శ్రీరామ నవమి వేడుకల్లో కేంద్ర మంత్రి | Sakshi
Sakshi News home page

శ్రీరామ నవమి వేడుకల్లో కేంద్ర మంత్రి

Published Thu, Apr 18 2024 10:55 AM

- - Sakshi

సతీసమేతంగా హాజరైన కిషన్‌రెడ్డి

స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ

కందుకూరు: మండల పరిధిలోని తిమ్మాపూర్‌ రామాలయంలో బుధవారం నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నియోజకవర్గం ఇన్‌చార్జి అందెల శ్రీరాములుయాదవ్‌, కన్వీనర్‌ ఎల్మటి దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ మంద జ్యోతిపాండు, నాయకులు అమరేందర్‌రెడ్డి, నిరంజన్‌, భిక్షపతి, పాండు, రమేష్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా విజయ్‌కుమార్‌

ఇబ్రహీంపట్నం రూరల్‌: భారతీయ జనతాపార్టీ యువమోర్చా జిల్లా కార్యదర్శిగా మైలారం విజయకుమార్‌ నియమితులయ్యారు. బీజేవైఎం రంగారెడ్డి రూరల్‌ జిల్లా అధ్యక్షుడు యాదీష్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల కేంద్రానికి చెందిన విజయ్‌కుమార్‌ బీజేపీలో చురుకై నపాత్ర పోషించారు. పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించిన అధిష్టానం కార్యదర్శిగా నియమించింది. ఈ సందర్భంగా ఆయన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.

కాలుష్యకారకాలపై చర్యలు

రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు మెంబర్‌ సత్యనారాయణరెడ్డి

చేవెళ్ల: ప్రజలకు ఇబ్బంది కలిగించే కాలుష్యకారకాలపై తెలంగాణ రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు మెంబర్‌ చింపుల సత్యనారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బోర్డు సెక్రటరీ బుద్ధ ప్రసాద్‌ ఐఏఎస్‌ అధ్యక్షతన నగరంలో బోర్డు సభ్యుల సమావేశం నిర్వహించారని.. చేవెళ్ల ప్రాంతంలోని పలు సమస్యలను బోర్డు దృష్టికి తీసుకెళ్లామన్నారు. తాండూరులోని ఏసియన్‌ బ్రౌన్‌ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యంతో గ్రామస్తులు, విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారని.. చందనవెల్లిలోని కుందన్‌ టైక్స్‌టైల్స్‌, శంషాబాద్‌ శ్రీకృష్ణ డ్రగ్స్‌తోనూ పర్యావరణం కాలుష్యమవుతోందని చెప్పానన్నారు. మోకిలలో నిర్మిస్తున్న విల్లాలు, అపార్ట్‌మెంట్‌ల నిర్మాణ వ్యర్థాలు గండిపేట చెరువులోకి వదులుతున్నారని ప్రస్తావించానన్నారు. మోకిలలోని నిర్మాణాలను సందర్శించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు బోర్డు నిర్ణయించిందని చెప్పారు. మొదటిసారి సమావేశానికి హాజరైన నూతన మెంబర్లను బోర్డు ఆధ్వర్యంలో సన్మానించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పీసీబీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

డూప్లికేట్‌ ఔట్‌

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ జిల్లాలో వివిధ కేటగిరీల కింద 5,41,201 ఓట్లను అధికారులు తొలగించారు. జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 54,259 మంది డూప్లికేట్‌ ఓటర్లతో పాటు మరణించిన ఓటర్లు, చిరునామా మారిన వారు వీరిలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ ప్రకటించారు. మహానగరంలో ఓటర్లకు మించి ఎక్కువ ఓట్లున్నట్లు ఎంతోకాలంగా విమర్శలున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల్లో ఓట్లున్నవారితోపాటు వేర్వేరు నియోజకవర్గాల్లోనూ ఓట్లుండటాన్ని రాజకీయపార్టీలు పలు సందర్భాల్లో ప్రస్తావించాయి. ఇలాంటి డూప్లికేట్‌ ఓటర్ల గురించి ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా డూప్లికేట్‌ ఓటర్లను గుర్తించే చర్యలు చేపట్టిన జిల్లా ఎన్నికల యంత్రాంగం గత సంవత్సరం ఆరంభం నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు గుర్తించిన డూప్లికేట్లను తొలగించింది.

సత్యనారాయణరెడ్డిని సన్మానిస్తున్న బోర్డు కమిటీ సెక్రటరీ, సభ్యులు
1/2

సత్యనారాయణరెడ్డిని సన్మానిస్తున్న బోర్డు కమిటీ సెక్రటరీ, సభ్యులు

తిమ్మాపూర్‌లో  కల్యాణానికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న కిషన్‌రెడ్డి దంపతులు
2/2

తిమ్మాపూర్‌లో కల్యాణానికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న కిషన్‌రెడ్డి దంపతులు

Advertisement
Advertisement