భూదాన్ పోచంపల్లిలో మగ్గం నేస్తున్న చేనేత కార్మికుడితో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి, యాదాద్రి: కేంద్రంలో మన(బీఆర్‌ఎస్) బలం, దీవెన, ఆశీర్వాదం లేకుండా ఎవరూ ప్రధాని కాలేరని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రంతో కొట్లాడి, శాసించి కేంద్రం మెడలు వంచే సీఎం కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకున్ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. జాతీ య చేనేత దినోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో నేతన్నలనుద్దేశించి మాట్లాడారు. నేతన్నల కష్టాలు సీఎం కేసీఆర్‌కు తెలుసని, కేసీఆర్ చిన్నప్పు డు ఒక నేతన్న ఇంట్లో ఉండి చదువుకున్నారని, చేనేత మగ్గం చప్పుడు.. అంటే మీ గుండె చప్పుడు తెలిసిన వ్యక్తి కాబట్టే ఈ రోజు దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. రైతు బీమా తరహాలో నేతన్నలకు బీమా సౌకర్యం తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనన్నారు.
వచ్చే నెల నుంచి మగ్గం నేసే ప్రతి ఒక్కరికి నెలకు రూ.3 వేలు
మగ్గం నేసే ప్రతి ఒక్కరికి నెలకు రూ.3 వేలు వచ్చే నెల నుంచి నేరుగా వారి ఖాతాలోనే జమ చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. నేతన్నలకు హెల్త్ కార్డు మంజూరు చేస్తామని, తద్వారా రూ.25 వేల వరకు అవుట్ పేషెంట్ వైద్య సేవలు అందుతాయని చెప్పారు. గుంట మగ్గాల స్థానంలో రూ.40 కోట్లతో తెలంగాణ చేనేత మగ్గం తెచ్చామని, అందరూ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. చేనేత రుణ మాఫీ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. చేనేత సహకార ఎన్నికలు కూడా జరిపిస్తామన్నారు.
హ్యాండ్లూమ్ పార్క్ పోచంపల్లి నేతన్నలకే..
భువనగిరి ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి కోరిక మేరకు పోచంపల్లి మండలం కనుముక్కులలో 23 ఎకరాల్లో ఉన్న పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌ను రూ.12.50 కోట్లతో ప్రభుత్వమే కొనుగోలు చేసిందని కేటీఆర్ వివరించారు. అవసరమైతే రూ.15కోట్లు అదనంగా ఖర్చు చేసి పార్కును బ్రహ్మాండంగా తయారు చేస్తామని, అందులోంచి వచ్చే లాభాలు పోచంపల్లిలోని ప్రతి నేత కుటుంబానికి అందచేస్తామని చెప్పారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు నేత కార్మికుల కష్టాలను, ఆకలి చావులను అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, భువనగిరి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రవీంద్ర కుమార్, రాష్ట్ర చేనేత జౌళి శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాశ్, డైరెక్టర్ అలుగు వర్షిణి, భువనగిరి జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
భూదాన్ పోచంపల్లిలో నేతన్న విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. తర్వాత యువ చేనేత కళాకారుడు సాయిని భరత్‌కు చెందిన కళా పునర్వి ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్‌ను సందర్శించారు. కనుముక్కులలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న హ్యాండ్లూమ్ పార్కుకు.. రూ.100 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment