సాక్షి, తెలంగాణ భవన్ : ‘రాహుల్ గాంధీకి ఉత్తరం రాస్తా.. నీ బండారం బయటపెడతా’ అంటూ సీఎం రేవంత్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌తో తలపడుతున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలకు,కేసులకు వెరవకుండా సింహాల్లా పోరాడుతున్న నాయకులు వారి పోరాటాన్ని మరో నాలుగేళ్లు కొనసాగించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
అనంతరం, ‘‘కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏమున్నది గర్వ కారణం అంటే..రేవంత్ రెడ్డి లక్ష కోట్ల అప్పులు కొత్తగా చేశారు. రేవంత్ బ్రదర్సేమో కోట్లకు పడగలెత్తారు. రాష్ట్రం అధోగతి పాలైంది. ప్రజలు తిప్పల పాలైన మాట వాస్తవం. ఏడాది రేవంత్ పాలన, కాంగ్రెస్ పాలన అంటే గుర్తుకొచ్చేది లక్ష కోట్ల అప్పులు, దారుణ ఘాతుకాలు, తప్పులు. ఏడాది పాలనలో ఏం సాధించారని అడిగితే..చెప్పడానికి ఏమీలేవు. అందుకే ముఖ్యమంత్రి తన తప్పుల్ని కప్పి పుచ్చుకోవడానికి అప్పులు అంటూ తప్పుడు కూతలు కూస్తున్నారు.
..తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పదవికే కళంకం తెచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైనా బాగుపడ్డారా? అంటే అనుముల బ్రదర్సే. వాళ్లకే లాభం జరిగింది. రాష్ట్రానికి వెయ్యి కోట్ల పెట్టుబడులు ఇచ్చే స్థాయికి అనుముల బ్రదర్స్ ఎదిగారని ప్రజలు అనుకుంటున్నారు. వచ్చే ఏడాది ఫోర్బ్స్ జాబితాలో రిచెస్ట్ బ్రదర్స్ ఎవరంటే అనుముల బ్రదర్స్ వస్తారేమో..అదానీని కూడా దాటేస్తారేమో అని ప్రజలు అనుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
..ఏడాది పాలనలో రేవంత్‌రెడ్డి చేసింది ఏందంటే.. పొద్దున్నే లేస్తే కేసీఆర్ మీద తిట్లు.. దేవుళ్ల మీద ఒట్లు. రాష్ట్ర ప్రతిష్ట పెంచాల్సింది పోయి.. దివ్యంగా ఉన్న రాష్ట్రం దివాళా తీసిందని ఆరోపణలు చేసిన దివాళా కోరు సీఎం ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. కొత్త పరిశ్రమలు కాదు.. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి. ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఇవాళ కొత్త స్లోగన్ పెట్టుకున్నాడు.. తెలంగాణ రైజింగ్ అని అంటున్నారు. తెలంగాణ రైజింగ్ కాదు.. అనుముల బ్రదర్స్ రైజింగ్. అదానీతో పోటీ పడుతూ ఆస్తులు పోగేసుకుంటున్నారంటే వాళ్లు అనుముల బ్రదర్స్. అందుకే అనుముల బ్రదర్స్ రైజింగ్.. తెలంగాణ ఫాలింగ్ ఇది పక్కా.
..పన్నెండు నెలల పాలన మొత్తం అసత్యాలు, అటెన్షన్ డైవర్షన్ స్కీంలు తప్ప ఏం చేశారు. అప్పులు.. అప్పులు అంటూ మీ అసమర్థతను కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోం. వదిలి పెట్టం. ఏడాది పాలన పూర్తయితే సాధించిన విజయాల గురించి చెప్పుకోవాలి. ఆరు గ్యారెంటీల మీద చర్చ జరగొద్దని.. అప్పులు అంటూ కారుకూతలు కూస్తున్నావు. అప్పుల మీద కాదు.. మీరిచ్చిన హామీల మీద చర్చలు జరగాలి’’ అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment