ఆయుధాలు తప్పనిసరి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: బీదర్ కాల్పుల ఘటన నేపథ్యంలో జిల్లా పోలీసుశాఖ అప్రమత్తమైంది. పోలీసు అధికారులు తమ వ్యక్తిగత ఆయుధాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐ, ఆపైస్థాయి అధికారులు ఈ ఆదేశాలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. జిల్లా సరిహద్దుల్లో ఉన్న బీదర్‌లో గురువారం ఏటీఎం సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపి రూ.93 లక్షలు అపహరించిన సంగతి తెలిసిందే. ఈ దుండగులు జిల్లా మీదుగా హైదరాబాద్‌కు చేరుకుని అఫ్జల్‌గంజ్‌లోనూ కాల్పులకు తెగబడటం రాష్ట్రంలోనే కలకలం రేపింది. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బీదర్‌లో డబ్బులను చోరీ చేసి... సంగారెడ్డి జిల్లా మీదుగానే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ దుండగులు బీదర్‌కు సమీపంలో ఉన్న సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలుండటంతో బీదర్ పోలీసులు జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో జిల్లా పోలీసులు గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతం నుంచే జిల్లాలో విస్తృతంగా వాహన తనిఖీలు చేశారు. అప్పటికే దుండగులు జిల్లా దాటి హైదరాబాద్‌కు చేరుకున్నారా..? లేదా జిల్లా పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలోనే వారి కళ్లు గప్పి హైదరాబాద్ వెళ్లారా? అనేది కీలకంగా మారింది. కాగా, బీదర్‌లో జరిగిన ఘటనలు ఎదురైనప్పుడు తమ వ్యక్తిగత ఆయుధాలు అందుబాటులో ఉంచుకుంటే దుండగులను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుంటుంది. ఎస్.ఐ ఆపై స్థాయి అధికారులకు వ్యక్తిగత ఆయుధం ఉంటుంది. కొందరు అధికారులు తమ ఆయుధాన్ని వెంట పెట్టుకోరు. అవసరం రాకపోవచ్చనే ఉద్దేశంతో ఆయుధాన్ని తమ వద్ద ఉంచుకోరు. తాజాగా ఈ కాల్పుల ఘటన రాష్ట్రంలోనే కలకలం రేపడంతో ఈ ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు పోలీసులు వాహన తనిఖీలను కూడా ముమ్మరం చేశారు. నైట్ పెట్రోలింగ్‌ను పెంచారు.
భానూరు ఏటీఎంలో భారీ చోరీ..
రెండేళ్ల క్రితం బీడీఎల్ భానూరు పోలీసుస్టేషన్ పరిధిలోనూ ఏటీఎం చోరీ జరిగింది. ఓ దోపిడీ దొంగల ముఠా అక్కడి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన ఏటీఎంను ఏకంగా గ్యాస్‌కట్టర్లతో కోసి అందులో ఉన్న డబ్బులను లూఠీ చేసింది. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఇప్పుడు బీదర్‌తోపాటు, హైదరాబాద్‌లోనూ కాల్పుల ఘటనలతో ఉలికిపాటుకు గురైనట్లయింది.
ఎస్‌ఐ, ఆ పైస్థాయి అధికారులకు ఎస్పీ ఆదేశాలు
బీదర్, అఫ్జల్‌గంజ్ కాల్పుల
ఘటన నేపథ్యంలో...
అప్రమత్తమైన జిల్లా పోలీసులు..
బీదర్‌లాంటి కాల్పుల ఘటన
గతంలో కోహీర్‌లో..
ఏకంగా ఎస్‌ఐపైనే కాల్పులకు తెగబడిన
బ్యాంకు దోపిడీ ముఠా..
జిల్లాలోనూ ఇలాంటి కాల్పుల ఘటనలు..
బీదర్‌లో చోటు చేసుకున్న మాదిరిగానే సంగారెడ్డి జిల్లాలోనూ గతంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ అంతర్రాష్ట్ర బ్యాంకు దోపిడీ ముఠా కోహీర్‌లో ఓ బ్యాంకు దోపిడీకి ప్రయత్నించింది. అక్కడి అలారం మోగడంతో అప్పటి స్థానిక ఎస్‌ఐ ఆ బ్యాంకు వద్దకు చేరుకుని దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దుండగులు తమ వద్ద ఉన్న తపంచాతో ఎస్‌ఐపై కాల్పులకు తెగబడ్డారు. ఆ సమయంలో ఎస్‌ఐ తన వ్యక్తిగత ఆయుధాన్ని వెంట తీసుకెళ్లలేదు. ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి బ్యాంకు దోపిడీని అడ్డుకున్నప్పటికీ, ఈ కాల్పుల్లో ఎస్‌ఐ తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సమయంలో తన వెంట పర్సనల్ వెపన్ ఉంటే ఆ ముఠాను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలు కలిగేది. 2013లో ఈ ఘటన చోటుకుంది. ఇప్పుడు కూడా ఇలాంటి కాల్పుల ఘటన చోటు చేసుకోవడంతో పోలీసుశాఖ అప్రమత్తమైంది.
Comments
Please login to add a commentAdd a comment