ఉపాధిలో అక్రమాలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

ఉపాధిలో అక్రమాలకు చెక్‌

Published Fri, Jan 3 2025 8:50 AM | Last Updated on Fri, Jan 3 2025 8:50 AM

ఉపాధిలో అక్రమాలకు చెక్‌

ఉపాధిలో అక్రమాలకు చెక్‌

అందుబాటులోకి జన్‌మన్‌రేగా యాప్‌

మెదక్‌ కలెక్టరేట్‌: ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత పెంచి అక్రమాలకు తావివ్వకుండా ప్రభుత్వాలు అనేక సంస్కరణలు తెస్తున్నాయి. పనుల నిర్వహణ, అమలు, డబ్బు చెల్లింపు విషయంలో కాలక్రమేణా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కూలీల వేతనాలు దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుడికి బ్యాంకు, పోస్టాఫీస్‌ ఖాతాలు తెరిచి నేరుగా చెల్లింపులు చేస్తున్నారు. అయితే ఒకరికే రెండు, మూడు ఖాతాలు ఉండటంతో ఎందులో జమ చేశారో తెలుసుకోవడం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా శ్రీజన్‌మన్‌రేగాశ్రీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ ద్వారా కూలీలు ఎన్ని రోజులు పనిచేశారు. ఎంత కూలీ వచ్చింది..? ఎక్కడ పనులు జరిగాయి. ఎన్ని డబ్బులు చెల్లించారు. ఇంకెంత చెల్లించాలి.. వంటి సమాచారం తెలుసు కోవచ్చు.

అరచేతిలో సమాచారం

ప్లే స్టోర్‌ నుంచి జన్‌మన్‌రేగా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఇందులో కూలీల వేతనాలు, పని దినాలకు సంబంధించిన ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాలి. రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ, కుటుంబం ఐడీ వివరాలు నమోదు చేయాలి. పేమెంట్‌ ఆప్షన్‌లోకి వెళ్లి వ్యక్తి పేరు మీద క్లిక్‌ చేస్తే ఎక్కడ పని చేశారు. పని దినాల సంఖ్య, ఎంత వేతనం, ఎప్పుడు జమ చేశారు, ఏ బ్యాంకులో వేశారు వివరాలు ఉంటాయి. ఉపాధి హామీ డబ్బులు జమ కాకుంటే సదరు లబ్ధిదారుడి ఖాతాకు సంబంధించి ఆధార్‌ లింకు అయిందా, ఆధార్‌లో పోలిన విధంగా బ్యాంకు వివరాలు ఉన్నాయా..? ఆధార్‌ బ్రిడ్జ్‌ పేమెంట్‌ సిస్టం లింక్‌ అయిందో లేదో వివరాలు సరి చూసుకోవచ్చు. ఒకవేళ అన్నీ లింకై తే పచ్చరంగులో రైట్‌ గుర్తు ఉంటుంది. లేదంటే ఎక్కడ సమస్య ఉందో అక్కడ ఎరుపు రంగు గుర్తు చూపుతుంది. జాబ్‌కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. అందుకు అటెండెన్స్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాలి. ఏ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని రోజులు పని చేశారు. ఎవరెవరు ఎన్ని రోజులు పనిచేశారో వివరాలు కనిపిస్తాయి.

జిల్లాలో 1.64 లక్షల జాబ్‌కార్డులు

జిల్లాలో మొత్తం 21 మండలాలు, 493 గ్రామ పంచాయతీలు ఉండగా.. మొత్తం 1.64 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. ఈ ఏడాది జిల్లాలో 45 లక్షల పనిదినాల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించగా, ఇప్పటివరకు 40,37,714 పనిదినాలు కల్పించారు. దీంతో 2,227 కుటుంబాలకు లబ్ధి చేకూరింది.

అవగాహన కల్పిస్తున్నాం

పాధి కూలీల వేతనాల చెల్లింపుల్లో అక్రమాలకు తావు లేకుండా కేంద్రం జన్‌మన్‌రేగా యాప్‌ తీసుకొచ్చింది. ప్రతి శుక్రవారం రోజ్‌గార్‌ దీవాస్‌ కార్యక్రమం ఉంటుంది. ఫీల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్ల ద్వారా కూలీలకు యాప్‌పై అవగాహన కల్పిస్తున్నాం. కూలీలు తమ వివరాలు అందులో తెలుసుకోవచ్చు.

– శ్రీనివాస్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement