సం‘వృద్ధి’ దిశగా డ్వాక్రా
సంగారెడ్డిటౌన్: రాష్ట్రంలో మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా మహిళా సంఘాలలో మరింతమంది కొత్త సభ్యులను చేర్చుకునేందుకు జిల్లా అధికారులు ప్రణాళికలు రచించింది. మహిళా సంఘాలలో సభ్యత్వం తీసుకుంటే ఒనగూడే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో మహిళా సంఘాల్లో చేరేందుకు వారు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక డ్వాక్రా సంఘాల సభ్యులు కూడా కొత్త సభ్యత్వాలను చేర్చుకునేందుకు ఉత్సాహంగా పనిచేస్తున్నారు.
చేరిన వారికి ప్రత్యేక సన్మానాలు
మహిళా సంఘాల్లో చేరిన కొత్త సభ్యులను జిల్లా అధికారులు ఘనంగా సన్మానాలు చేస్తున్నారు. సంఘంలో చేరిన కొత్త మహిళలకు బొట్టు పెట్టి, శాలువాతో సన్మానించి పూల మొక్కలతో సంఘంలోకి ఆహ్వానిస్తున్నారు. సభ్యురాలి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. గ్రామంలోని మహిళలకు ఆర్థికంగా స్థిరపడే విధంగా పొదుపు సంఘాలలో రుణాలు అందిస్తున్నారు. పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు స్వయం సమృద్ధి సాధించడంతోపాటు మరో పదిమందికి ఉపాధి చూపించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. వివరాలను సేకరించి సంఘంలో చేర్పించే విధంగా అవగాహన కార్యక్రమాలను కల్పిస్తున్నారు.
బ్యాంకు లింకేజ్, శ్రీనిధి రుణాలు అందజేత
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం, సాధి కారతే లక్ష్యంగా పేదరిక నిర్మూలన సంస్థ అనేక చర్యలు చేపట్టింది. సంస్థ ద్వారా మహిళా సంఘా లకు బ్యాంకు లింకేజ్, శ్రీనిధి రుణాలు అందిస్తూ మహిళా సంఘాల సభ్యుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. బ్యాంకర్లూ రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నారు.
జిల్లాలో మొత్తం 18,465 మహిళా సంఘాలు
జిల్లాలో మొత్తం 1,91,596 మహిళా సభ్యులున్నారు. స్వయం సహాయక సంఘాలు 18,465 ఉండగా.. అందులో గ్రామ సమాఖ్యలు 695, మండల సమాఖ్యలు సంఘాలు 25 ఉన్నాయి. ఈ ఏడాదిలో 4,408 సభ్యులను చేర్పించాలని లక్ష్యంతో ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే 3,368 మహిళలకు సభ్యత్వాలను ఇచ్చారు. మార్చి నెలాఖరునాటికి పూర్తిస్థాయిలో సభ్యత్వాలు చేస్తామంటున్నారు.
ఇవీ ప్రయోజనాలు...
● మహిళా సంఘం సభ్యులు రుణం తీసుకున్న తర్వాత మరణిస్తే రూ.2 లక్షలు
● ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా
● వ్యక్తిగతంగా రూ.3 లక్షల వరకు రుణసదుపాయం
● గ్రామీణ మహిళలకు ఉపాధికోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు
● తెల్లరేషన్ కార్డు ఉండి, గ్రామీణ ప్రాంతం చెందిన 18 ఏళ్ల వయసు, దాటిన వారు అర్హులు.
● ఈ ఏడాదిలో రుణ బీమా 119, ప్రమాద బీమా 6 మందికి ఇవ్వనున్నారు
● సభ్యత్వం తీసుకున్నప్పుడు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు.
అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం
గ్రామీణ మహిళలను ఆర్థికంగా ఎదిగేందుకు మహిళా సంఘాల ద్వారా వివిధ రకాల ఉపాధి కల్పిస్తూ బ్యాంకుల ద్వారా రుణాలను అందిస్తున్నాం. సంఘంలో సభ్యులుగా చేరేందుకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం.
– జంగారెడ్డి, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
డ్వాక్రా సంఘాల్లో కొత్త సభ్యత్వాలు
ప్రయోజనాలు కల్పిస్తున్న
మహిళా సంఘాలు
4,408 సభ్యులను చేర్పించాలని లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment