సాక్షి, గుంటూరు: చంద్రబాబు డైవర్ట్ రాజకీయాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దేన్నైనా దృష్టి మళ్లించడంలో చంద్రబాబు ఎక్స్‌పర్ట్: వైఎస్ జగన్ దృష్టి మళ్లించడంలో చంద్రబాబు ఎక్స్‌పర్ట్. మదనపల్లె ఘటన జరిగిన రోజే.. వినుకొండకు నేను వెళ్లాను. టీడీపీ వ్యక్తి చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లాను. ప్రభుత్వాన్ని నిలదీశాను. దానిని డైవర్ట్ చేయడానికే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటనను హైలెట్ చేసుకున్నారు.’’ అంటూ మండిపడ్డారు.
‘‘పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి ఏదో చేశారంటూ రాశారు. ఆర్డీవో కార్యాలయంలో ఏదో జరిగితే.. ఎమ్మార్వో, కలెక్టరేట్ కార్యాలయాల్లో ఆ డాక్యుమెంట్లు ఉంటాయి కదా. ఆన్‌లైన్‌లోనూ ఆ డాక్యుమెంట్లు ఉంటాయి కదా. పెద్దిరెడ్డి ఏడుసార్లు ఎమ్మెల్యే, మిథున్‌రెడ్డి మూడుసార్లు ఎంపీ. ప్రజలు ఊరికే వాళ్లను గెలిపించలేదు కదా. వాళ్లను అభాసుపాలు చేయాలనే ఇదంతా. పైగా వాళ్లపైనే దాడి చేసి రివర్స్‌లో కేసులు పెడతారు.’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.
క్షీణించిన శాంతి భద్రతలు..
మదనపల్లెలో అగ్ని ప్రమాదం జరిగితే, డీజీపీని హెలికాప్టర్‌లో పంపిన చంద్రబాబు.. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో మైనర్ బాలిక అదృశ్యమైతే.. చివరకు ఆమె బాడీ ఇంకా దొరక్కపోయినా, ప్రభుత్వం స్పందించలేదు. కేసు దర్యాప్తులో ఉండగానే, ఎస్పీని బదిలీ చేశారు. ఒక అనుమానితుడి లాకప్ డెత్‌కి బలైయ్యాడు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలు క్షీణించాయి.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. 45 రోజుల్లో 12 మందిపై అత్యాచారాలు జరిగాయి. మా ప్రభుత్వ హయాంలో దిశ పోలీస్ స్టేషన్లు. దిశ యాప్. మహిళలకు ఒక వరంలా ఉండేది. ఆపదలో ఉన్న మహిళలు.. యాప్‌ను వినియోగించినా, ఫోన్‌ను 5సార్లు ఊపినా.. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకునే వారు. ఇప్పుడు అవేవీ పని చేయడం లేదు. ఎందుకంటే మాకు మంచి పేరు వస్తుంది కాబట్టి.
ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో దారుణం గురించి చెప్పుకుందాం. ఐదుసార్లు గెలిచిన మా సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమంగా కేసు బనాయించారు. అక్కడి ఎస్పీని మార్చారు. తమకు అనుకూలంగా ఉండే బిందుమాధవ్‌ను తెచ్చుకుంటే, ఆయన ఇష్టానుసారం వ్యవహరించాడు. దీంతో ఎన్నికల సంఘమే స్పందించి, ఆయనను బదిలీ చేసింది. శ్రీనివాసులు అనే అధికారి ఎస్పీగా వచ్చిన వెంటనే వినుకొండలో రషీద్ హత్య జరిగింది.
ఎర్ర బుక్కు లోకేష్..
సీఎం కొడుకు. మంత్రి అయిన నారా లోకేష్ ఏకంగా ఇలా రెడ్‌బుక్ ప్రదర్శిస్తూ.. బెదిరింపులకు దిగారు. రాష్ట్రమంతా హోర్డింగ్‌లు పెట్టారు. ఎంత దారుణం అసలు?. అలా ఏం సందేశం ఇవ్వదల్చారు?.
ఏపీ నిర్వచనం మారింది
ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం. ఆటవికం. రెడ్‌బుక్ పాలనగా మారిపోయింది. రాష్ట్రంలో ఎవరూ రోడ్లపైకి రావొద్దు. హామీలు అమలు చేయకపోయినా, చంద్రబాబును ప్రశ్నించకూడదు. అలా ఎవరైనా చేస్తే, ఏం జరుగుతుంది అన్నది చెప్పడం కోసం ఇవన్నీ చేస్తున్నారు.
కాసుల కోసం చంద్రబాబు..
పోలవరం ప్రాజెక్టు పనులు. వాస్తవాలు పరిశీలిస్తే.. ప్రాజెక్టు పనులు క్రమ పద్ధతిలో చేయలేదు. ప్రొటోకాల్ ప్రకారం పనులు చేయకపోవడం వల్ల.. డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయకుండా, కాఫర్ డ్యామ్ పనులు మొదలు పెట్టడం.. అవి పూర్తి కాకపోవడం.. మరోవైపు స్పిల్‌వే పనులు చేయకపోవడం వల్ల, వరద నీరు పోవడం కోసం కాఫర్ డ్యామ్‌ల మధ్య గ్యాప్‌లు వదిలారు. దీంతో భారీ వరద మధ్యలో నుంచి పోలేక.. డయాఫ్రమ్‌వాల్‌ను ధ్వంసం చేసింది. ఇలా తప్పులన్నీ చేసిన చంద్రబాబు, మా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు.
నిజానికి పోలవరం ప్రాజెక్టును కేంద్రం కడతామంది. అది విభజన చట్టంలో కూడా ఉంది. కానీ చంద్రబాబు, ఆ ప్రాజెక్టు బాధ్యత తీసుకున్నారు. అంతే కాకుండా, ప్రాజెక్టు పనులను 2013–14 రేట్లకే చేస్తామని అంగీకరించడం వల్ల అప్పటి అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లతోనే పూర్తి చేస్తామని అంగీకరించినట్లు అయింది.
మరోవైపు కాంట్రాక్ట్ పనులను కూడా రామోజీరావు కుమారుడి వియ్యంకుడికి చెందిన నవయుగ కంపెనీకి, మరో కాంట్రాక్ట్ యనమల రామకృష్ణుడి వియ్యంకుడికి ఇచ్చాడు. కానీ, గత ప్రభుత్వం ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ప్రాజెక్టు పనులు చేయడం వల్ల, నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. దీంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మా ప్రభుత్వం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పెరిగిన ప్రాజెక్టు వ్యయానికి అనుగుణంగా నిధులు రాబట్టడం కోసం మూడేళ్లపాటు గట్టి పోరాటం చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్రాజెక్టు వ్యయ అంచనా రూ.55,656 కోట్లకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం పొందింది.
మా ప్రభుత్వ హయాంలో పోలవరం..
ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్‌కు సంబంధించి కాంక్రీట్ పనులు పూర్తి చేశాం. హైడల్ ప్రాజెక్టులకు సంబంధించి, సొరంగం పనులు పూర్తి చేశాం. స్పిల్‌వే పనులు కూడా మా ప్రభుత్వంలోనే పూర్తి చేశాం. ఇవన్నీ చేశాం కాబట్టే.. నదిలో 26 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా, స్పిల్‌వే మీదుగా నీరు సాఫీగా ముందుకు పోయింది.
Comments
Please login to add a commentAdd a comment