Kommineni Srinivasa Rao Comment On BJP High Command Over New Changes Of Telugu States - Sakshi
Sakshi News home page

అదే బండి సంజయ్‌కు మైనస్‌ అయ్యిందా?

Published Thu, Jul 6 2023 5:45 PM | Last Updated on Thu, Jul 6 2023 7:08 PM

KSR Comment On  BJP High Command New Changes Of Telugu States - Sakshi

తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులను మార్చడం ద్వారా ఆ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందా?కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించారు. తెలంగాణలో మరో నాలుగు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకు అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ దూకుడుగా ముందుకు వెళుతున్నట్లు కనిపించినా, పార్టీలో అందరిని ఒక తాటిపై నడిపించడంలో విఫలం అయ్యారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు.

నిజానికి ఎంపీగా ఎన్నికైనంతవరకు బండి సంజయ్ పేరు తెలంగాణలో పెద్దగా వ్యాప్తిలో లేదు. తదుపరి అనూహ్యంగా ఆయనను రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా నియమించడం ద్వారా అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ పదవి చేపట్టిన తర్వాత ఆయన కూడా తన శక్తిని రుజువు చేసుకోవడానికి గట్టి ప్రయత్నమే చేశారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయడానికి వెనుకాడలేదు. రెండు ఉప ఎన్నికలలో బీజేపీ గెలిచినా మైలేజీ ఆయనకు రాలేదు. అది గెలిచిన ఈటెల రాజేందర్, రఘునందనరావులకే వెళ్లింది. సంజయ్‌కు ఈటెల రాజేందర్‌కు  మధ్య అంతరం ఏర్పడింది. రఘునందన్  పిచ్చాపాటిగా మీడియాతో మాట్లాడుతూ చేసిన ఒక వ్యాఖ్య   సంజయ్‌కు తలనొప్పి అయింది.

ఈ సంగతి ఎలా ఉన్నా కొత్తగా పార్టీలోకి ఇతర పార్టీల నేతలు ఎవరూ పెద్దగా రాకపోవడం బండికి మైనస్ అయ్యింది. నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో క్యాడర్ అభివృద్ది కాలేదు.బీజేపీకి ఉండే సంప్రదాయబద్ద క్యాడర్ పైన, ఆర్ఎస్ఎస్‌కే ఆయన పరిమితం అయ్యారు. కేసీఆర్‌ ప్రభుత్వం కూడా కొన్ని విషయాలలో ఆయనపై సీరియస్ గానే వ్యవహరించింది.ఒక కేసుకు సంబందించి పోలీసులు ఆయనను రాత్రి పొద్దుపోయిన తర్వాత అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టిన తీరు వివాదాస్పదం అయింది. బీజేపీని దూకుడుగా ముందుకు తీసుకువెళుతున్నట్లు కనిపించాలని ఆయన యత్నించినా, ఆచరణలో అది పెద్దగా ఫలించలేదు.

దానికి తోడు కర్నాటక శాసనసభ ఎన్నికల ఫలితాలతో  బీజేపీ కి తెలంగాణలో కూడా గ్రాఫ్ పడిపోయింది. దాంతో బీజేపీ అధిష్టానం  తెలంగాణలో ఏమి చేయాలన్న ఆలోచనలో పడింది. బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ ద్వారా బీసీ వర్గాలను ఆకర్షించాలని తొలుత బీజేపీ నాయకత్వం భావించింది. కాని ఇప్పుడు వివిధ సమీకరణలను దృష్టిలో ఉంచుకుని కిషన్ రెడ్డికి పార్టీ బాద్యతలు కూడా అప్పగించారని అంటున్నారు.

దీంతో కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయంగా మద్దతుగా నిలిచిన రెడ్డి వర్గం ఓట్లను ఈయన చీల్చగలుగుతారా?అలా చీల్చితే అది కాంగ్రెస్ కు నష్టం చేస్తుందా?లేక బిఆర్ఎస్ కు నష్టం చేస్తుందా?అన్న మీమాంస వచ్చింది. బీజేపీ హైకమాండ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల  పార్టీకి మళ్లీ జోష్ వస్తుందా అంటే అప్పుడే చెప్పలేం.కొంతకాలం క్రితం వరకు బీజేపీ వైపు రెడ్డి సామాజికవర్గం ఆకర్షితమవుతుందా అన్న  అభిప్రాయం ఉండేది.

చదవండి: బండి సంజయ్ ను ఎందుకు తప్పించారు?

కాని తాజా పరిణామాలలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు బీజేపీవైపు వెళ్లకుండా కాంగ్రెస్ లో చేరడం కూడా గమనించదగ్గ పరిణామమే.  పార్టీకి జరగవలసిన డామేజీ జరిగిపోయాక బీజేపీ అదిష్టానం మార్పులు,చేర్పులు చేసినా ఎంత ఫలితం ఉంటుందన్నది సందేహమే అని చెప్పాలి. కిషన్ రెడ్డి సౌమ్యుడైన నేతగా పేరుంది. ఇంతకు ముందు కూడా ఆయన పార్టీ అధ్యక్ష పదవి నిర్వహించారు. ఆయన మూడుమార్లు శాసనసభకు ఎన్నికై, 2018లో జరిగిన ఎన్నికలలో ఓటమిపాలయ్యారు. అదే ఆయనకు కలిసి వచ్చింది.

2019లో జరిగిన లోక్సభ ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి ఆయన గెలుపొందారు. ఆయన మర్యాదస్తుడుగా  గుర్తింపు పొందడం కలిసి వచ్చింది. తదుపరి ఆయన కేంద్ర సహాయ మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఏకంగా క్యాబినెట్ మంత్రి అయ్యారు. ఇప్పుడు తిరిగి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అవడం వల్ల మంత్రి పదవిని వదలుకోవలసి రావచ్చని చెబుతున్నారు.

కేంద్ర మంత్రి పదవితో పాటు అధ్యక్ష పదవి కూడా ఉంటే ఆయన కూడా సంతోషంగానే బాద్యతను స్వీకరిస్తారు. అలాకాని పక్షంలో అంత సుముఖంగా ఉండకపోవచ్చు. ప్రభుత్వంలో ఉన్నతమైన పదవిని ఎవరు వదలుకోవడానికి ఇష్టపడతారు? దానికి తోడు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడం తో పోటీ వ్యవస్థ ఏర్పడుతోందన్న భావన కలుగుతోంది. ఇది ఇద్దరి మధ్య కాస్త చికాకు కలిగించే అంశమే కావచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎంత పెద్ద నేతను తీసుకు వచ్చి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని చేసినా ఉపయోగం ఉంటుందా? అన్న చర్చ వస్తుంది. ఇలాంటి క్రిటికల్ టైమ్ లో బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టవలసి రావడం కిషన్ రెడ్డికి ఒక పరీక్షే అవుతుంది. తెలంగాణలో బీజేపీని అదికారంలోకి తీసుకురాలేకపోతే దాని ప్రభావం కిషన్ రెడ్డి రాజకీయ జీవితంపై పడుతుంది. బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం ఆయనకు మహర్దశ పడుతుంది.

-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement