రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు!
సంగారెడ్డి: లగచర్ల రైతులకు బేడీలు వేసిన ఘటనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు నిరసనలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్ నాయకులు నిరసన ప్రదర్శనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు బేడీలపై సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ...లగచర్ల గిరిజన రైతులు తమ భూములను ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం లాక్కోవాలని చూస్తే వద్దు అని అధికారులను అడ్డుకున్నందుకు రైతులను జైలు పాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దక్కుతుందన్నారు. లగచర్ల రైతులను విడుదల చేయాలని నెల రోజుల నుంచి వివిధ రకాలుగా నిరసనలు తెలిపిన ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రైతులను ఏడిపిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదన్నారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ విజేందర్‌రెడ్డి, డా.శ్రీహరి, పట్టణ అధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వర్లు, జీవీ శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్‌లో...
నారాయణఖేడ్: లగచర్ల గిరిజనులపై అక్రమంగా కేసులు పెట్టి, అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం నారాయణఖేడ్‌లో మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేశారు. చేతులకు బేడీలు వేసుకుని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ...ప్రజా పాలన అంటూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తుందన్నారు. లగచర్ల గిరిజనుల భూములు లాక్కోవడమే కాకుండా తమకు న్యాయం చేయాలని కోరితే అక్రమంగా కేసులు నమోదు చేసి, బేడీలు వేశారని మండిపడ్డారు. లగచర్ల గిరిజనులపై అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తి వేయాలన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మిబాయిరవీందర్, మాజీ ఎంపీటీసీ ముజమ్మిల్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పరశురాం, పట్టణ అధ్యక్షుడు నగేష్ తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ విగ్రహం వద్ద
బీఆర్‌ఎస్ నాయకుల నిరసన
Comments
Please login to add a commentAdd a comment