‘సహకారం’లో స్వాహాల గుర్తింపు! | - | Sakshi
Sakshi News home page

‘సహకారం’లో స్వాహాల గుర్తింపు!

Published Sun, Oct 27 2024 11:37 AM | Last Updated on Sun, Oct 27 2024 11:37 AM

‘సహకారం’లో స్వాహాల గుర్తింపు!

‘సహకారం’లో స్వాహాల గుర్తింపు!

సాక్షి, రంగారెడ్డిజిల్లా: సహకార బ్యాంకులో చోటు చేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇంటి నిర్మాణం, వాహనాల కొనుగోలు, వ్యాపార పెట్టుబడి, వ్యక్తిగత రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు, మార్టిగేజ్‌ రుణాల మంజూరీలో బ్యాంకు మేనేజర్లు, కార్యదర్శులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తేలింది. కందుకూరు డీసీసీబీలో ఎలాంటి గ్యారంటీలు లేకుండా బినామీల పేరుతో రూ.43 లక్షలకుపైగా రుణాలు మంజూరు చేసి, స్వాహా చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు ఇప్పటికే బ్యాంకు మేనేజర్‌పై డీసీసీబీ వేటు వేసింది. ఈ స్వాహా కార్యానికి పాల్పడిన మేనేజర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని నిర్ణయించి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ‘స్వాహాకారం’ శీర్షికన ఇటీవల ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఇదే అంశంపై కందుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) కార్యవర్గ సమావేశం శనివారం జరిగింది. చైర్మన్‌ సహా సభ్యులు పాల్గొన్నారు. రుణాల మంజూరు పేరుతో బ్యాంక్‌ మేనేజర్‌ సహా పీఏసీఎస్‌ కార్యదర్శి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. కార్యదర్శిని తక్షణమే ఇక్కడి నుంచి బదిలీ చేయాలని డీసీసీబీ సీఈఓకు విజ్ఞప్తి చేశారు. కార్యదర్శి 27 ఏళ్లుగా ఇక్కడే పాతుకుపోయారని, ఆయన్ను తక్షణం బదిలీ చేయాలని పట్టుబట్టారు. అప్పటికే ఆయన తనను మరో చోటికి బదిలీ చేయాలని కేంద్ర కార్యాలయానికి రిక్వెస్ట్‌ పెట్టడం, కార్యవర్గం ఆమెద ముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి.

గ్యారంటీ లేకుండా రుణాల మంజూరు

కందుకూరు డీసీసీబీలో రట్టయిన అక్రమాల గుట్టు

ఇప్పటికే మేనేజర్‌పై వేటు.. కేసు నమోదుకు సిఫార్సు

బదిలీపై వెళ్లాల్సిందిగా కార్యదర్శికి పాలకవర్గం హుకూం

‘సాక్షి’ కథనానికి స్పందన

దివాలా అంచున బ్యాంకులు

జిల్లాలో 37 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉండగా, వీటిలో 1,66,105 మంది సభ్యులు ఉన్నారు. వీటిలో ఏటా రూ.374 కోట్ల టర్నోవర్‌ నమోదవుతోంది. ఏడాదికి రూ.25 కోట్లకుపైగా టర్నోవర్‌ను కలిగిన ఉన్న (కందుకూరు, తుర్కయంజాల్‌, బాటసింగారం, మంచాల, యాచారం)పీఏసీఎస్‌లను ‘ఎ’ గ్రేడ్‌ జాబితాలో చూపించారు. అంతకంటే తక్కువ టర్నోవర్‌ కలిగి ఉన్న వాటిని (కొందుర్గు, ఉప్పరిగూడ, చేగూరు, మొయినాబాద్‌, ఆలూరు, గుండాల్‌, షాబాద్‌, మహేశ్వరం)‘బి’ గ్రేడ్‌ జాబితాలో చూపారు. రుణాల మంజూరు, రికవరీ విషయంలో 50 శాతం కంటే తక్కువ కలెక్షన్‌ ఉన్న మెకిల, భాగ్యనగర్‌, చిన్న గోల్కొండ, మల్కారం, పాలమాకుల, బండ్లగూడ, నార్సింగి, రాయదుర్గం, హైదర్షకోట్‌, చేవెళ్ల, ముడిమ్యాల, నందిగామ, కొత్తపేట, మేకగూడ, షాద్‌నగర్‌, హయత్‌నగర్‌, పటేల్‌గూడ, పొల్కంపల్లి, తలకొండపల్లి, మాడ్గుల పీఏసీఎస్‌లను ‘సి’ గ్రేడ్‌ జాబితాలో చూపారు. చైర్మన్లు, బ్యాంకు మేనేజర్లు, కార్యదర్శులు కలిసి అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. తక్కువ వడ్డీకి రైతులకు రుణాలు మంజూరు చేయాల్సిన అధికారులు.. కమీషన్లు ఎక్కువ ఇచ్చే గ్యారంటీ లేని అనర్హులకు ఎక్కువ మొత్తంలో రుణాలు ఇస్తున్నట్లు సమాచారం. తలాపాపం తిలా పిడికెడు అన్నట్లు లోన్ల ప్రాసెస్‌ కోసం రైతులు, ఇతర రుణగ్రస్తుల నుంచి వసూలు చేసే కమీషన్లను ఈ ముగ్గురు కలిసి పంచుకుంటున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. పరోక్షంగా వీరు బ్యాంకులు ఆర్థికంగా దివాలా తీయడానికి కారణమవుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయా బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహించి, లోన్ల మంజూరు, రికవరీలపై దృష్టిసారించాల్సిన డీసీసీబీ కేంద్ర బ్యాంకు అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం కూడా వారికి వరంగా మారుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement