తెరపైకి జహీరాబాద్–బీదర్ రోడ్
జహీరాబాద్‌టౌన్: జహీరాబాద్–బీదర్ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి అప్‌గ్రేడ్ చేయాలన్న విషయం మరోసారి తెరపైకి వచ్చింది. పర్యాటక ప్రాంతాలు, సమీప రాష్ట్రాలను కలిపే ముఖ్యమైన రహదారులను గుర్తించి వాటిని జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. గతేడాది ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని ఆరు రోడ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరగా అందులో జహీరాబాద్–బీదర్ రహదారి కూడా ఉంది. ఇటీవల జహీరాబాద్ ఎంపీ.సురేశ్ షెట్కార్ కూడా కేంద్రమంత్రిని కలసి జహీరాబాద్–బీదర్ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి మరమ్మతులు చేపట్టాలని కోరారు. దెబ్బతిని ప్రమాదకరంగా తయారైన జహీరాబాద్–బీదర్ రోడ్డు అప్‌గ్రేడ్ దారిలో పడటంతో రహదారి విస్తీర్ణం అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
అధ్వానంగా తయారైన రహదారి
కర్ణాటకలోని బీదర్, బాల్కి, ఉద్గీర్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల ప్రజలు హైదరాబాద్‌కు జహీరాబాద్–బీదర్ రోడ్డు ద్వారా రాకపోకలను సాగిస్తుంటారు. సుమారు 32 కిలోమీటర్లు ఉన్న జహీరాబాద్–బీదర్ రహదారి అధ్వానంగా తయారైంది. గుంతలు పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నారింజ ప్రాజెక్టు సమీపంలో రోడ్డు ఇరుకుగా ఉండటంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల వల్ల ఈ ఏడాది పది మంది వరకు చనిపోయారు.
నేషనల్ హైవే అథార్టీకి బదలాయింపు
జహీరాబాద్–బీదర్ రోడ్డు ఇరుకుగా ఉండి వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. రోడ్డు మధ్యలో వంతెనలు, రైల్వే గేటు కూడా ఉండటం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతున్న రోడ్డులో రద్దీని దృష్టిలో జాతీయ రహదారిగా గుర్తించి ఫోర్‌లేన్‌గా విస్తరించేందుకు పదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా కేంద్రం అంగీకరించింది. ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోని ఈ రోడ్డును జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (నేషనల్ హైవే అథార్టీ)కు బదలాయించారు. ఏళ్లు గడుస్తున్నా రోడ్డుకు జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేయకపోవడంతో విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతోంది.
అప్‌గ్రేడ్ కోసం
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కృషి
ఇటీవల కేంద్రమంత్రిని కలిసిన
ఎంపీ సురేశ్ షెట్కార్
జాతీయ రహదారిగా గుర్తించి
విస్తరించాలని వినతి
ఇటీవలే కేంద్రమంత్రికి వినతి
వికారాబాద్, తాండూర్, జహీరాబాద్, బీదర్ మధ్య అనుసంధానం చేయాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 154 కి.మీ రోడ్డుకు కేంద్రం అప్‌గ్రేడ్ చేసి అభివృద్ధి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి వినతి పత్రం ఇచ్చారు. ఇటీవల మంత్రి జహీరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఎంపీ.సురేశ్ షెట్కార్, బీదర్ ఎంపీలు గడ్కరీని కలసి జహీరాబాద్–బీదర్ రోడ్డును విస్తరించి అభివృద్ధి చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment