ఘనంగా సిద్ధి వినాయక జయంతి ఉత్సవాలు
● వినాయక నామస్మరణతో
మార్మోగిన యజ్ఞశాల
● హాజరైన కర్ణాటక మంత్రి, ఎంపీ
న్యాల్‌కల్(జహీరాబాద్): మండల పరిధిలోని రేజింతల్ గ్రామ శివారులోని శ్రీ సిద్ధివినాయక ఆలయంలో స్వామి వారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజైన శుక్రవారం ఉదయం స్వామి వారికి మహాన్యాసకపూర్వక రుద్రాభిషేకం, మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం ఆవరణలో నిర్వహించిన యజ్ఞాలు వైభవంగా జరిగాయి. వినాయక నామస్మరణతో యజ్ఞశాల మారు మ్రోగింది.
స్వామి వారిని దర్శించుకున్న
కర్ణాటక మంత్రి, ఎంపీ
స్వామి వారి జయంతి ఉత్సవాలకు కర్ణాటక వ్యవసాయ శాఖమంత్రి భీమన్న ఖండ్రే, బీదర్ ఎంపీ సాగర్ ఖండ్రే, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి చంద్రశేఖర్, నాయకులు, ప్రజా ప్రతినిధులు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధిలింగయ్యస్వామి, జనార్ధన్‌రెడ్డి, చంద్రప్ప, హన్మంత్‌రావు పాటిల్ తదితరులు హాజరయ్యారు.
ఆలయానికి చేరుకున్న దిండి పాదయాత్ర
నారాయణఖేడ్ నుంచి ప్రారంభమైన దిండి పాదయాత్ర చాల్కి, ఇబ్రహీంపూర్, న్యాల్‌కల్, హద్నూర్‌ల మీదుగా రేజింతల్ గ్రామ శివారు లోని శ్రీ సిద్ధివినాయక ఆలయానికి శుక్రవారం చేరుకుంది. స్వామి వారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కమలాపూర్‌కు చెందిన వామన్‌రావు ఆధ్వర్యంలో గురువారం నారాయణఖేడ్‌లోని కాశీనాథ్ మందిరం నుంచి దిండి పాదయాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment