రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థిత్వాలపై రగిలిపోతున్న తమ్ముళ్లు
అనకాపల్లిలో తాడోపేడో తేల్చుకుంటామంటున్న పీలా వర్గీయులు
నారా భువనేశ్వరిని రోడ్డుపైనే అడ్డుకున్న ఆయన అనుయాయులు
పి.గన్నవరంలో సరిపెళ్ల రాజేశ్‌కు వ్యతిరేకంగా దళితుల ఆందోళన
మడకశిరలో సునీల్ వద్దంటూ టీడీపీ నేతల నిరసన
డీకే పార్థసారథికే పెనుకొండ టికెట్ ఇవ్వాలని నేతల డిమాండ్
నమ్మినందుకు నట్టేట ముంచారని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని ఆగ్రహం
సాక్షి, అనకాపల్లి/సాక్షి, అమలాపురం/ అయినవిల్లి/మడకశిర/పెనుకొండ/ఉదయగిరి: రాష్ట్రంలో టికెట్ల కేటాయింపు వ్యవహారం టీడీపీలో కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అభ్యర్థుల ఖరారు విషయంలో అధినేత అనుసరిస్తున్న వైఖరిపై బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా జెండా మోసినవారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చినవారికి అందలం ఎక్కించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆ పార్టీకి కేటాయించిన స్థానాల్లోనూ ఆందోళనలు మిన్నంటుతున్నాయి.
అనకాపల్లిలో పెల్లుబికిన నిరసనలు
అనకాపల్లి స్థానాన్ని టీడీపీ–జనసేన కూటమి తరఫున కొణతాల రామకృష్ణకు కేటాయించడంపై అక్కడి టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇన్నాళ్లుగా తాను పార్టీకోసం కష్టపడితే తనను పార్టీ అధిష్టానం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా అక్కడి అభ్యర్థి కొణతాల తనను పట్టించుకోకుండా తన వ్యతిరేక వర్గమైన బుద్ధా నాగ జగదీశ్‌ను కలవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయంలో తాడో పేడో తేల్చుకోవాలని పీలాపై ఆయన వర్గీయులు ఒత్తిడి తీసుకొస్తున్నారు.
బాబు సతీమణి భువనేశ్వరి అడ్డగింత
‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరిని యలమంచిలి వెళ్లే దారిలో కూండ్రం వద్ద పీలా గోవింద వర్గీయులు అడ్డుకున్నారు. అనకాపల్లి రూరల్ మండల అధ్యక్షుడు పచ్చికూర రాము ఆధ్వర్యంలో నాయకులు సుమారు 10 నిమిషాలపాటు రోడ్డుకు అడ్డంగా నిలబడి పీలా గోవిందకే అనకాపల్లి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే భువనేశ్వరి కారు దిగి పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని హామీ ఇవ్వడంతో వారంతా తప్పుకున్నారు.
తాడోపేడో తేల్చుకునేందుకు ‘బొల్లినేని’ నిర్ణయం
నెల్లూరు జిల్లా ఉదయగిరి అభ్యర్థిగా తనను నియమించనందుకు ఇక తాడోపేడో తేల్చుకోవాలని అక్కడి టీడీపీ ఇన్‌చార్జి బొల్లినేని వెంకట రామారావు నిర్ణయించుకున్నారు. పన్నెండేళ్లుగా పార్టీని, కేడర్‌ను కాపాడుకుంటూ వస్తే ఇప్పుడు ఎన్‌ఆర్‌ఐ కాకర్ల సురేష్‌కు టికెట్ కేటాయించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఆత్మీయుల వద్ద వెలిబుచ్చి కన్నీటిపర్యంతం కావడంతో కేడర్ ఉద్రేకానికి లోనైంది.
ఒక్క మాట చెబితే కాకర్లను ఉదయగిరిలో నామినేషన్ కూడా వేయనివ్వమని తేల్చిచెప్పింది. గురువారం కలిగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆత్మీయులతో మాట్లాడుతూ తనకు టికెట్ విషయంలో న్యాయం జరగకపోతే కార్యకర్తల అభీష్టం మేరకు మార్చి రెండో తేదీన అధినేతను కలసిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.
పెనుకొండలో కొనసాగుతున్ననిరసనలు
అనంతపురం జిల్లా పెనుకొండలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి కాదని అన్నా క్యాంటీన్ అంటూ హడావుడి చేసిన సవితకు టికెట్ ఇవ్వడంపై నిరసనలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి టీడీపీ కార్యకర్తలు రోజూ బీకే ఇంటి వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. గురువారం కూడా నిరసనలు కొనసాగాయి. పార్థసారథికి టికెట్ ఇవ్వకుంటే టీడీపీని ఓడిస్తామని నేతలు చెబుతున్నారు.
సునీల్‌ను మార్చకుంటేరాజీనామా
శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గురువారం మరోసారి తిప్పేస్వామి వర్గీయులు నిరసనకు దిగారు. సునీల్‌ను మార్చకుంటే తామంతా రాజీనామా చేయడానికి వెనుకాడేది లేదని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment