సంక్షేమ పధకాలు అమలు చేస్తామని అనడంతో జగన్ గ్రాఫ్ బాగా పెరిగింది. అబద్దాల ప్రచారాన్ని నమ్ముకుని టీడీపీ పనిచేసింది. లేని లాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల భూములను జగన్ లాక్కుంటారంటూ తప్పుడు ప్రచారం చేశారు. అసెంబ్లీలో టీడీపీ మద్దతు ఇచ్చిన బిల్లునే మాటమార్చి వ్యతిరేకిస్తోందని చెప్పడంలో వైఎస్సార్‌సీపీ చాలా వరకు సఫలం అయింది.
అది కూడా టీడీపీకి నష్టం చేసిందని చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రెడ్లు, అగ్రవర్ణాలలోని అధికశాతం పేదలు జగన్‌కు మద్దతు ఇస్తున్నారు. ఆ ప్రభావం పోలింగ్ పై స్పష్టంగా కనబడింది. ఈకాంబినేషన్ అలాగే కొనసాగితే జగన్ ను ఓడించడం అసాద్యం. 2019 లో ఇవే సామాజికవర్గాలు జగన్ కు భారీ ఎత్తున మద్దతు ఇచ్చాయి. అవి ఇప్పటికీ అలాగే కొనసాగుతుండడం జగన్‌కు కలిసి వచ్చే పాయింట్. తమ కోసం లక్షల మంది కార్లు వేసుకుని హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చారని టీడీపీ వాదిస్తోంది.
కార్లలో వెళ్లినవారు పెత్తందార్లకు ప్రతినిధులుగా ఉంటే, బస్‌లు, ట్రైన్లలో వెళ్లినవారు పేద ప్రజలకు ప్రతినిదులగా చెప్పవచ్చు. ఆ రకంగా చూసుకున్నా, ఇలా వెళ్లినవారిలో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులే ఎక్కువగా కనిపిస్తారు. సామాజికవర్గాల సమీకరణ రీత్యా చూసినా, ప్రాంతాల వారీగా పరిశీలించినా, రాజకీయ కోణాలలో అద్యయనం చేసినా, ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీ కూటమి ప్రభుత్వమేనన్న అభిప్రాయం కలుగుతుంది. పోటీ బాగా టైట్‌గా సాగితే వైఎస్సార్‌సీపీకి కనీసం 100 నుంచి 110 సీట్లు వస్తాయి.అది వేవ్‌గా మారితే వైఎస్సార్‌సీపీ గత ఎన్నికల మాదిరి 150 వరకు రావడం కష్టం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment