హామీలపై నిలదీస్తారనే పూర్తిస్థాయి బడ్జెట్‌పై ‘భయం’ | YS Jagan Mohan Reddy Comments on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

హామీలపై నిలదీస్తారనే పూర్తిస్థాయి బడ్జెట్‌పై ‘భయం’

Published Tue, Jul 23 2024 4:23 AM | Last Updated on Tue, Jul 23 2024 4:23 AM

YS Jagan Mohan Reddy Comments on Chandrababu Naidu

ఈ ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనిపిస్తోంది: వైఎస్‌ జగన్‌

దేశంలో 7 నెలలు ఓట్‌ ఆన్‌ అక్కౌంట్‌ మీద నడుస్తున్న తొలి సర్కారు ఇదే 

చంద్రబాబు పాపాలు వేగంగా పండే రోజు దగ్గర్లోనే ఉంది

ఈ అరాచకాలు, హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, దోపిడీలపై రేపు ఢిల్లీ వేదికగా ఎండగడతాం

మాతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని పోరాటం కొనసాగిస్తాం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి సర్కారు పాలనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అడుగడుగునా భయంతో సీఎం చంద్రబాబు విలవిలలాడిపోతున్నారని చెప్పారు. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి, ప్రజల్లో భయోత్పాతం సృష్టించేందుకు హింసాకాండను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోందని చెప్పారు.

ప్రజల దృష్టి మళ్లించేందుకు అరాచకాలను ప్రోత్సహిస్తూ భయానక వాతావరణాన్ని కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాగించేలా కనపడటం లేదన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’లో వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే..

హామీలపై నిలదీస్తారనే భయంతో...
కేవలం 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్నిటా వైఫల్యం చెందింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఈ అరాచక పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోంది. ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతోందంటే.. ఈ ఏడాది కనీసం పూర్తి స్థాయి బడ్టెట్‌ కూడా ప్రవేశపెట్టలేకపోతోంది. దేశంలో తొలిసారిగా ఒక రాష్ట్రం ఏడాదిలో 7 నెలలు ఓట్‌ ఆన్‌ అక్కౌంట్‌ మీదే నడుస్తుందంటే ప్రభుత్వానికి ఎంత భయం ఉందో అర్థమవుతోంది. ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసి మభ్యపుచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.

అందుకే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారంటే..  పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడితే ఆ హామీలను అమలు చేయలేమన్న గుట్టు బయట పడుతుందన్న భయం నెలకొంది. ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత హామీలను అమలు చేయని పరిస్థితిలో ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయం ఆయన్ను ఆవరించింది. అందుకే ప్రజల దృష్టిని మళ్లించి అరాచకాలను ప్రోత్సహించడం ద్వారా భయానక పరిస్థితులు కల్పిస్తున్నారు. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం.. వీటన్నింటి ద్వారా ఎవరూ తనను ప్రశ్నించే సాహసం చేయకూడదనే పరిస్థితి సృష్టిస్తున్నారు. 

అసెంబ్లీలో హక్కుగా మైక్‌ ఇస్తే..
ప్రస్తుతం అసెంబ్లీలో రెండే పక్షాలున్నాయి. ఒకటి అధికార పక్షం. మరొకటి ప్రతిపక్షం. ప్రతిపక్షంగా ఒకే పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీనే విపక్షంగా గుర్తించాలి. ఆ పార్టీ నాయకుడినే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. అయితే ఆ పని చేస్తే అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయంతో చంద్రబాబు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నేతను చట్టబద్ధంగా గుర్తిస్తే ప్రజా సమస్యలు ప్రస్తావించేందుకు అసెంబ్లీలో ఒక హక్కుగా మైక్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అసెంబ్లీలో హక్కుగా మైక్‌ ఇస్తే ప్రజల తరపున సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విపక్షనేత ఎండగడతారని, వారి నిజ స్వరూపం ప్రజలకు తెలుస్తుందన్న భయంతో ఈ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం లేదు. 

ఢిల్లీ వేదికగా అరాచకాలను ఎండగడతాం..
ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు గడుస్తున్నా చంద్రబాబు ఇన్ని భయాలతో పరిపాలన చేస్తున్నాడు. అచ్చం శిశుపాలుడి పాపాల మాదిరిగా చంద్రబాబునాయుడి పాపాలు కూడా వేగంగా పండే రోజు దగ్గర్లోనే ఉంది. నాతోపాటు మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు ఢిల్లీ వేదికగా ఈ అరాచకాలను ఎండగడతాం. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, దోపిడీని 24వ తేదీన ఫోటో గ్యాలరీ, నిరసన కార్యక్రమాల ద్వారా వివిధ పార్టీ నాయకుల దృష్టికి, దేశం దృష్టికి తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరాన్ని, పరిస్థితులను వివరిస్తాం.  ఈ కార్యక్రమంలో మాతో కలసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని పోరాటం కొనసాగిస్తాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement