‘ఉపాధి’లో తోటలు
చందుర్తి(వేములవాడ): పండ్ల తోటల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 1200 ఎకరాల్లో తోటల పెంపకమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో 17 రకాల పండ్ల తోటల పెంపకానికి అవకాశం కల్పించింది. జిల్లాలోని ప్రతీ మండలానికి 50 ఎకరాల లక్ష్యాన్ని విధించారు.
విస్తృత ప్రచారం
పండ్లతోటల లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉద్యానవనశాఖ అధికారులతోపాటు ఉపాధిహామీ పథకం ఫీల్డ్‌అసిస్టెంట్లు, ఏపీవోలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయశాఖ విస్తరణాధికారులకు బాధ్యతలు అప్పగించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే కరపత్రాలు ముద్రించి ప్రచారం చేపట్టారు. పండ్లతోటలు సాగుచేసే రైతులకు ఐదెకరాల్లోపు వ్యవసాయభూమి ఉండి చిన్న, సన్నకారు రైతులను ఎంపిక చేయాలన్న నిబంధనలు ఉండడంతో అధికారులకు సాగులక్ష్యం కష్టంగానే మారింది. అంతేకాకుండా లబ్ధిదారులకు ఉపాధిహామీ జాబ్‌కార్డు తప్పనిసరిగా ఉండాలన్న ఆంక్షలతో ఈ పథకం అమలుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. పండ్లతోటలు సాగుచేసే రైతులకు ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పించడంతో నిబంధనలు పక్కాగా అమలు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. మొక్కల కొనుగోలు నుంచి గుంతలు తీయించడం, ప్లాంటేషన్, ఎరువుల నిర్వహణ, కూలీల ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. తొలుత లబ్ధిదారులు ఖర్చు చేస్తే తర్వాత ప్రభుత్వమే రైతుఖాతాలో జమచేస్తుంది.
డ్రిప్ ఏర్పాటుపై ఆశలు
డ్రిప్ ఏర్పాటుకు ప్రభుత్వం సహకారమందిస్తే తోటల పెంపకానికి ముందుకొస్తామన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కేంద్ర ప్రభుత్వం తోటల ఖర్చు భరిస్తామనడం, నీటివసతికి కావాల్సిన నిధులను కూడా కేటాయిస్తే రైతులకు ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొంటున్నారు. ప్రభుత్వం అనుమతించిన 14 రకాల తోటలను రైతులు పెంచుకునే అవకాశం ఉంది.
జిల్లాలో 1200 ఎకరాలు లక్ష్యం
17 రకాల పండ్లతోటల పెంపకానికి అవకాశం
ఈనెల 31 వరకు దరఖాస్తు గడువు
డ్రిప్ పరికరాలు అందించాలి
పండ్లతోటల పెంపకానికి కేంద్ర ప్రభుత్వమే డ్రిప్ పరికరాలపై సబ్సిడీ ఇవ్వాలి. డ్రిప్ ఏర్పాటుకు భారీగా ఖర్చు అవుతుంది. సన్న, చిన్నకారు రైతుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సబ్సిడీపై పరికరాలను అందించాలి.
– బింగి జలంధర్, బండపల్లి
దరఖాస్తు చేసుకోవాలి
పండ్లతోటల పెంపకానికి ముందుకొచ్చే రైతులు ఈనెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఐదెకరాలలోపు వ్యవసాయ భూమి, ఉపాధిహామీ జాబ్‌కార్డు ఉండాలి. ఏయే పండ్లతోటలు సాగు చేస్తారో దరఖాస్తులో నమోదుచేయాలి.
– రాజయ్య, ఏపీవో, చందుర్తి
Comments
Please login to add a commentAdd a comment