నేడు చెవిరెడ్డి, బూచేపల్లి పర్యటన
యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆదివారం యర్రగొండపాలెంలో పర్యటిస్తారని ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ తెలిపారు. ఆరు రోజులుగా జరుగుతున్న వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తారన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, క్రికెట్ టీంల సభ్యులు పాల్గొనాలని ఆయన కోరారు.
తప్పుడు కేసులకు భయపడేది లేదు
● ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: కూటమి ప్రభుత్వం తమపై పెడుతున్న తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. శనివారం స్థానిక కొలుకుల రోడ్డులో ఉన్న పార్టీ కార్యాలయంలో పెద్దదోర్నాల పోలీసులు నోటీసు అందజేయడంపై ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపుతున్నామని, పండగలకు కూడా పేదలకు పైసా విదల్చని ఈ ప్రభుత్వ వైఖరిపై, నియోజకవర్గంలోని టీడీపీ నాయకులపై రోజు రోజుకూ పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను వారు తట్టుకోలేక పోతున్నారని అన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నదన్న అక్కసుతో కూటమి నాయకత్వం పోలీస్ శాఖను పావుగా వాడుకుంటోందని ఆయన విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులపై, గెలిచిన ఎమ్మెల్యేలపై లేనిపోని అక్రమ కేసులు బనాయిస్తూ వారు రాక్షస ఆనందాన్ని పొందుతున్నారని, అందుకు నిదర్శనం పోలీసులు నోటీసులు జారీచేయడమేనని అన్నారు. ఇటువంటి కేసులు ఎన్ని బనాయించినా తాము ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటామని, ప్రజలకు అండగా ప్రభుత్వం అవలంబిస్తున్న తప్పుడు విధానాలపై ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. తమపై బనాయించిన అక్రమ కేసులపై న్యాయపరంగా ఎదుర్కొంటామని, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు. పోలీసులు నోటీసు జారీ చేసే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉడుముల శ్రీనివాసరెడ్డి, పెద్దదోర్నాల మండల అధ్యక్షుడు గంటా వెంకటరమణారెడ్డి, నర్రెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు.
సీసీ రోడ్డు శిలాఫలకం ధ్వంసం
చీమకుర్తి రూరల్: మండలంలోని మంచికలపాడు గ్రామంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంతో నిర్మించిన సీసీ రోడ్డు, సైడ్ కాలువలకు సంబంధించిన ప్రారంభోత్సవ శిలాఫలకం దిమ్మెను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కూలదోశారు. ఈ ఘటనకు సంబంధించి మంచికలపాడు సర్పంచ్ పెరికల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ పొన్నపల్లి సుబ్బారావు శనివారం చీమకుర్తి పోలీస్ స్టేషన్లో సీఐ ఎం సుబ్బారావుకి ఫిర్యాదు చేశారు.
ఆగ్రో ఫారెస్ట్రీతో సుస్థిర పర్యావరణం
● డీఆర్డీఏ పీడీ రవికుమార్
ఒంగోలు వన్‌టౌన్: ఆగ్రో ఫారెస్ట్రీ సుస్థిర పర్యావరణాన్ని అందిస్తుందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ టీ రవికుమార్ పేర్కొన్నారు. అడవులకు వెలుపల చెట్లు అనే కార్యక్రమంలో భాగంగా మాస్టర్ ట్రైనర్లకు ఒంగోలు భాగ్యనగర్‌లోని టీటీడీసీలో శిక్షణ అందించారు. శిక్షణ ముగించిన వారికి శనివారం ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న పీడీ మాట్లాడుతూ రైతుల ఆదాయ వనరులను వైవిధ్యపరచడం, నేల ఆరోగ్యం మెరుగు పరచడం వంటివి ఆగ్రో ఫారెస్ట్రీతోనే సాధ్యమవుతుందన్నారు. రైతులు చెట్ల ఆధారిత పరిష్కారాలను అవలంబించడానికి ప్రోత్సహించాలన్నారు. ఆగ్రో ఫారెస్ట్రీ వ్యవసాయ రంగంలో పర్యావరణ సమతుల్యతను సాధించడానికి ఒక సాధ్యమైన మార్గంగా మారుస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు పీ శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన అధికారి ప్రత్యూష, ఏపీ టోఫీ కోఆర్డినేటర్ ఎన్ శైలేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment