సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
తపస్ రాష్ట్ర అధ్యక్షుడు దత్తాత్రి డిమాండ్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్షుడు దత్తాత్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సంగారెడ్డిలోని చాకలి ఐల్లమ్మ విగ్రహం వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా దత్తాత్రి మాట్లాడుతూ...ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న ధర్నా శిబిరానికి వచ్చి టీ తాగినంత సేపట్లో మీ సమస్యలను పరిష్కరిస్తానని ఇచ్చిన హామీ ఏడాది గడిచినా ఇంతవరకు నెరవేరలేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో, కేజీబీవీ విద్యాలయాల్లో విద్యావ్యవస్థ కుంటుపడుతుందని, తక్షణమే వీరి సమస్యలు పరిష్కరించి సమ్మె విరమణ చేయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం ప్రకటిస్తూ వారి కార్యక్రమాల నిర్వహణకు తపస్ జిల్లా శాఖ తరఫున ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో తపస్ జిల్లా కార్యదర్శి అడివప్ప, రాష్ట్ర సహాయ కోశాధికారి భాస్కర్‌దేశ్, రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి నరసింహారెడ్డి, జహీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు తుక్కప్ప, ఝరాసంఘం మండల అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
23న రైతు దినోత్సవం
విజయవంతం చేయాలి
సంగారెడ్డి టౌన్: ఈ నెల 23న నిర్వహించనున్న రైతు దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ మంజీర రైతు సమైక్య అధ్యక్షుడు తుమ్మల పృథ్వీరాజ్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి మండలంలోని ఇరిగిపల్లిలో మంగళవారం రైతు దినోత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రైతు ప్రాముఖ్యతను గుర్తించి ప్రత్యేక దినంగా ఏర్పాటు చేశారన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతులు శేఖర్, ధనుంజయ, మల్లికార్జున్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంఘంగా ఏర్పడటం
సంతోషం: ఎస్పీ చెన్నూరి
విశ్రాంత పోలీస్ అధికారుల
కార్యాలయం ప్రారంభం
సంగారెడ్డి జోన్: అంతర్జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ మంగళవారం సంగారెడ్డిలో రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...జిల్లా రిటైర్డ్ పోలీసు అధికారులు అందరు కలసి సంఘంగా ఏర్పడటం సంతోషంగా ఉందన్నారు. రిటైర్డ్ అయినా కూడా మీరందరూ పోలీసు కుటుంబమేనని, మీ సంక్షేమం కోసం జిల్లా పోలీసు శాఖ కట్టుబడి ఉందని గుర్తు చేశారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా తరుచూ యోగ వ్యాయామంతోపాటు కార్యాలయంలో ఇండోర్ గేమ్స్ వంటివి ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా, లేదా ఇతర కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స అవసరమైతే ఎల్లవేళలా సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావ్, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్యగౌడ్, రిటైర్డ్ పోలీసు ఎంప్లాయ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్లయ్య, రిటైర్డ్ డీఎస్పీ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment