తలకు భారం కాదు.. భద్రత
కొన్ని ఘటనలు..
ద్విచక్ర వాహనదారులు కొందరు నిర్లక్ష్యానికి కేరాఫ్‌గా ఉంటున్నారు. హెల్మెట్ ధరించాలని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కించుకోవడం లేదు. తెలిసి తెలిసి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన కొన్ని రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేక
కొందరు ప్రాణాలు విడిచారు. చిన్నపాటి నిర్లక్ష్యం కుటుంబాలను రోడ్డున పడేస్తోందని, జాగ్రత్తగా ఉండాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.
నెల్లూరు(క్రైమ్): ప్రమాదాలు అనుకోకుండా జరుగుతుంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో మన చేతుల్లో ఉండదు. అయితే జాగ్రత్తలను విధిగా పాటించడం ద్వారా ప్రమాదాల బారిన పడినా సురక్షితంగా బయటపడొచ్చు. అధికశాతం రోడ్డు ప్రమాదాల్లో తలకు బలమైన గాయాలై మృత్యువాత పడేవారు ఎందరో ఉన్నారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం తప్పుతుందని తెలిసినా ద్విచక్ర వాహనదారులు కొందరు పట్టించుకోవడం లేదు. జిల్లాలో 20 రోజుల వ్యవధిలో పదిమందికి పైగా ద్విచక్ర వాహనచోదకులు రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలై మృతిచెందారు.
తప్పనిసరి..
మోటార్‌బైక్ నడిపేవారితోపాటు వెనుక కూర్చొన్న వ్యక్తులు సైతం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆ ఆదేశాలను పక్కాగా అమలు చేసేందుకు పోలీసు యంత్రాంగం నడుం బిగించింది. సోషల్ మీడియా వేదికగా హెల్మెట్ వినియోగంపై విస్తృత అవగాహన కల్పిస్తోంది. మరోవైపు వాహన తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనల ఉల్లంఘనులపై చర్యలు తీసుకుంటున్నారు.
వాటినే వినియోగించాలి
ప్రజల అవసరాల రీత్యా బైక్‌ల వినియోగం పెరిగింది. ప్రజలు అధునాతన హంగులతో కూడిన వాటిని రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. అయితే జీవితానికి అత్యంత భద్రత కల్పించే హెల్మెట్ విషయంలో మాత్రం అశ్రద్ధ చూపుతున్నారు. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కడ దెబ్బలు తగిలినా దాదాపుగా ప్రాణాలకు ముప్పు ఉండకపోవచ్చు. కానీ తలకు తగిలితే మాత్రం క్షణాల్లో ప్రాణం పోయే అవకాశం ఉంది. కొందరు రహదారుల వెంట దొరికే నాసిరకం హెల్మెట్లను కొనుగోలు చేస్తున్నారు. అవి ప్రమాద సమయంలో వాహనచోదకులు రక్షించవని పరిశీలనల్లో తేలింది. నాణ్యమైనవే వాడాలి. బీఐఎస్ స్టాండర్స్ ప్రకారం తయారు చేసిన హెల్మెట్లలో సాగేతత్వం కలిగిన పాలిస్టర్ వినియోగించడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు తలకు దెబ్బతగలకుండా కాపాడుతుంది. ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది.
చిన్న నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం
హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులు
20 రోజుల వ్యవధిలో పదిమంది మృతి
అశ్రద్ధ వద్దంటున్న పోలీసులు
పోలీసుల సూచన
చాలామంది యువకులు హెల్మెట్ ధరించకుండా వేగంగా ఇష్టానుసారంగా తిరిగేస్తున్నారు. వీరే ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. గత 20 రోజుల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీల్లో 350 మందికి పైగా హెల్మెట్ ధరించని వారికి జరిమానా విధించి ఉంటారని అంచనా. ద్విచక్ర వాహనచోదక సమయంలో విధిగా హెల్మెట్ ధరించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, మితిమీరిన వేగం, పరిమితికి మించిన ప్రయాణం, ఎదుటి వాహనచోదకులను గమనించకపోవడం వంటి అంశాలూ ప్రమాదాలకు కారణమవుతున్నాయన్న విషయాలను గమనించాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
నెల్లూరు ఎన్టీఆర్ నగర్ సమీపంలో జాతీయ రహదారిపై మోటార్‌బైక్‌పై వెళ్తున్న రామకృష్ణ అనే వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు.
నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద బైక్‌పై రోడ్డు దాటుతున్న వ్యక్తిని మరో బైక్ వేగంగా ఢీకొనడంతో చనిపోయాడు.
రామన్నపాళెం గేటు వద్ద స్కూటీ అదుపు తప్పడంతో కృష్ణకిశోర్ అనే వ్యక్తికి తలకు గాయమై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.
నార్త్‌ఆమలూరుకు చెందిన భరత్ పని నిమిత్తం బైక్‌పై వెళుతూ ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
నెల్లూరు రూరల్ మండల పరిధిలోని గుడిపల్లిపాడుకు చెందిన జగదీష్ బైక్‌పై నెల్లూరుకు వస్తూ గేదె అడ్డురావడంతో తప్పించబోయి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు.
Comments
Please login to add a commentAdd a comment