సోమశంకర్‌కు శౌర్య పతకం
పటాన్‌చెరు టౌన్: పటాన్‌చెరు అగ్నిమాపక కార్యాలయంలో డ్రైవర్ గా పనిచేస్తున్న సోమశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక సేవల శౌర్య పతకానికి ఎంపికయ్యారు. రామచంద్రపురంకు చెందిన సోమశంకర్ 2008లో అగ్నిమాపక డ్రైవర్‌గా విధుల్లో చేరారు. గతేడాది నర్సాపూర్ పరిధిలోని చందాపూర్‌లోని ఎస్.బీ ఆర్గానిక్ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో విధి నిర్వహణలో చేసిన సేవలకుగాను ఈ శౌర్య పతకానికి రాష్ట్ర ప్రభుత్వం ఈయనను ఎంపిక చేసింది. 2017లో ప్రశంసా పత్రం, అదేవిధంగా నగదు ప్రోత్సాహకాన్ని కూడా సోమశంకర్ అందుకున్నారు.
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి: పీఆర్టీయూ
మెదక్ కలెక్టరేట్: పీఆర్టీయూటీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను బుధవారం కలెక్టరేట్‌లో సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పీఆర్టీయూటీఎస్ సంఘం ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు మధ్య వారధిగా పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు త్వరగా విడుదల చేయాలని, సమగ్ర ఉద్యోగుల సమ్మె విరమింప చేయడానికి చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సుంకరి కృష్ణ, గౌరవ అధ్యక్షుడు దుర్గయ్య, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శశిధర్‌శర్మ, నాయకులు శ్రీనివాస్, మల్లారెడ్డి, వెంకట్రామిరెడ్డి, నాగరాజు, వీరేందర్, అమీరొద్దీన్, హరిబాబు, చంద్రశేఖర్, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారీగా నకిలీ మందుల పట్టివేత
కేసు నమోదు చేసిన నార్కోటిక్ అధికారులు
జిన్నారం (పటాన్‌చెరు): బొల్లారం పారిశ్రామిక వాడలోని ఆక్రన్ పరిశ్రమలో నకిలీ మందులను నార్కోటిక్ అధికారులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విశ్వసనీయ సమాచారం మేరకు నార్కోటిక్ అధికారులు పరిశ్రమలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రముఖ పరిశ్రమలకు చెందిన దాదాపు రూ.2కోట్ల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు.
డివైడర్‌కు ఢీకొని
యువకుడి మృతి
మరొకరికి తీవ్రగాయాలు
జోగిపేట(అందోల్): జోగిపేట హౌసింగ్‌బోర్డు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొనడంతో ఒకరు చనిపోగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం జరిగింది. అందోలు మండలం అల్మాయిపేటకు చెందిన వాజీద్, పాషలు ద్విచక్రవాహనంపై జోగిపేట నుంచి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యలోని డివైడర్‌కు ఢీకొనడంతో బైక్ నడుపుతున్న పాష (25) అక్కడికక్కడే చనిపోగా.. వాజిద్‌కు తీవ్రగాయాలు కావడంతో 108 వాహనంలో జోగిపేట ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు. పాష మృతదేహాన్ని ఆసుపత్రిలోని పోస్టుమార్టంకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
నేడు సీఎంఆర్‌ఎఫ్
చెక్కుల పంపిణీ
నారాయణఖేడ్: సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను గురువారం పంపిణీ చేయనున్నట్లు క్యాంపు కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 10గంటలకు క్యాంపు కార్యాలయంలో నారాయణఖేడ్, మనూరు, నాగల్‌గిద్ద, నిజాంపేట్ మండలాలకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే సంజీవరెడ్డి పంపిణీ చేస్తారని తెలిపారు.
బీఆర్‌ఎస్ నాయకుడిపై ఫిర్యాదు
జహీరాబాద్ టౌన్: సీఎం రేవంత్‌రెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న బీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతీ నెల వెయ్యికోట్లు జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పంపుతున్నారని, నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తూ వాట్సాప్, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. ఆయనపై కేసు నమోదు చేయాలని టౌన్ ఎస్‌ఐ కాశీనాథ్‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహ్మరెడ్డి, నాయకులు రాములు, జగదీశ్వర్‌రెడ్డి, అక్బర్, జమిలాలోద్దీన్ జగన్మోహన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment