పకడ్బందీగా ప్రాక్టికల్స్‌ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ప్రాక్టికల్స్‌

Published Mon, Jan 6 2025 7:54 AM | Last Updated on Mon, Jan 6 2025 7:54 AM

పకడ్బందీగా ప్రాక్టికల్స్‌

పకడ్బందీగా ప్రాక్టికల్స్‌

నారాయణఖేడ్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది ప్రయోగ పరీక్షల రసాయనాల కొనుగోలు కోసం కళాశాలకు రూ.25వేల చొప్పున అందించగా దీనితోపాటు కళాశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం రూ.12వేల చొప్పున నిధులు మంజూరు చేసింది. దీంతో ప్రయోగ పరీక్షలు ఈ ఏడాది నిఘా నీడలో జరగనున్నాయి. గతంలో ఒకటి, రెండు కెమెరాలతో అరకొరగా పరీక్షలు నిర్వహించాల్సి వచ్చేది. దీనివల్ల పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోయేది. ఈసారి పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ప్రతీ కళాశాలకు అదనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా నిధులు మంజూరు చేసింది. ఈ నిధులు జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌ ఖాతాల్లో ఇప్పటికే జమయ్యాయి. ఫిబ్రవరి 2 నుంచి 21వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహించనుండటంతో ఆలోగా సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు.

ఏడేళ్ల తర్వాత నిధులు..

ఇంటర్‌ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఎంతో కీలకం. ఇంటర్‌ బైపీసీ, ఎంపీసీ చదివే విద్యార్థులు వారి గ్రూపుల వారీగా బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్‌ ఉంటాయి. విద్యాబోధనతోపాటు విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల వారీగా ప్రాక్టికల్స్‌ నేర్పిస్తారు. వారు నేర్చుకున్నదంతా ప్రయోగ పరీక్షల ద్వారా వారి ప్రతిభను చాటాల్సి ఉంటుంది. ఇందులో సాధించిన మార్కులు వారికి ఎంతో కీలకం కావడంతో ఈ పరీక్షలను ఇంటర్‌ బోర్డు పర్యవేక్షించనుంది. గతంలో కొన్ని కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా అవి అరకొరగానే ఉన్నాయి. కొన్ని మరమ్మతులు వచ్చి మూలన పడేశారు. కాగా అన్ని కళాశాలల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.12వేల చొప్పున ప్రయోగ పరీక్షల పరికరాలు, రసాయనాల కొనుగోలుకు రూ.25వేల చొప్పున విడుదల చేశారు. సుమారు ఏడేళ్ల తర్వాత ఈ నిధులు విడుదలయ్యాయి. ఏడేళ్లపాటు ప్రయోగ పరీక్షల నిర్వహణను ఇబ్బందుల మధ్య కళాశాలల అధ్యాపకులు నిర్వహించారు. కొందరు అధ్యాపకులు సొంత డబ్బులు వెచ్చించి రసాయనాలు, పరికరాలు కొనుగోలు చేసి పరీక్షలు నిర్వహించారు. కాగా ఈ ఏడాది ఆ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి. ఈ నిధులతో ల్యాబ్‌ను మెరుగుపరచడంతోపాటు అవసరమైన రసాయనాలను తెప్పిస్తున్నారు. ఫర్నీచర్‌ను సమకూర్చుతున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ల్యాబ్‌లను తీర్చిదిద్దుతున్నారు.

ల్యాబ్‌లలో సీసీ కెమెరాల ఏర్పాటు

రసాయనాలు,

పరికరాల కొనుగోలుకు నిధులు

ఇప్పటికే ప్రిన్సిపల్స్‌ ఖాతాల్లో

జమచేసిన ప్రభుత్వం

ప్రాక్టికల్స్‌ నిర్వహణకు తప్పిన తిప్పలు

ప్రయోగ పరీక్షలు జరిగే ప్రభుత్వ కళాశాలలు, విద్యార్థుల వివరాలు

కళాశాల ఎంపీసీ 2వ సం. బైపీసీ 2వ సం.

బాలికల కళాశాల సంగారెడ్డి 39 117

బాలుర కళాశాల సంగారెడ్డి 12 16

జూ.కళా పుల్కల్‌ 0 18

జూ.కళా పటాన్‌చెరు 66 27

జూ.కళా ఆర్‌.సి పురం 89 91

జూ.కళా జోగిపేట 12 39

బాలికల జూ.కళా. జోగిపేట 0 26

జూ.కళా సదాశివపేట 27 57

జూ.కళా కొండాపూర్‌ 0 0

జూ.కళా జహీరాబాద్‌ 24 113

జూ.కళా జిన్నారం 4 28

జూ.కళా నారాయణఖేడ్‌ 79 144

జూ.కళా కల్హేర్‌ 21 19

జూ.కళా కోహీర్‌ 3 89

జూ.కళా హత్నూర 32 33

జూ.కళా హద్నూర్‌ 25 26

జూ.కళా న్యాల్‌కల్‌ 0 50

జూ.కళా బుదేరా 16 27

జూ.కళా కంగ్టి 6 30

జూ.కళా మనూరు 16 7

మొత్తం 471 957

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement