● ఎస్పీ ఏఆర్ దామోదర్ హెచ్చరిక
● సంతోషంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని సూచన
ఒంగోలు టౌన్: జనవరి సంబరాల పేరుతో రౌడీయిజం చేస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ ఏఆర్ దామోదర్ హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి ఎస్పీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు, దాబాలు ఇతర అవుట్‌లెట్లు నిర్దేశిత సమయాల్లో మూసివేయకుంటే చర్యలు తప్పవన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడినా, లౌడ్ స్పీకర్లు, డీజేలు పెట్టినా, ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తొలగించి ర్యాష్ డ్రైవింగ్ చేసినా చర్యలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. ట్రిపుల్ రైడింగ్, బైక్, కార్ రేసింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, ప్రజా రవాణాకు అడ్డంకులు సృష్టించినా సహించేది లేదన్నారు. డీఎస్పీల పర్యవేక్షణలో అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో మంగళవారం సాయంత్రం నుంచి నిఘా ఏర్పాటు చేశామన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment