రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
కృష్ణాపూర్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ!
కల్హేర్(నారాయణఖేడ్): ఈ నెల 31 నుంచి వరంగల్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు మండలంలోని కృష్ణాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సోనా, వర్ష, సంయూక్త, శ్రీలత, హరిత ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ శుక్రవారం మీడియాకు తెలిపారు. సంగారెడ్డిలో జరిగిన సీఏం కప్ జిల్లాస్థాయి పోటీలో పాల్గొని ఖోఖో క్రీడలో రెండవ స్థానంలో నిలిచినట్లు చెప్పారు.
ప్రజా ఉద్యమాలకు
అండగా నిలవాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
చుక్కా రాములు
పటాన్‌చెరు టౌన్: ప్రజా సమస్యలకు కార్మిక వర్గం అండగా నిలవాలని, కార్మిక వర్గ సమస్యలపై సీపీఎం ముందుభాగాన నిలిచి పోరాడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని సాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ చుక్కారాములుకు యూనియన్ ఆధ్వర్యంలో రూ.5 లక్షల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ...జనవరి 25 నుంచి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో సీపీఎం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహాసభల జయప్రదం కోసం కార్మిక , కర్షక వర్గం విరాళాలిచ్చి తోడ్పాటునివ్వడం అభినందనీయమని తెలిపారు. రాబోయే కాలంలో మరిన్ని సమరశీల పోరాటాలు సాగించే దిశగా మహాసభల్లో నిర్ణయాలు తీసుకుటామన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అడవయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కె. రాజయ్య, యూనియన్ నాయకులు పాండు రంగారెడ్డి, మనోహర్, వీరారావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్ని
బాధ్యతగా నిర్వర్తించాలి
జెడ్పి సీఈవో జానకిరెడ్డి
కల్హేర్(నారాయణఖేడ్): అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలును మరింత బాధ్యతగా నిర్వర్తించాలని జెడ్పీ సీఈవో జానకిరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కల్హేర్ మండల పరిషత్తు కార్యాలయం తనిఖీ చేసి రికార్డులు, సిబ్బంది హాజరు శాతం పరిశీలించారు. ప్రజాపాలన దరఖాస్తులు, తదితర అంశాలపై తెలుసుకున్నారు. పంచాయతీ సెక్రటరీలు, ఉపాధిహామీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే పకడ్బందీగా చేయాలని సూచించారు.
ఒప్పంద ఏఎన్‌ఎంలను
క్రమబద్ధీకరించాలి
జిల్లా వైద్యాధికారి కార్యాలయం ఎదుట
ఆందోళన
సంగారెడ్డి: జిల్లాలో ఒప్పంద ఏఎన్‌ఎంలను ఎలాంటి రాతపరీక్ష లేకుండా వెంటనే క్రమబద్ధీకరించాలని మెడికల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.యాదగిరి డిమాండ్ చేశారు. గత రెండు రోజుల నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్యాధికారి కార్యాలయం వద్ద 48 గంటల ఆందోళన నిర్వహించి అనంతరం ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో శశాంక్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో మెడికల్ యూనియన్ నాయకురాలు సంపూర్ణ, దీపిక, శ్యామల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment