అందరికీ అందుబాటులోకి వైద్యం
● జిల్లాలో ఐదు పీహెచ్‌సీలు ● రెండు ఉప కేంద్రాలు ఏర్పాటు ● జనాభాకు అనుగుణంగానే.. ● వైద్య సదుపాయాల్లో జిల్లాపై ప్రత్యేక దృష్టి
నారాయణఖేడ్: గ్రామీణ పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా అందుబాటులో ప్రాథమి క ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), ఉపకేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులోభాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 78 పీహెచ్‌సీలు, 200వరకు సబ్‌సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాగా, జిల్లాకు ఐదు పీహెచ్‌సీలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే మునిపల్లి మండలం కంకోల్, రాయికోడ్ మండలం సింగితంలో పీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా ఝరాసంఘం మండలం బర్దీపూర్, అందోల్ మండలం నేరే డిగుంట, చౌట్‌కూర్ మండలం సుల్తాన్‌పూర్‌లలో నూతన పీహెచ్‌సీలు ఏర్పాటు కానున్నాయి. రాయికోడ్ మండలం చిమ్నాపూర్, మొగుడంపల్లిలో నూతన సబ్‌సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
జనాభా ఆధారంగానే..
ఇదివరకు ఏర్పాటు చేసిన పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లలో కొన్ని గ్రామాలకు దూరంగా ఉండటంవల్ల ప్రజలు వైద్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ప్రభుత్వం జనాభా సంఖ్యకు అనుగుణంగా శాసీ్త్రయ పద్ధతిలో పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటైన మండలాలు, గ్రామాలకు తగ్గట్లుగా ఏర్పాటు చేస్తున్నారు. 2012నాటి ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (ఐపీహెచ్‌ఎస్) నివేదిక ప్రకారం గిరిజన ప్రాంతాల్లో 20వేల జనాభాకు ఒక పీహెచ్‌సీ ఉండాలనే నిబంధన ఉంది. ఈ లెక్కన గిరిజన ప్రాంత జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలతోపా టు, జనాభా అధికంగా ఉండి పీహెచ్‌సీ దూరంగా ఉన్న ప్రాంతానికి అనుగుణంగా పీహెచ్‌సీలను ఏర్పాటు చేయనున్నారు. పీహెచ్‌సీలన్నీ గ్రామీణ ప్రజలను దృష్టిలో ఏర్పాటు చేసినవే. దీంతోపాటు ప్రతీ 30– 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా వీటిని జాతీయ రహదారులకు అనుగుణంగా ఏర్పాటు చేయనున్నారు. 24గంటలపాటు వైద్య సేవలు అందుబాటులో ఉంచేలా వీటిని ఏర్పాటు చేస్తారు. హైవేలపై తరచూ ప్రమాదాలు జరుగుతుండటం, తక్షణం వైద్యం అందక చాలామంది మృత్యువాత పడుతుండటం, తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం జరుగుతోంది. తక్షణం ప్రాథమిక చికిత్స అందిన పక్షంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైవేలకు అనుగుణంగా ట్రామా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో నిజాంపేట్, జోగిపేటతోపాటు వట్‌పల్లి ప్రాంతంలోనూ ట్రామా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
కొత్త పీహెచ్‌సీలకు ప్రతిపాదించాం
జిల్లాలో బర్దిపూర్, నేరేడిగుంట, సుల్తాన్‌పూర్ పీహెచ్‌సీలకు ప్రతిపాదించాం. కంకోల్, సింగీతంలో ఏర్పాటవుతున్నాయి. చిమ్నాపూర్, మొగుడంపల్లి సబ్‌సెంటర్లకు ప్రతిపాదించాం. మెరుగైన వైద్యం పేదలకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
– గాయత్రీదేవి, జిల్లా వైద్యాధికారిణి,
సంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment