TNPL 2023 Auction: ఐపీఎల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడు ఆల్‌రౌండర్ సాయి సుదర్శన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL 2023) వేలంలో జాక్‌పాట్ కొట్టాడు. మహాబలిపురంలో జరుగుతున్న లీగ్ తొలి వేలంలో సాయి సుదర్శన్‌ను లైకా కోవై కింగ్స్ 21.6 లక్షల రికార్డు ధరకు సొంతం చేసుకుంది.
కోవై కింగ్స్ మొత్తం పర్స్ విలువ 70 లక్షలైతే.. ఒక్క సాయి సుదర్శన్‌పైనే ఆ జట్టు మూడో వంతు వెచ్చించడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ మరో ఆసక్తికర విశేషమేమింటంటే.. TNPLలో సాయి సుదర్శన్‌కు లభించే మొత్తం, ఐపీఎల్‌లో అతనికి లభించే మొత్తం కంటే అధికంగా ఉండటం. సాయి సుదర్శన్‌ను 2022 ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ బేస్ ప్రైజ్ 20 లక్షలకు సొంతం చేసుకుంది.
TNPL వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన సాయి సుదర్శన్.. 2022 ఐపీఎల్‌లో ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శన కారణంగానే అతని కొరకు ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. గత ఐపీఎల్ సీజన్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన సాయి.. 36.25 సగటున, 127.19 స్ట్రయిక్ రేట్‌తో ఓ హాఫ్ సెంచరీ (పంజాబ్ కింగ్స్‌పై 65*) సాయంతో 145 పరుగులు చేశాడు. రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్ కూడా అయిన సాయి.. దేశవాలీ సీజన్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు.
ఇదిలా ఉంటే, ఇవాళ (ఫిబ్రవరి 23), రేపు జరిగే TNPL వేలంలో మొత్తం 942 మంది ఆటగాళ్లు (తమిళనాడుకు చెందిన వారు) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్, టి నటరాజన్, వరుణ్ చక్రవర్తి, విజయ్ శంకర్ తదతరులు పాల్గొంటుండగా.. పెద్ద పేర్లలో రిటెన్షన్ చేసుకున్న ఏకైక ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు.
దిండిగుల్ డ్రాగన్స్ ఫ్రాంచైజీ యాశ్‌ను 60 లక్షలకు రిటైన్ చేసుకుంది. వేలం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఐ డ్రీమ్ తిరుపూర్ తమిజాన్స్.. టీమిండియా ఆల్‌రౌండర్, త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్‌ను 10.25 లక్షల రికార్డు ధరకు సొంతం చేసుకోగా.. ప్రస్తుత భారత పరిమిత ఓవర్ల జట్టు సభ్యుడు వాషింగ్టన్ సుందర్‌ను మధురై పాంథర్స్ 6.75 లక్షలకు , మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని దిండిగుల్ డ్రాగన్స్ 6.75 లక్షలకు, సంజయ్ యాదవ్‌ను చెపాక్ సూపర్ గిల్లీస్ 17.6 లక్షలకు, ఆల్‌రౌండర్ సోనూ యాదవ్‌ను నెల్లై రాయల్ కింగ్స్ 15.2 లక్షలకు, గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి కిషోర్‌ను తిరుపూర్ తమిజాన్స్ 13 లక్షలకు సొంతం చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment