సిద్దిపేటజోన్: అన్నదాతలకు మద్దతు ధర అందించే లక్ష్యంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డులో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్వింటాలు కందులకు రూ.7,550 ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు. కొనుగోలు కేంద్రాలలో సరుకును విక్రయించి రైతులు మద్దతు ధర పొందాలని సూచించారు. వరి, మొక్కజొన్న, పత్తి, పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం సమర్థంగా నిర్వహించిందన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేసిన 48గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లించామన్నారు. అలాగే సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చామన్నారు. ఈ నెల 26నుంచి వ్యవసాయయోగ్యమైన భూములకు రైతు భరోసా ఇవ్వనున్నామని అన్నారు. గత ప్రభుత్వం రూ.10వేలే ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.12 వేలను రైతు భరోసా కింద ఇస్తోందన్నారు. ఉపాధి హామీ కూలీలకు సంబంధించి భూమి లేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వనున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులను పంపిణీ చేస్తామన్నారు. త్వరలో ఆయిల్ పామ్ సాగు కోసం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారని తెలిపారు. ఆయన వెంట కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ హమీద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, జిల్లా మార్క్ ఫెడ్ అధికారి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ భూములకు ‘భరోసా’
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
Comments
Please login to add a commentAdd a comment