ఏలూరు జిల్లా చింతలపూడిలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఖాళీగా ఉన్న కుర్చీలు
సాక్షి, అనకాపల్లి/సాక్షి ప్రతినిధి ఏలూరు/చింతలపూడి: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం గొండుపాలెం, ఏలూరు జిల్లా చింతలపూడిలో సోమవారం నిర్వహించిన ‘రా..కదిలి రా’ సభలు తుస్సుమన్నాయి. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రసంగిస్తున్న సమయంలోనే సగం కుర్చీలు ఖాళీ అయ్యాయి. వైఎస్సార్‌సీపీ భీమిలి ఎన్నికల శంఖారావం ‘సిద్ధం’ సభకు ధీటుగా వీటిని నిర్వహించాలని యత్నించిన టీడీపీ చివరకు అభాసుపాలైంది.
గత వారం రోజులుగా అనుకూల మీడియా వార్తలు, టీడీపీ సన్నాహక సమావేశాల్లో రెండు లక్షల మందితో గొండుపాలెం సభ నిర్వహిస్తున్నట్లు ఊదరగొట్టారు. సీన్ కట్ చేస్తే.. రెండు సభల్లో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించడంతో నేతలందరూ అవాక్కై పార్టీ పరిస్థితిపై తలలు పట్టుకున్నారు. పైగా.. సభకు వచ్చిన జనంలో సగం మంది చంద్రబాబు ప్రసంగంపట్ల ఆసక్తిలేక వెనుదిరిగారు. మరికొందరు ఆటోల్లో, చెట్ల కిందే కూర్చున్నారు తప్ప సభాస్థలికి వెళ్లలేదు. చింతలపూడిలో పార్టీ శ్రేణుల అంచనా మేరకు మూడువేల కుర్చీలు వేస్తే అందులో సగానికి పైగా ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి అర్ధంచేసుకోవచ్చు.
పసలేని బాబు ప్రసంగం..
ఇక రెండుచోట్లా చంద్రబాబు తన ప్రసంగంతో జనాన్ని ఎప్పటిలాగే విసిగించారు. సీఎం వైఎస్ జగన్ మొదలుకుని అధికార వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ బాలకృష్ణ సినిమా డైలాగులు చెప్పినా సభలో స్పందన కనిపించలేదు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోలేని పెట్రోల్, డీజిల్ ధరలపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల పేరిట బటన్ నొక్కి పేదలకు సొమ్ము పంపిణీ చేయడంవల్ల రాష్ట్రం దివాలా తీస్తోందని ఆరోపించడం సభికులకు విసుగు తెప్పించింది.
సీఎం జగన్‌పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని.. ఇది మరింత పెరిగి తుపానుగా మారి.. అందులో జగన్ కొట్టుకుపోవడం ఖాయమని ఆయన చెప్పారు. విశాఖను పరిపాలనా రాజధాని చేయడం తనకు ఇష్టంలేదని చంద్రబాబు మరోసారి ఖరాఖండిగా చెప్పారు. ఏపీ పోలీసులు గంజాయి వ్యాపారాలు చేసుకుంటున్నారని.. మొత్తం పోలీస్ వ్యవస్థనే తప్పుపట్టే విధంగా ఆయన మాట్లాడారు. నెలకోసారి పోలవరాన్ని సందర్శించి ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిగెత్తించానని, 72 శాతం పనులు తానే చేయించానని చెప్పుకున్నారు.
అలాగే, ‘విశాఖలో మిలీనియం టవర్స్ నేనే కట్టాను.. అక్కడ అదాని సెంటర్ కడితే జగన్‌మోహన్‌రెడ్డి తరిమేశాడు.. విశాఖ మెట్రో ఎప్పుడో ప్రారంభించాను.. అమరావతిని నేను రాజధాని చేస్తే .. ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖను ఎందుకు జగన్ పరిపాలన రాజధాని చేస్తున్నారు’.. అంటూ చంద్రబాబు ప్రసంగం సాగింది. పదే పదే వైఎస్సార్‌సీపీపై యుద్ధానికి సిద్ధమా అంటూ రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడారు.
అయ్యన్న ధిక్కార స్వరం..
ఇక మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు గొండుపాలెం సభలో ధిక్కార స్వరంతో తన కొడుకు విజయ్‌ని అనకాపల్లి ఎంపీగా ఆశీర్వదించాలని సభ సాక్షిగా కోరడం చంద్రబాబుకి తలనొప్పిగా మారింది. కానీ, అనకాపల్లి ఎంపీ టికెట్ వ్యాపారవేత్త బైరా దిలీప్ చక్రవర్తికి కేటాయించినట్లు టీడీపీ తమ అనుకూల పత్రిక ప్రచురించింది. అయినా.. దిలీప్ సభా ప్రాంగణంలో ఎక్కడా కనిపించకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. అలాగే, చింతలపూడి సభలో చింతమనేని ప్రభాకర్ మీడియాపై జులుం ప్రదర్శించారు. విలేకరులు ఆయన ఫొటోలు తీస్తుండటంతో వారి ఫోన్లు లాక్కుని పార్టీ నేతలు ఎంత చెప్పినా వినకుండా వెళ్లిపోయారు.
మాడుగుల నేతలకు ఝలక్..
మరోవైపు.. మాడుగుల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది. ఇక్కడ టీడీపీ మూడు వర్గాలుగా చీలిపోయి అత్యంత బలహీనంగా ఉంది. దీనికితోడు జనసేన ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో.. ఈ సభకు మాడుగులలోని ముగ్గురు నేతలతో ఖర్చు చేయించిన చంద్రబాబు సభలో జనసేనకు ఇక్కడ టిక్కెట్ ఇచ్చినా అందరూ కలిసి చేయాలన్నారు. దీంతో ఆశావహులు రామానాయుడు, పీవీజీ కుమార్, పైలా ప్రసాద్‌రావుల మొహాలు మాడిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment