‘ఉపాధి’లో మస్తర్ల మాయ
కలువాయి: మండలంలో ఆరుగురు ఉపాధి ిసిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎంపీడీఓ డీవీ నరసింహారావు శుక్రవారం స్థానిక పోలీసులను కోరారు. చినగోపవరం ఎఫ్‌ఏ మహేంద్రరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ పీ.బాబు రాజేష్, సాంకేతిక సహాయకులు ఆర్.ప్రసన్న, ఎంవీ.ప్రసాద్, వెంకటేశ్వర్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ జె.శీనయ్యపై ఫిర్యాదు చేశారు. 2022 – 23లో జరిగిన ఉపాధి పనుల్లో రూ.58 లక్షలకు పైగా అవినీతి జరిగినట్లు 16వ విడత సామాజిక తనిఖీల్లో వెలుగులోకి రావడం, అనంతరం విచారణలో అది నిజమని తేలడంతో వారిపై క్రిమినల్ కేసులు నమోదుకు ఉన్నతాధికారులు సిఫార్సు చేశారు. వారిపై పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు ఫైల్ చేసి, ఎఫ్‌ఐఆర్ కాపీని తమకు పంపాలని డ్వామా నెల్లూరు జిల్లా కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు పంపిన ఆదేశాలు శుక్రవారం తనకు అందినట్లు ఎంపీడీఓ పేర్కొన్నారు. ఈ మేరకు కలువాయి పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.
భారీగా అవినీతి
మండలంలో ఒక్క చినగోపవరం పంచాయతీలోనే సుమారు రూ.58 లక్షలకు పైగా అవినీతి జరిగినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాష్ట్ర విజిలెన్స్ అధికారి భవానీ హర్ష విచారణ జరిపారు. గ్రామంలో లేని 148 మందిని మస్తర్లలో ఎక్కించి వారి పేరున బిల్లులు చెల్లించి ఎఫ్‌ఏ మహేంద్ర, కంప్యూటర్ ఆపరేటర్ అకౌంట్స్ అసిస్టెంట్ పి.బాబు రాజేష్ రూ.25.5 లక్షలు అవినీతికి పాల్పడినట్లు బయటపడింది. వారు ఎవరూ ఆ గ్రామానికి చెందిన వారు కాకపోవడం, పలు రాష్ట్రాల్లో ఉన్న వారి అకౌంట్లకు నగదు జమైనట్టు తేలింది. అంతేగాక అదే కాలంలో ఇక్కడ టీఏలుగా పనిచేసిన ఆర్.ప్రసన్న, ఎంవీ ప్రసాద్, ఎం.వెంకటేశ్వర్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ జె.శీనయ్య మరో రూ.32.87 లక్షల మేర నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని తేల్చారు. ఈ మేరకు ఆయన ఉన్నతాధికారులకు నివేదికను అందజేయడంతో వారిపై క్రిమినల్ కేసులు నమోదుకు ఆదేశాలు జారీ అయ్యాయి.
అంబుడ్స్‌మెన్ పాత్ర కీలకం
చినగోపవరం ఉపాధి పనుల్లో జరిగిన అవినీతిని వెలుగులోకి తేవడంలో అంబుడ్స్‌మన్ వెంకటరెడ్డి కీలకపాత్ర పోషించారు. గ్రామంలో జరిగిన ప్రతి పనిపైనా నిఘా పెట్టారు. జాబ్‌కార్డులు, మస్తర్లు, బ్యాంక్ అకౌంట్లు లోతుగా పరిశీలించడంతోపాటు గ్రామ ఉపాధి కూలీలతో మమేకమై ఇక్కడ జరిగిన అవినీతిని వెలుగులోకి తెచ్చారు. ఈ విషయాన్ని అంతటితో వదలకుండా 16వ విడత సామాజిక తనిఖీ హియరింగ్‌కు సోషల్ ఆడిట్ డైరెక్టర్ వచ్చేలా చేశారు. అనంతరం విజిలెన్స్ అధికారుల విచారణకు పూర్తి సహాయ సహకారాలు అందించి అవినీతికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసుల నమోదులో కీలకపాత్ర పోషించారు.
కలువాయి మండలంలో
రూ.58 లక్షలకుపైగా స్వాహా
ఊర్లో లేని వారి పేర్లు రాసి
డబ్బులు నొక్కిన వైనం
ఆరుగురు ఉపాధి సిబ్బందిపై
క్రిమినల్ కేసులకు సిఫార్సు
Comments
Please login to add a commentAdd a comment