వీఆర్వో, వీఆర్‌ఏలు తిరిగి మాతృశాఖలోకి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భూ భారతి చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరణ, బలోపేతం చేసేందుకు గ్రామ స్థాయి అధికారులు, సర్వేయర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రెవెన్యూ శాఖలో పని చేసిన వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసి పలు శాఖలకు బదలాయించింది. తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి గత నెల 28వ తేదీవరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించారు. అయితే వారు అంతగా మొగ్గు చూపడంలేదని తెలుస్తోంది.
సాక్షి, సిద్దిపేట: గతంలో రెవెన్యూ శాఖలో పని చేసిన వీఆర్వో, వీఆర్‌ఏలు దాదాపు 30శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సాబార్డినేట్‌గా నియమించారు. మున్సిపల్, రిజిస్ట్రేషన్, విద్యాశాఖ, మెడికల్, ఇరిగేషన్‌లతో పాటు పలు శాఖల్లో విధులు నిర్వర్తించే వారు తిరిగి రెవెన్యూలోకి వచ్చేందుకు మొగ్గు చూపడం లేదు. ఆయా శాఖల్లో విధుల్లో చేరి మూడేళ్లు కావస్తుండటంతో పదోన్నతులు వస్తాయని, అదే రెవెన్యూలో అయితే పదోన్నతులు ఆలస్యంగా వస్తాయని వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు చేసిన సర్వీస్ ఇస్తారో ఇవ్వరో...? ఇప్పుడైతే కార్యాలయంలో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నామని మళ్లీ ఎందుకు వెళ్లడం అని పలువురు పూర్వపు వీఆర్వో, వీఆర్‌ఏలు చర్చించుకుంటున్నారు. నూతన వ్యవస్థకు సంబంధించి సర్వీస్ రూల్స్, నిర్ధారణ కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. తిరిగి రెవెన్యూలోకి వెళ్తామని కాన్సెంట్ ఇచ్చిన వారిలో సైతం సుమారుగా 15 మంది వెళ్లమని కలెక్టరేట్ ఏవో వద్ద తమ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
అర్హతల వారీగా
జిల్లా వ్యాప్తంగా గతంలో వీఆర్‌ఏలు 1,049, వీఆర్వోలు 365 మందిని వివిధ శాఖల్లో బదలాయించారు. తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు ఆప్షన్లను డిసెంబర్ 28వ తేదీ వరకు స్వీకరించారు. డిగ్రీ, ఇంటర్, ఇంటర్ లోపు విద్యార్హతల ఆధారంగా లెక్కలు తీశారు. వీఎల్‌ఓకు 301, సర్వేయర్‌కు49 మంది దరఖాస్తు చేశారు. కలెక్టరేట్‌లోని సిబ్బంది ద్వారా ఈ వివరాలు అన్ని క్రోడీకరించి రెవెన్యూ శాఖకు పంపించారు. మెజార్టీ మంది సొంత వాఖకు తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపినట్లుగా దరఖాస్తుల ఆధారంగా స్పష్టమవుతోంది.
వివరాలు పంపించాం
పూర్వపు వీఆర్వో, వీఆర్‌ఏలందరికీ ఫోన్లు చేసి సమాచారం అందించాం. వారికి గూగుల్ ఫారం పంపించాం. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తును నింపారు. ఆసక్తి ఉన్న వారికి విద్యార్హతల పరిశీలించి, వాటిని ఉన్నతాధికారులకు పంపించాం. రెవెన్యూ శాఖ నుంచి నిర్ణయం వస్తే దాని ప్రకారం ముందుకు సాగుతాం.
–అబ్దుల్ రహమాన్, ఏఓ, కలెక్టరేట్
Comments
Please login to add a commentAdd a comment