చలించని.. శ్రమైక సౌందర్యం
వణికిస్తున్న చలిలోనూ చిరువ్యాపారుల ఉపాధిబాట
● అనేక ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలు ● అత్యధిక చలి ప్రదేశాల్లో రాష్ట్రంలో రెండోస్థానం.. ● కోహీర్‌తోపాటు నల్లవల్లిలోనూ 6.7 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత ● ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
ఎముకలు కొరికే చలి...రికార్డు స్థాయిలో పడిపోతున్న ఉష్ణాగ్రతలు.. ఇంట్లోంచి కాలు బయటకు పెట్టాలంటే గజగజ వణికే పరిస్థితి..రాత్రయితే మరింత పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ చిరు వ్యాపారులు బతుకు వేట కొనసాగిస్తున్నారు. పొట్ట కూటి కోసం పేద, మధ్యతరగతి ప్రజలు చలిని సైతం లెక్కచేయకుండా తమ దైనందిన పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఆటోవాలాలు, కూరగాయల వ్యాపారులు, ఛాయ్ హోటళ్లు, సఫాయి కార్మికులు, బస్సు డ్రైవర్లు, పేపర్ బాయ్‌లు ఇలా వివిధ వర్గాల ప్రజలు చలిని సైతం లెక్కచేయకుండా తమ పనుల్లో నిమగ్నమయ్యారు. చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో చిరువ్యాపారులు, పేద వర్గాలు పడుతున్న ఇబ్బందులపై రాత్రి ‘సాక్షి’విజిట్ నిర్వహించింది.
కూరగాయల వ్యాపారుల ఇక్కట్లు..
నిత్యం సంగారెడ్డి రైతు బజార్‌కు వచ్చి హోల్‌సేల్ వ్యాపారుల వద్ద కూరగాయలు కొనుక్కుని చిరు వ్యాపారులు ఉదయం 5 గంటలు దాటితే అనుకున్న సరుకు దొరకదని అంత చలిలోనూ నాలుగు గంటలకే ఇక్కడి వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. కూరగాయల బండ్లు వచ్చే వరకు చలిమంటలతో ఉపశమనం పొందుతున్నారు.
బస్సు డ్రైవర్ల వెతలు..
బస్సు డ్రైవర్లు కూడా చలి తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. పాత బస్సులకు సైడ్ అద్దాలు సరిగ్గా లేకపోవడంతో బస్సు నడిపేటప్పుడు చల్లగాలులు డ్రైవర్లను వణికిస్తున్నాయి. డ్రైవర్లతోపాటు, కండక్టర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. మహిళా ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
పూల వ్యాపారుల పాట్లు
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పూల ఆటోలు ఉదయమే పూల మార్కెట్‌కు చేరుకుంటాయి. ఈ పూల వ్యాపారులు ఉదయమే వచ్చి వీటిని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. చలి తీవ్రత కారణంగా పూల వ్యాపారులు, పేపర్‌బాయ్‌లు, పారిశుద్ధ్య కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
కమ్మేస్తున్న పొగ మంచు..
సాధారణంగా తెల్లవారు జామున ఉండే పొగమంచు రాత్రి 11 గంటల ప్రాంతంలోనే పొగమంచు షురువవుతోంది. దీంతో వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలకు కనిపించక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఏడవుతున్నా లైట్లు వేసుకుని వాహనాలు నడపాల్సి వస్తోందని అంటున్నారు.
జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలివే..
కోహీర్ 6.7
నల్లవల్లి (గుమ్మడిదల) 6.7
అల్మాయిపేట (అందోల్) 6.8
అల్గోల్ (జహీరాబాద్) 6.8
సత్వార్ (జహీరాబాద్) 7.3
మొగుడంపల్లి 7.4
కంగ్టి 7.4
మల్‌చెల్మ 7.6
లక్ష్మిసాగర్ పుల్కల్) 7.6
చౌటకూర్ 7.7
అన్నాసాగర్ (ఆందోల్) 7.8
దాదాపు జిల్లా అంతటా ఆరెంజ్ అలర్ట్..
జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గుమ్మడిదల మండలం నల్లవల్లిలో ఏకంగా 6.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో అత్యధిక చలి ప్రదేశాల్లో ఇది రెండో స్థానంలో ఉంది. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నాలుగైదు మండలాలు మినహా జిల్లా అంతటా ఈ హెచ్చరికలు జారీ చేసింది. సాధారణంగా 4 డిగ్రీల నుంచి పది డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైతే ఈ అలర్టు జారీ చేస్తారు. కాగా, ఆదిలాబాద్ జిల్లా బేలలో 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, సంగారెడ్డి (నల్లవల్లి), నిర్మల్ (పెంబి)లు 6.7 డిగ్రీలతో రెండోస్థానంలో ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
నిర్మానుష్యంగా వ్యాపార కూడళ్లు..
సాధారణ రోజుల్లో జిల్లా కేంద్రంలోకొన్ని వ్యాపార కూడళ్లు, పాతబస్టాండ్, కొత్తబస్టాండ్ ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒంటి గంట దాటే వరకు జన సంచారం ఉంటుంది. అయితే చలి తీవ్రత కారణంగా రాత్రి 10.30 దాటితే చాలు ఈ ప్రధాన కూడళ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. స్వెట్టర్లు, ఉన్ని దుప్పట్లు లేనిదే బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
ఆటోవాలాల అవస్థలు..
జిల్లా కేంద్రంలోని పొత్తిరెడ్డిపల్లి చౌరస్తాలో దిగే ప్రయాణికులను ఇంటికి చేర్చేందుకు ఆటో డ్రైవర్లు చలికి వణుకుతూ ఆటోలు నడుపుతుంటారు. చలి అని ఇంట్లో ఉంటే ఆటో ఫైనాన్స్ కిస్తీలు ఎలా కడతామని లక్ష్మణ్ అనే ఆటోవాలా చెప్పుకొచ్చారు.
జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి విపరీతంగా పెరిగింది. దీంతో ప్రజలు గజగజ వణకుతున్నారు. రాత్రివేళల్లో ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా తమ రోజువారీ పనులు చేసుకుంటున్నారు. జానెడు పొట్ట కోసం పేద, మధ్య తరగతి కుటుంబాలు చలైనా, ఎండైనా, వానైనా అడ్డేమీకాదని చలిపులిని గేలి చేస్తూ తమ దైనందిన పనుల్లో నిమగ్నమయ్యారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు సాక్షి బృందం సంగారెడ్డి లో పర్యటించింది. అర్ధరాత్రి వేళ.. శ్రమైక జీవన సౌందర్యం కనిపించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా శ్రమ జీవులు ముందుకు సాగుతూనే ఉన్నారు. – పాత బాలప్రసాద్,
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment