తెలంగాణ బీజేపీకి గతంలో ఎన్నడూ లేనివిధంగా క్రేజ్ వచ్చింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా టీ.బీజేపీ చీఫ్ పేరు అందరి నోటా నానింది. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్లేస్‌ను రీప్లేస్ చేశారనే పేరు తెచ్చుకున్నారు. కాని ఇప్పుడు హఠాత్తుగా ఆయనను మార్చేశారు. మళ్ళీ గత అధ్యక్షుడినే కొత్తగా నియమించారు. అసలు బండి సంజయ్ మార్పు వెనుక జరిగిందేంటి?
తెలంగాణలో కమలం పార్టీకి ఊపు తెచ్చిన బండి సంజయ్‌ను పార్టీ పెద్దలు ఆకస్మికంగా మార్చేశారు. ఆయన్ను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అని దేశంలోని బీజేపీ కేడర్ మొత్తానికి తెలిసేలా ఆయన పార్టీని రాష్ట్రంలో మాంచి దూకుడుగా నడిపించారు. రాష్ట్రంలో పార్టీ కేడర్‌కు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తేజాన్ని కలిగించారు. గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ మంది కార్పొరేటర్లను గెలిపించుకుని.. బీఆర్ఎస్ నాయకత్వానికి కునుకు లేకుండా చేశారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని బెదరగొట్టారు. గతంలో కిషన్‌రెడ్డి మూడు సార్లు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఇలాంటి దూకుడు లేదు. కాని ఇప్పుడు బండి స్థానంలో మళ్ళీ కిషన్‌రెడ్డినే కమలం పార్టీ హైకమాండ్ నియమించింది. అసలు బండిని ఎందుకు మార్చారు?
బండి సంజయ్ పార్టీకి ఊపు తేవడంలో ఎంత సక్సెస్ అయ్యారో.. తన ఒంటెత్తు పోకడలతో పార్టీలోని పలువురు నాయకులకు అలాగే దూరమయ్యారని... ఎవరినీ కలుపు పోరనే పేరు తెచ్చుకున్నారు. ఆయన వ్యవహారశైలే ఆయన పుట్టి ముంచిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కీలక సమయాల్లో ఆయనకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు లేకపోవడం, ఆయన చుట్టూ ఆ స్థాయి నేతలు లేకపోవడం కూడా సంజయ్‌కు నష్టం కలిగించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన నిర్వహించిన కార్యక్రమాలతో పార్టీలో సంచలనం సృష్టిస్తూ..కేడర్‌ను ఉత్సాహపరిచారు. అదే సమయంలో పలు వివాదాలకు కూడా కేంద్ర బిందువయ్యారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత, ఈటల రాజేందర్‌తో దూరం పెరగడం, ఇతర ముఖ్య నేతలతో కూడా పొసగకపోవడం తన తోటి ఎంపీలు, ఎమ్మెల్యేలతో విభేదాలు రావడం... ఇలా అనేక అంశాలు సంజయ్‌ను బండి దిగేలా చేశాయి.
ఒక సామాన్య కార్యకర్తగా కరీంనగర్ నగరంలో కార్పొరేటర్‌గా ఆయన సాధించిన పేరే... చివరికి ఎంపీని చేసింది. దూకుడు తత్వమే రాష్ట్ర పార్టీ సారథ్యం అప్పగించేలా చేసింది. అతి కొద్ది కాలంలోనే పార్టీ హైకమాండ్ దృష్టిలో పడటం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన సాధించిన విజయాలు సంజయ్ కెరీర్‌లో గొప్ప విషయాలే. ఎన్ని విజయాలు సాధించినా..కొన్ని విషయాల్లో..కొందరితో ఆయన వ్యవహరించిన తీరు, ఒంటెత్తు పోకడలే పార్టీ పదవిని దూరం చేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే..వాట్ నెక్స్ట్ అనేదే ఇప్పుడు మళ్లీ ఇంట్రెస్టింగ్. బండికి కేంద్ర మంత్రి దక్కుతుందా.. ? దక్కకపోతే పరిస్థితి ఏంటీ..? బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంపై సానుభూతి లభిస్తుందా..? మళ్ళీ ఎంపీగా విజయం సాధిస్తారా? వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపు నల్లేరు మీద నడక మాదిరిగా సాగుతుందా అనే చర్చలు కరీంనగర్‌లో మొదలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment