What Went Wrong.. What Happened In Team India: గత కొన్ని రోజులుగా భారత క్రికెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత ఆ ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతానని ప్రకటించిన విరాట్ కోహ్లి... మెగా టోర్నీలో పేలవ ప్రదర్శన కారణంగా ఏమాత్రం హడావుడి లేకుండానే తన బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. ఆ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌తో టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టగా... కోహ్లికి విశ్రాంతినిచ్చారు. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గనిర్దేశనం, రోహిత్ సారథ్యంలో ఈ సిరీస్‌ను భారత జట్టు 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది.
ఇక ముంబై వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టెస్టుతో కోహ్లి జట్టులోకి రావడమే గాక... సంప్రదాయ క్రికెట్ సారథిగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఈ సిరీస్ సందర్భంగా రోహిత్‌కు విశ్రాంతినివ్వడం గమనార్హం. అంటే... కెప్టెన్సీ చేతులు మారిన తర్వాత రోహిత్ సారథ్యంలో కోహ్లి, కోహ్లి నేతృత్వంలో హిట్‌మ్యాన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అదే సమయంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒకే కెప్టెన్ ఉండాలన్న నిర్ణయంతో కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించి... ఆ స్థానంలో రోహిత్‌ను నియమించింది బీసీసీఐ.
నిజానికి టీ20 ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగాతనని ప్రకటించిన సమయంలోనే వన్డే కెప్టెన్‌గా కొనసాగుతానని కోహ్లి స్పష్టంగా చెప్పాడు. కానీ.. కారణాలేవైనా బీసీసీఐ మాత్రం అతడికి ఉద్వాసన పలికింది. సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది. నిజానికి తన డిప్యూటీగా రోహిత్‌ను కాదని.. కేఎల్ రాహుల్ , రిషభ్ పంత్ పేర్లను సూచించడం సహా ఇతరత్రా విషయాల్లో రోహిత్ ప్రాధాన్యతను తగ్గించేందుకు కోహ్లి ప్రయత్నించాడనే వదంతులు వ్యాపించాయి.
అయితే, అదే సమయంలో బీసీసీఐలోని ఓ వర్గం రోహిత్‌కు మద్దతు పలకడమే గాక.. కోహ్లిని అవమానకరంగా కెప్టెన్సీ నుంచి తప్పించారనే ప్రచారం సాగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు ముదిరిన కారణంగా ఏమాత్రం సఖ్యత కుదరడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే స్వదేశంలో సిరీస్‌లలో ఒకరి సారథ్యంలో మరొకరు ఆడని ఈ కెప్టెన్లు... దక్షిణాఫ్రికా టూర్‌లోనూ కలిసి ఆడటం కుదరకపోవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ప్రాక్టీసు సెషన్‌లో భాగంగా రోహిత్ శర్మ గాయపడటం, తొడ కండరాల నొప్పి తిరగబెట్టడంతో టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో.. వైస్ కెప్టెన్‌గా ప్రమోట్ అయిన రోహిత్ తొలిసారి ఆ హోదాలో.. తొలి సిరీస్ నుంచే వైదొలగడం అతడి అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. మరోవైపు.. ఒకవేళ వన్డే సిరీస్‌కు హిట్‌మ్యాన్ అందుబాటులోకి వచ్చినా... ఇప్పటికే సెలక్టర్ల నిర్ణయంపై గుర్రుగా ఉన్న కోహ్లి అతడి సారథ్యంలో ఆడటానికి ఇష్టపడటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
తన కూతురు వామిక మొదటి పుట్టిన రోజు సందర్భంగా కుటుంబంతో గడపాలని భావిస్తున్న కోహ్లి.. వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండబోనని ఇప్పటికే బీసీసీఐకి సమాచారం ఇచ్చాడట. అయితే, పైకి వ్యక్తిగత కారణాలు చెబుతున్నా... కోహ్లి మాత్రం తనకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకే ఇలా చేస్తున్నాడనే వాళ్లూ లేకపోలేదు. ఏదేమైనా.. టీమిండియా క్రికెట్‌లో మొత్తానికి రాజకీయాలు ముదిరాయని... బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు తెలియకుండా ఏదో జరుగుతుందంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. ఎవరు కెప్టెన్‌గా ఉన్నా సరే జట్టు ప్రయోజనాలను మాత్రం పణంగా పెట్టకండని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇగోలు పక్కనపెట్టాలని... లేదంటే.. అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తే కనీసం వాళ్లైనా ప్రతిభ నిరూపించుకుంటారంటూ హితవు పలుకుతున్నారు.
చదవండి: IND Vs SA: రోహిత్ శర్మకు గాయం.. దక్షిణాఫ్రికా పర్యటన రద్దు చేయండి!
Comments
Please login to add a commentAdd a comment