T20 World Cup 2024: సూపర్‌-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..! | T20 World Cup 2024: If India Tops In Group A, Their Super 8 Opponents Will Be NZ, SL And AUS | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: సూపర్‌-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!

Published Wed, May 29 2024 1:23 PM | Last Updated on Wed, May 29 2024 1:27 PM

T20 World Cup 2024: If India Tops In Group A, Their Super 8 Opponents Will Be NZ, SL And AUS

క్రికెట్‌ మహా సంగ్రామం టీ20 వరల్డ్‌కప్‌ 2024 జూన్‌ 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈసారి పొట్టి ప్రపంచకప్‌లో రికార్డు స్థాయిలో 20 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్‌కు ఐదు జట్ల చొప్పున జట్లన్నీ నాలుగు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. గ్రూప్‌ దశలో ప్రతి జట్టు సొంత గ్రూప్‌లోని మిగతా నాలుగు జట్లతో ఓ మ్యాచ్‌ ఆడుతుంది. గ్రూప్‌ దశ అనంతరం గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్‌-8 దశకు అర్హత సాధిస్తాయి. 

ఈ దశలో ప్రతి జట్టు తమ సొంత గ్రూప్‌లోని జట్టు మినహా మిగతా మూడు గ్రూప్‌ల్లోని ఒకటి లేదా రెండు స్థానాల్లో నిలిచే ఏదో ఒక జట్టుతో (ప్రత్యర్ధి ఎవరో గ్రూప్‌ దశలో స్థానంపై ఆధారపడి ఉంటుంది) పోటీపడుతుంది. సూపర్‌-8 దశ ముగిసిన అనంతరం తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. రెండు సెమీస్‌ల్లో గెలిచే జట్లు జూన్‌ 29న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ రకంగా ప్రపంచకప్‌ పోటీలు జరుగుతాయి.

టీమిండియా సూపర్‌-8కి చేరితే..
ఈ ప్రపంచకప్‌లో భారత్‌ పాకి​స్తాన్‌, ఐర్లాండ్‌, యూఎస్‌ఏ, కెనడా జట్లతో గ్రూప్‌-ఏలో పోటీపడుతుంది. ఈ గ్రూప్‌లో పాక్‌ మినహా మిగతా జట్లన్నీ పసికూనలే కావడంతో భారత్‌ సూపర్‌-8కు చేరడం దాదాపుగా ఖాయమనే చెప్పాలి. టీమిండియాకు పాక్‌పై కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో భారత్‌ గ్రూప్‌ టాపర్‌గా నిలవడం ఖాయం.

ఈ నేపథ్యంలో సూపర్‌-8లో భారత్‌ ప్రత్యర్దులు ఎవరయ్యే అవకాశం ఉందనే అంశంపై ఓ అంచనా వేద్దాం. సూపర్‌-8 దశలో టీమిండియా ప్రత్యర్దులుగా గ్రూప్‌-బిలో రెండో స్థానంలో ఉండే జట్టు.. గ్రూప్‌-సిలో తొలి స్థానంలో నిలిచే జట్టు.. గ్రూప్‌-డిలో రెండో స్థానంలో నిలిచే జట్టు ఉంటుంది.

ఈ లెక్కన గ్రూప్‌-బి నుంచి సూపర్‌-8 దశలో టీమిండియా ‍ప్రత్యర్ది ఇంగ్లండ్‌ లేదా ఆస్ట్రేలియా అయ్యే అవకాశం ఉంది. ఈ గ్రూప్‌లో ఈ రెండు జట్లు మినహా మిగతా జట్టన్నీ (నమీబియా, స్కాట్లాండ్‌, ఒమన్‌) ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకుంటున్నాయి. కాబట్టి ఆ జట్లకు సూపర్‌-8 దశకు చేరుకునే అవకాశాలు చాలా తక్కువ.

గ్రూప్‌-సి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ పటిష్టమైన జట్లుగా చెప్పవచ్చు. కాబట్టి ఈ గ్రూప్‌ నుంచి టీమిండియా ప్రత్యర్దిగా న్యూజిలాండ్‌ లేదా వెస్టిండీస్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ గ్రూప్‌లో సంచలనాల జట్టైన ఆఫ్ఘనిస్తాన్‌ కూడా ఉంది. ఈ జట్టును కూడా తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. మరో రెండు జట్లైన ఉగాండ, పపువా న్యూ గినియా ఒక్క మ్యాచ్‌లో గెలిచినా ఆశ్చర్యమే అని చెప్పాలి.

గ్రూప్‌-డి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌ను గ్రూప్‌ ఆఫ్‌ డెత్‌గా పరిగణించవచ్చు. ఎందుకంటే ఈ గ్రూప్‌లో అన్ని జట్లకు సంచలనాలు సృష్టించే సామర్థ్యం ఉంది. బలాబలాల ప్రకారం సౌతాఫ్రికా ఈ గ్రూప్‌ టాపర్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా నాలుగు జట్లు శ్రీలంక, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, నేపాల్‌ ఏ మ్యాచ్‌లో ఎలా ఆడతాయో అంచనా వేయలేని పరిస్థితి. కాబట్టి ఈ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచే జట్టు ఏదో అంచనా వేయడం చాలా కష్టం. ఒకవేళ టీమిండియా గ్రూప్‌లో టాపర్‌గా నిలిస్తే.. గ్రూప్‌-డిలో రెండో స్థానంలో నిలిచే జట్టునే ఢీకొట్టాల్సి ఉంటుంది.

సూపర్‌-8లో టీమిండియా ప్రత్యర్దులు (అంచనా)..
గ్రూప్‌-బి- ఆస్ట్రేలియా (జూన్‌ 24)
గ్రూప్‌-సి- న్యూజిలాండ్‌ (జూన్‌ 20)
గ్రూప్‌-డి- శ్రీలంక (జూన్‌ 22)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement