26నుంచి రైతు భరోసా
● అర్హులందరికీ సాగు సాయం ● వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
చేవెళ్ల/షాబాద్: అర్హులైన వారందరికీ జనవరి 26వ తేదీ నుంచి ప్రభుత్వం రైతుభరోసా డబ్బులు అందజేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా సర్ధార్‌నగర్ మార్కెట్ యార్డు పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి నూతన పాలకవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధానికి అతి సమీపంలో ఉండటంతో పాటు రింగ్ రోడ్డు లోపల ఉన్న భూములు బంగారం కానున్నాయని చెప్పారు. అసలైన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే చేసే భూములకే పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. రైతు పండించిన పంటలకు, వారు పడిన కష్టానికి సరైన న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టంచేశారు. మొయినాబాద్ మండలంలో కొత్తగా నూతన మార్కెట్‌యార్డును ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు. అన్ని రకాల వ్యవసాయ పరికరాలను సబ్సిడీ అమలు చేస్తామని తెలిపారు.
అన్నివర్గాలకు న్యాయం..
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. అన్నదాతల అభ్యున్నతికి ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతోందని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని స్పష్టంచేశారు. అభివృద్ధిలో జిల్లా దూసుకుపోతోందని తెలిపారు. చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. రైతులు స్వయంగా శాస్త్రవేత్తలని తెలిపారు. విత్తనం వేసిన రోజు నుంచి పంట విక్రయించే వరకూ అన్ని రకాల పనులు చేసుకుంటూ సాగులో నిష్ణాతులుగా ఎదుగుతారని వివరించారు. గుడిమల్కాపూర్ మార్కెట్‌ను రింగురోడ్డుకు మార్చాలని కోరారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ జంగయ్యతో పాటు పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తిమ్మారెడ్డిగూడలో రూ.5 కోట్లతో, ఏట్ల ఎర్రవల్లిలో రూ.2 కోట్లతో నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. మక్తగూడ గ్రామానికి నూతన బస్సును ప్రారంభించారు. సర్ధార్‌నగర్‌లో గ్రామస్తులు ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూ దన్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, భీంభరత్, రాంరెడ్డి, చల్లా మాధవరెడ్డి, దర్శన్ మాణెయ్య తదితరులు ఉన్నారు.
రైతులకు ఇబ్బందులు రానీయం
సంక్రాంత్రి తర్వాత రైతు భరోసా అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రూ.75 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన గోదాం, దుకాణా సముదాయలను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంతోపాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, నియోజకవర్గం ఇన్‌చార్జ్ పామెన భీంభరత్, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు సత్యనారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు డి.వెంకట్‌రెడ్డి, గోనె ప్రతాప్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్, వైస్ చైర్మన్ రాములు, నాయకులు వసంతం, శ్రీనివాస్‌గౌడ్, వీరేందర్‌రెడ్డి, ఆగిరెడ్డి, పాండు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment