సర్వహంగులు సంతరించుకున్న హుస్నాబాద్ బస్టాండ్
హుస్నాబాద్: ఆర్టీసీ బస్టాండ్ ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. గతంలో అధ్వానంగా ఉన్న బస్టాండ్‌ను సుందరీకరించారు. త్వరలో ప్రారంభానికి సిద్ధమైంది. హుస్నాబాద్ బస్టాండ్‌ను 1984లో ప్రారంభించారు. నాటి నుంచి ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. అసౌకర్యాల మధ్యే కొనసాగేది. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్టాండ్ ఆధునీకరణ కోసం రూ.2 కోట్లు మంజూరు చేయించారు. 8 మార్చి, 2024న పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. బస్టాండ్ మొదటి ప్రవేశ ద్వారాన్ని అందంగా తీర్చిదిద్దారు. ప్రయాణికులకు స్వాగతం పలికేలా గ్రీన్ గ్రాస్‌తో వెల్ కమ్ పేరుతో ఉన్న అక్షరాలను అలంకరించారు. బస్‌స్టేషన్ వెలుపల, బయట క్లాడింగ్‌తో తీర్చిదిద్దారు. అద్దంలా మెరిసేలా ఫ్లోరింగ్ చేశారు. బస్టాండ్‌లో ఉన్న 5 ఫ్లాట్‌ఫాంలకు అదనంగా మరో మూడింటిని నిర్మించారు. కొత్తగా నేమ్ బోర్డులను ఏర్పాటు చేశారు. టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు. బస్టాండ్ ఆవరణ అంతా సీసీ రోడ్డు వేయించారు. ప్రయాణికులు సేదతీరేందుకు నలుదిక్కులా గార్డెనింగ్ ఏర్పాటు చేశారు. రాత్రి వేళ బస్ స్టేషన్ జిగేల్ మనేలా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు.
కొత్తగా 20 బస్సులు
బస్‌డిపోలో ఉన్న 57 బస్సులను వివిధ రూట్లల్లో నడిపిస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యంతో రద్దీ పెరిగింది. ఏడాది కాలంలో బస్‌డిపోకు 20 కొత్త బస్సులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలతో పాటు లాంగ్ రూట్లల్లో బస్సులు నడిపిస్తున్నారు. డిపోను లాభాల బాటలోనడిపించేందుకు హైదరాబాద్, భద్రాచలం, బాసర, మంచిర్యాల ఇలా లాంగ్ రూట్లకు కొత్తగా బస్సులు నడిపిస్తున్నారు.
త్వరలో ప్రారంభం
బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. నాణ్యత ప్రమాణాలతో ఆధునీకరణ పనులు చేపట్టాం. ప్రయాణికులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేశాం. త్వరలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
– వెంకటేశ్వర్లు,
డిపో మేనేజర్, హుస్నాబాద్
రూ.2కోట్లతో హుస్నాబాద్ బస్టాండ్ ఆధునీకరణ
అద్దంలా మెరిసే ఫ్లోరింగ్
త్వరలోనే మంత్రి పొన్నంచే ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment